Berlin Series Review
సినిమా రివ్యూ: బెర్లిన్
రేటింగ్: 2.25/5
నటీనటులు: పెడ్రో అలోన్సో, ట్రిస్టన్ ఉల్లోవా, మిషెల్ జెన్నర్, బెగోనా వర్గాస్ తదితరులు 
ఛాయాగ్రహణం: డేవిడ్ అసిరిటో, సెర్గి బర్ట్రోలీ, మిగ్వే అమోఎడో, ఇనిగో ఇగ్లెసియాస్
సంగీతం: ఫ్రాంక్ మోంటాసెల్, లూకాస్ పెయిరే
దర్శకత్వం: డేవిడ్ బారోకల్, ఆల్బర్ట్ పింటో, జాఫ్రే కూపర్
విడుదల తేదీ: డిసెంబర్ 29, 2023
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం: నెట్‌ఫ్లిక్స్


Berlin Web Series Review: 2017లో వచ్చిన ‘మనీ హెయిస్ట్’ వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద సక్సెస్ అయిందో స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. గ్లోబల్‌గా ఫ్యాన్‌బేస్‌ను దక్కించుకున్న ఈ సిరీస్‌ ఐదు సీజన్ల పాటు సాగిన తర్వాత 2021లో ఎండ్ కార్డు వేశారు. కానీ ఈ సిరీస్‌కు ఉన్న క్రేజ్ కారణంగా నెట్‌ఫ్లిక్స్ అంత త్వరగా ‘మనీ హెయిస్ట్’ను వదలాలి అనుకోలేదు. మొదటి సీజన్‌లో బాగా ఫేమస్ అయిన ‘బెర్లిన్’ పాత్రను హీరోగా పెట్టి అదే పేరుతో వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. ఈ సిరీస్ ఇప్పుడు విడుదల అయింది. మరి ఎలా ఉంది?


కథ: బెర్లిన్ అలియాస్ ఆండ్రెస్ డె ఫొనొల్లోసా (పెడ్రో అలోన్సో) తన జీవితంలో ‘మనీ హెయిస్ట్’ సిరీస్‌కు ముందు చేసిన ఒక పెద్ద దొంగతనం నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది. పారిస్ నగరంలో 44 మిలియన్ యూరోల విలువ చేసే నగలను కొట్టేయడానికి బెర్లిన్ ఎటువంటి పథకం వేశాడు? ఈ పథకంలో ఎవరిని ఇన్వాల్వ్ చేశాడు? మనీహెయిస్ట్‌లో ఉన్న పాత్రలు ఇందులో ఏమైనా ఉన్నాయా? అన్నది తెలుసుకోవాలంటే నెట్‌ఫ్లిక్స్ ఎనిమిది ఎపిసోడ్లు చూడాల్సిందే!


విశ్లేషణ: ‘మనీహెయిస్ట్’ సిరీస్ సక్సెస్ అవ్వడానికి అతిపెద్ద కారణం పేరుకు తగ్గట్లే పూర్తిగా రాబరీ మీద ఫోకస్ చేయడం. దొంగతనం చేసే ముఠా ఎత్తులు వేయడం, బ్యాంకు లోపల ఉన్న దొంగలను పట్టుకోవడం కోసం బయట ఉన్న పోలీసులు వేసే పై ఎత్తులు, వాటికి చెక్ పెడుతూ బయట ఉన్న ప్రొఫెసర్ ‘అంతకు మించి’ అనిపించేలా ప్లానింగ్ చేయడం ఇవన్నీ ఆడియన్స్‌ను సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెడతాయి. దొంగతనంలోనే డ్రామాను ఇన్వాల్వ్ చేయడం, పాత్రలను సైతం ప్రేక్షకులు ప్రేమించేలా చేయడం అతి పెద్ద ప్లస్ పాయింట్లు. అదే యూనివర్స్ నుంచి మరో సిరీస్ వస్తుందంటే ఆ సిరీస్ కూడా అదే స్థాయిలో ఉంటుందని ప్రేక్షకులు అంచనా వేస్తారు. ఆ అంచనాలను ‘బెర్లిన్’ ఏమాత్రం అందుకోలేకపోయింది.


‘బెర్లిన్’ సిరీస్‌లో అతి పెద్ద మైనస్ దొంగతనానికి తక్కువ ప్రాధాన్యం ఇవ్వడం. ఈ సిరీస్‌లో మేకర్స్ కాన్సన్‌ట్రేషన్ రాబరీ కంటే బెర్లిన్ జీవితం మీద ఎక్కువగా ఉంది. బెర్లిన్ క్యారెక్టరైజేషన్ కూడా ‘మనీహెయిస్ట్’లో కంటే కాస్త భిన్నంగా, సాఫ్ట్ అయిపోయినట్లు కనిపిస్తుంది. మనీ హెయిస్ట్ సిరీస్‌లో చూపించినంత కఠినంగా బెర్లిన్ ఈ సిరీస్‌లో కనిపించడు. రాబరీ కోసం బెర్లిన్ ఎవరిని అయితే ఎంచుకున్నాడో వారి బ్యాక్ స్టోరీలు కూడా ఇంట్రస్టింగ్‌గా ఉండవు. దీనికి తోడు వాటిని త్వరగా ముగించకుండా సాగదీశారు.


మనీ హెయిస్ట్ సిరీస్‌ను నుంచి రెండు ఫిమేల్ క్యారెక్టర్లను కూడా ఇందులోకి తీసుకువచ్చారు. కానీ వాటి వల్ల వచ్చిన ఇంపాక్ట్ మాత్రం తక్కువే. టెక్నికల్‌గా మాత్రం ‘బెర్లిన్’ టాప్ నాచ్‌లో ఉంది. నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఈ విషయంలో మాత్రం నెట్‌ఫ్లిక్స్ ఎక్కడా రాజీపడలేదు. సిరీస్ నిడివి కూడా చాలా ఎక్కువ. ఇందులో మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ఉన్నాయి. అన్నీ కలిపితే దాదాపు ఏడు గంటల వరకు నిడివి వచ్చింది.


Also Read: 'గుంటూరు కారం' ట్రైలర్ వచ్చేస్తోంది - గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఎప్పుడంటే?


ఇక నటీనటుల విషయానికి వస్తే... బెర్లిన్ పాత్ర పోషించిన పెడ్రో అలోన్సోలో ఎంత పొటెన్షియల్ ఉందో మనీ హెయిస్ట్‌లోనే చూశాం. ఇందులో కూడా అతని నటన దాదాపు సిమిలర్‌గానే ఉంది.మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధిలో బాగానే నటించారు. కానీ వారి పాత్రలకు అంత ప్రాధాన్యం లభించలేదు.


ఓవరాల్‌గా చెప్పాలంటే... ‘మనీ హెయిస్ట్’ సిరీస్‌ను మైండ్‌లో నుంచి తీసేసి చూస్తే ‘బెర్లిన్’ పర్లేదు అనిపిస్తుంది. ఆ రేంజ్ ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం కచ్చితంగా డిజప్పాయింట్ అవుతారు.


Also Read: బబుల్‌గమ్ రివ్యూ: రాజీవ్, సుమ కనకాల కుమారుడు రోషన్ హీరోగా పరిచయమైన సినిమా... బావుందా? సాగిందా?