Guntur Kaaram Trailer And Pre-release event details : మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'గుంటూరు కారం' మూవీ ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాపై విపరీతమైన హైప్ పెంచేశారు మేకర్స్. ముఖ్యంగా ఇటీవల రిలీజైన 'కుర్చీ మడతపెట్టి' మాస్ సాంగ్ సినిమాపై అంచనాలను పీక్స్ కి తీసుకెళ్లింది. ఈ పాటలో మహేష్, శ్రీలీలా ఊర మాస్ స్టెప్పులకు అందరూ ఫిదా అయిపోయారు. గతంలో ఎన్నడు లేనంతగా మహేష్ ఈ సినిమాలో మాస్ డాన్స్ తో అదరగొట్టేసారు.
దీంతో ఈసారి థియేటర్స్ లో సంక్రాంతి సందడి మొత్తం 'గుంటూరు కారం' తోనే ఉండబోతుందని అర్థం అయిపోయింది. ఇదిలా ఉంటే గుంటూరు కారం ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహేష్ ఫ్యాన్స్ కి మూవీ టీం మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. సినిమా ట్రైలర్ తోపాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన వివరాలను సైతం పోస్టర్ ద్వారా వెల్లడించింది. జనవరి 6న 'గుంటూరు కారం' ట్రైలర్ ని విడుదల చేయబోతున్నట్టు తెలిపింది. అదే రోజు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉండబోతుందని పోస్టర్ తో స్పష్టం చేశారు. జనవరి 6 సాయంత్రం హైదరాబాద్‌లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్‌లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నట్లు తెలిసింది.
అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయట. మరోవైపు థియేట్రికల్ ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో గుంటూరు కారం మేకర్స్ ఓ సరికొత్త ట్రెండ్ ని క్రియేట్ చేశారు. గుంటూరు కారం ట్రైలర్ తో పాటూ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని అమెరికాలో లైవ్ పెట్టబోతున్నారట. ఇందుకోసం అక్కడ లైవ్ స్క్రీనింగ్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. ఇప్పటివరకు ఓ తెలుగు సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఓవర్సీస్ లో లైవ్ పెట్టించడం జరగలేదు. ఈ అరుదైన తనత మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమాకి దక్కడం విశేషం. ఓవర్సీస్ లో మహేష్ కి భారీగా క్రేజ్ ఉండటంతోనే మేకర్స్ ఈ సరికొత్త ట్రెండ్ ని క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది.
అతడు, ఖలేజా వంటి సినిమాల తర్వాత మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్ మూవీ కావడంతో 'గుంటూరు కారం' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ తన రూటు మార్చి మహేష్ ని కంప్లీట్ ఊర మాస్ క్యారెక్టర్ లో చూపించబోతున్నాడు. ఆ మాస్ ఏ రేంజ్ లో ఉంటుందో ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ ద్వారా చూపించారు. ఇక సినిమాలో మహేష్ సరసన శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, జగపతిబాబు, రమ్యకృష్ణ, ఈశ్వరి రావ్, రఘు బాబు, వెన్నెల కిషోర్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Also Read : ఓటీటీలోకి వచ్చేసిన ‘హాయ్ నాన్న’ - స్ట్రీమింగ్ ఎక్కడంటే?