Bubblegum Movie Review
సినిమా రివ్యూ: బబుల్‌గమ్
రేటింగ్: 2/5
నటీనటులు: రోషన్ కనకాల, మానస చౌదరి, హర్ష చెముడు, కిరణ్ మచ్చ, అనన్య ఆకుల, హర్షవర్ధన్, అను హాసన్, జయరామ్ ఈశ్వర్ (చైతు జొన్నలగడ్డ), బిందు చంద్రమౌళి తదితరులతో పాటు అతిథి పాత్రలో బ్రహ్మానందం
కథ: రవికాంత్ పేరెపు, విష్ణు కొండూరు, సెరి-గన్ని
ఛాయాగ్రహణం: సురేష్ రగుతు 
సంగీతం: శ్రీచరణ్ పాకాల 
నిర్మాణ సంస్థలు: మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
నిర్మాత: పి విమల
రచన, దర్శకత్వం: రవికాంత్ పేరేపు
విడుదల తేదీ: డిసెంబర్ 29, 2023


Bubblegum movie review in Telugu: బుల్లితెరపై సుమ కనకాల (Suma Kanakala) స్టార్. ఆమెను ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. అలాగే, నటుడు రాజీవ్ కనకాలను కూడా! వాళ్ళిద్దరి కుమారుడు రోషన్ కనకాల (Roshan Kanakala) వెండితెరకు పరిచయమైన సినిమా 'బబుల్ గమ్'. తెలుగమ్మాయి మానసా చౌదరికి కథానాయికగా తొలి చిత్రమిది. 'క్షణం', 'కృష్ణ అండ్ హిజ్ లీల' విజయాల తర్వాత రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించిన చిత్రమిది. ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకర్షించాయి. మరి, సినిమా ఎలా ఉంది?


కథ (Bubblegum movie Story): ఆది అలియాస్ సాయి ఆదిత్య (రోషన్ కనకాల) కోఠి కుర్రాడు. డీజే కావాలనేది అతడి లక్ష్యం. తండ్రి (జయరామ్ ఈశ్వర్) చికెన్ షాప్ ఓనర్. పబ్బులో జాన్వీ (మానసా చౌదరి)ని చూసి ప్రేమలో పడతాడు. డబ్బున్న అమ్మాయి. ఆమెకు తెలియకుండా వెంట పడతాడు. ఫ్యాషన్ డిజైనర్ కావాలనేది జాన్వీ లక్ష్యం. టర్కీలోని ఫేమస్ కాలేజీలో అడ్మిషన్ రావడంతో ఆరు నెలల్లో అక్కడికి వెళ్ళిపోవాలని అనుకుంటుంది.


'టాయ్స్ (బాయ్స్)తో ఆడుకోవాలి గానీ మనం టాయ్స్ కాకూడదు' అని చెప్పే జాన్వీ... ఆదితో ప్రేమలో ఎలా పడింది? తన పుట్టినరోజు నాడు ప్రపోజ్ చేయాలని రెడీ అయిన జాన్వీ... ఆదిని ఎందుకు, ఎలా అవమానించింది? వాళ్ళిద్దరి మధ్య మనస్పర్థలు ఎందుకు వచ్చాయి? ఆ తర్వాత ఆది ఏం చేశాడు? జాన్వీ ఏం చేసింది? మళ్ళీ వాళ్ళిద్దరూ ఒక్కటి అయ్యారా? లేదా? అనేది సినిమా.


విశ్లేషణ (Bubblegum Review In Telugu): పాతికేళ్ళు నిండని యువతీ యువకుల్లో ప్రేమ, ఆకర్షణ పట్ల అభిప్రాయాలు మారు ఉంటాయి. ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి మనుషులు ప్రవర్తించే తీరు వేరుగా ఉంటుంది. పెరిగిన వాతావరణం, ఆ తర్వాత ఎదురయ్యే పరిస్థితులు అభిప్రాయాలను మారుస్తాయి. దర్శకుడు రవికాంత్ పేరేపు ఈ పాయింట్ తీసుకున్నారు.


పోష్ పోరితో బస్తీ కుర్రాడు ప్రేమలో పడిన కథల్ని తెరపై కొన్ని చూశాం. అయితే, 'బబుల్ గమ్'లో హీరో హీరోయిన్ల కుటుంబ నేపథ్యాలు & వాళ్ళు ఎంపిక చేసుకున్న కెరీర్స్ ఇంతకు ముందు వచ్చిన సినిమాల నుంచి ఈ సినిమాను వేరు చేశాయి. దర్శక, రచయితలు క్రియేట్ చేసిన సెటప్ బావుంది. కానీ, మేకప్ మాత్రం చాలా రొటీన్‌గా ఉంది. అంటే... టేకింగ్ & మేకింగ్‌లో ఉన్న కొత్తదనం సన్నివేశాల్లో లేదు.


యువతకు కావాల్సిన మసాలాలు 'బబుల్ గమ్'లో బాగా దట్టించారు. కానీ, స్టార్ట్ టు ఎండ్ ఎంగేజింగ్ & ఎంటర్టైన్ చేసేలా సినిమాను తీయలేకపోయారు. క్యారెక్టర్లను పరిచయం చేసిన తీరు బావుంది. తర్వాత సినిమాపై ఆసక్తి కలిగిస్తుంది. అయితే, 'ఆర్ఎక్స్ 100'తో పాటు తెలుగు, హిందీ సినిమాల ప్రభావం సినిమాలో కనిపిస్తుంది. ఒక దశ తర్వాత ఎంత సేపటికీ ముందుకు కదలని ఫీలింగ్ వస్తుంది. 'ఆర్ఎక్స్ 100' అంటూ రాసిన డైలాగ్ సినిమాపై సెల్ఫ్ సెటైర్ అనుకోవాలేమో!


ఒక యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌కు కావాల్సిన అంశాలన్నీ 'బబుల్ గమ్'లో ఉన్నాయి. కానీ, ఎంగేజ్ చేసేలా సినిమా లేదు. రొమాన్స్ తప్ప ప్రేమ కనిపించని లవ్ ట్రాక్ ఉన్నప్పటికీ... ఫస్టాఫ్ పాస్ అయిపోతుంది. ఇక, సెకండాఫ్‌లో హీరో ఫోకస్ కెరీర్ మీదకు, హీరోయిన్ ఫోకస్ హీరో మీదకు షిఫ్ట్ కావడంతో చాలా రొటీన్ సన్నివేశాలతో సహనాన్ని పరీక్షిస్తుంది. హీరో హీరోయిన్ల పేరెంట్స్ క్యారెక్టర్లలో కొంచెం కూడా కొత్తదనం లేదు. ఇంటర్వెల్ సీన్ కొత్తగా ఉన్నప్పటికీ... ప్రీ ఇంటర్వెల్ లో హీరోయిన్ కోపానికి, బ్రేకప్ చెప్పడానికి రీజన్ కన్వీన్సింగ్ గా అనిపించదు. క్లైమాక్స్ వరకు సెకండాఫ్ పరమ రొటీన్ అనిపిస్తుంది.


శ్రీచరణ్ పాకాల స్వరాలు, నేపథ్య సంగీతం ట్రెండీగా ఉంది. హీరోది డీజే క్యారెక్టర్ కావడంతో స్పేస్ తీసుకుని మరీ వెస్ట్రన్ & ఫ్యూజన్ మ్యూజిక్ వినిపించారు. సురేష్ రగుతు కెమెరా వర్క్ బావుంది. నిర్మాణంలో రాజీ పడలేదని సినిమా చూస్తుంటే అర్థం అవుతుంది. కొన్ని సన్నివేశాలకు కత్తెర వేయాలి. నిడివి తగ్గించి ఉంటే... క్రిస్పీగా. స్పీడుగా సినిమా ముందుకు వెళ్ళేది.  


నటీనటులు ఎలా చేశారంటే: రోషన్ కనకాలకు ఇది తొలి సినిమా అయినప్పటికీ... కెమెరా ఫియర్ లేదు. ఈజీగా నటించాడు. హైదరాబాదీ యువకుడిగా పర్ఫెక్ట్ సెట్ అయ్యాడు. ఇంటర్వెల్ సీన్‌, ఎమోషనల్ సీన్లలో కూడా చక్కగా నటించారు. 'బబుల్ గమ్' సినిమా నటుడిగా రోషన్ కనకాలకు మంచి డెబ్యూ. అయితే, వయసుకు మించిన పాత్ర చేశానిపిస్తుంది.


గ్లామర్ & పెర్ఫార్మన్స్... రెండూ ఉన్న అమ్మాయి మానసా చౌదరి. తొలుత అందం, ఆ తర్వాత అభినయంతో ఆకట్టుకుంది. పతాక సన్నివేశాల్లో ఆమె నటన చాలా సహజంగా ఉంది. రోషన్, మానస మధ్య కెమిస్ట్రీ కుదిరింది. లిప్ లాక్స్, రొమాన్స్ చూస్తే ఇద్దరు ప్రేమికులు సహజంగా చేసినట్టు ఉంది.


రోషన్ కనకాల తండ్రిగా జయరామ్ ఈశ్వర్ (చైతు జొన్నలగడ్డ) నటన గానీ, డైలాగ్ డెలివరీ గానీ, కామెడీ టైమింగ్ గానీ సూపర్. నిజం చెప్పాలంటే... తండ్రిలా కాకుండా పెద్దన్నయ్యలా కనిపించారు. ఆయన డైలాగులకు విజిల్స్ పడతాయి. హీరో తల్లి పాత్రలో బిందు చంద్రమౌళి, హీరోయిన్ తల్లిదండ్రులుగా అనూ హాసన్, హర్షవర్ధన్ తమ పాత్రల పరిధి మేరకు చక్కగా చేశారు. 


హీరో స్నేహితులుగా కనిపించిన ఇద్దరూ కొన్ని సన్నివేశాలు నవ్వించారు. హర్ష చెముడు క్యారెక్టర్ అంతగా క్లిక్ కాలేదు. అతడిని సరిగా వాడుకోలేదు. బ్రహ్మానందం ఓ సన్నివేశంలో తళుక్కున మెరిశారు. 


Also Read: బబుల్‌గమ్ ఆడియన్స్ రివ్యూ: మహేష్ బాబు పాటతో ఫస్ట్ ఫైట్ - సుమ కుమారుడి సినిమా గురించి నెటిజనులు ఏమన్నారంటే?


చివరగా చెప్పేది ఏంటంటే: 'బబుల్ గమ్' నోటిలో వేసుకున్నప్పుడు... మొదట ఆ ఫ్లేవర్ రుచి తగులుతూ బావుంటుంది. కాసేపటికి రుచి తగ్గి సాగుతూ ఉంటుంది. ఈ సినిమా కూడా అంతే! ప్రారంభంలో కొత్తగా కనిపిస్తుంది. తర్వాత నుంచి నిదానంగా సాగుతుంది. ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి... రోషన్, మానస, జయరామ్ ఈశ్వర్ నటన సూపర్బ్! న్యూ ఏజ్ & ట్రెండీ యూత్, మల్టీప్లెక్స్ ఆడియన్స్‌లోనూ కొందరికి మాత్రమే నచ్చే చిత్రమిది.


Also Readడెవిల్ ఆడియన్స్ రివ్యూ: బొమ్మ మాసివ్ బ్లాక్ బస్టర్ - నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాకు సోషల్ మీడియాలో టాక్ చూశారా?