Eagle Movie Postponed: 2024 సంక్రాంతికి సినిమాల మధ్య గట్టి పోటీనే జరగనుంది. ఇప్పటికే అయిదు తెలుగు సినిమాలు సంక్రాంతికి థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతుండగా.. రెండు తమిళ డబ్బింగ్ చిత్రాలు కూడా వీటితో పోటీపడడానికి ముందుకొచ్చాయి. ఇక ఇన్ని సినిమాలకు ఒకేసారి థియేటర్లు దొరకడం కష్టం కాబట్టి మేకర్స్ అంతా అయోమయంలో పడ్డారు. కొందరు అయితే ఈ పోటీ నుంచి తప్పుకోవాలనే ఆలోచనలో కూడా ఉన్నారట. అందులో ముందుగా రవితేజ ‘ఈగల్’ ఉండనుంది. రవితేజ హీరోగా నటించిన ‘ఈగల్’ మూవీ జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ అంత పోటీ మధ్య విడుదల చేయడంకంటే తప్పుకోవడం బెటర్ అని మూవీ టీమ్ ఆలోచనలో పడిందట.
త్వరలోనే అధికారిక ప్రకటన..
ప్రస్తుతం సంక్రాంతి బరిలో ఉన్న అన్ని సినిమాల్లో ‘గుంటూరు కారం’కే ఎక్కువగా థియేటర్లు లభించాయి. పైగా మిగతా చిత్రాలతో పోలిస్తే.. మహేశ్ మూవీకే ఎక్కువగా హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో మిగతా మేకర్స్ అంతా ఆందోళనలో పడ్డారు. పోటీ లేని సమయంలో విడుదల చేస్తే.. మూవీ యావరేజ్‌గా ఉన్నా హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ అంత పోటీ మధ్య మంచి టాక్ రావడం మాత్రమే కాదు.. విడుదల చేయడం కూడా కష్టంగానే మారుతుంది. అందుకే అన్ని విధాలుగా ఆలోచించి ‘ఈగల్’ను పోస్ట్‌పోన్ చేయాలనుకుందట మూవీ టీమ్. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుందని టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
నాగార్జునకు సాయంగా..
సంక్రాంతి బరిలో ఎవరు విన్నర్ అని తెలిసిన తర్వాత జనవరి 26న పెద్దగా సినిమాలు ఏవీ పోటీకి లేకపోవడంతో ‘ఈగల్’ను అదే రోజు విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. అయితే ముందుగా జనవరి 13న ఈ మూవీని విడుదల చేయాలని అనుకున్నారు కాబట్టి ఇప్పటికే కొన్ని థియేటర్లు ‘ఈగల్’ షో వేయడానికి బుక్ అయ్యాయి. ఇప్పుడు ఈ మూవీ పోస్ట్‌పోన్ చేయాలని అనుకుంటున్నారు కాబట్టి ఆ థియేటర్లను నాగార్జున నటించిన ‘నా సామిరంగ’కు త్యాగం చేయాలని అనుకుంటున్నారట. నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘నా సామిరంగ’ కూడా ఈ సంక్రాంతికే విడుదల కానుండగా.. మిగతా సినిమాలతో పోలిస్తే.. ఈ చిత్రానికి కాస్త తక్కువ థియేటర్లే దొరికాయి. అందుకే ‘ఈగల్’ షో వేయాలనుకున్న థియేటర్లలో ఇప్పుడు ‘నా సామిరంగ’ బొమ్మపడనుంది.
మళ్లీ ఇన్నాళ్లకు దర్శకుడిగా..
కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ‘ఈగల్’లో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు. దాదాపు రూ.50 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఇప్పటికే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ‘ధమాకా’ అనే చిత్రాన్ని చేశాడు రవితేజ. ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో రానున్న రెండో చిత్రమే ‘ఈగల్’. ఇప్పటికే ఎన్నో సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన కార్తిక్ ఘట్టమనేని.. ‘సూర్య వర్సెస్ సూర్య’తో డైరెక్టర్‌గా మారాడు. ఆ మూవీ ఫ్లాప్ అవ్వడంతో మళ్లీ సినిమాటోగ్రాఫీతోనే బిజీ అయ్యాడు. మళ్లీ ఇన్నాళ్లకు రవితేజను హీరోగా పెట్టి ‘ఈగల్’ను తెరకెక్కించాడు. ఇప్పటికే ‘ఈగల్’ నుంచి విడుదలయిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
Also Read: ‘సైంధవ్’ ట్రైలర్‌లో బులెట్ షాట్‌పై ట్రోల్స్ - వివరణ ఇచ్చిన డైరెక్టర్ శైలేష్