వెబ్ సిరీస్ రివ్యూ : జీ కర్దా 
రేటింగ్ : 2.5/5
నటీనటులు : తమన్నా, సుహైల్ నయ్యర్, ఆశీమ్ గులాటీ, అన్యా సింగ్, సయాన్ బెనర్జీ, సంవేదన, మల్హర్ టక్కర్, హుస్సేన్ దలాల్, అక్షయ్ బింద్రా, కిరా నారాయణన్, సిమోన్ సింగ్ తదితరులు
రచన : అరుణిమా శర్మ, హుస్సేన్ దలాల్, అబ్బాస్ దలాల్  
సంగీతం : సచిన్ - జిగార్
దర్శకత్వం : అరుణిమా శర్మ, హోమీ అదజనియా  
నిర్మాత : దినేష్ విజయన్ 
విడుదల తేదీ: జూన్ 15, 2023
ఓటీటీ వేదిక : అమెజాన్ ప్రైమ్ వీడియో 
ఎపిసోడ్స్ : 8


హిందీ వెబ్ సిరీస్ 'జీ కర్దా' వెబ్ సిరీస్ (Jee Karda Web Series) అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదలైంది. ఇందులో తమన్నా భాటియా (Tamannaah Bhatia) ప్రధాన పాత్రలో నటించడంతో దక్షిణాది ప్రేక్షకుల చూపు పడింది. ఈ సిరీస్ ఎలా ఉంది? హిందీలో తీసినప్పటికీ... దక్షిణాది భాషల్లో అనువదించారు. 


కథ (Jee Karda Web Series Story) : లావణ్యా సింగ్ (తమన్నా), రిషబ్ రాథోడ్ (సుహైల్ నయ్యర్) స్కూల్ నుంచి ఫ్రెండ్స్. కొన్నేళ్ళుగా లివ్-ఇన్ రిలేషన్షిప్ (సహ జీవనం)లో ఉన్నారు. ఓ పార్టీలో లావణ్యకు రిషబ్ ప్రపోజ్ చేస్తాడు... మనం పెళ్లి చేసుకుందామని! ఆమె ఓకే చెబుతుంది. ఆ తర్వాత ఏమైంది? స్కూల్ డేస్ నుంచి వీళ్ళ ఫ్రెండ్, వివాదాలతో సహజీవనం చేసే పాపులర్ పంజాబీ సింగర్ అర్జున్ గిల్ (ఆశిమ్ గులాటీ) మీద పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఒక సితార్ విద్వాంసుడు కేసు వేయడానికి కారణం ఏమిటి? 


సరైన జీవిత భాగస్వామి కోసం పరితపించే ప్రీత్ (అన్యా సింగ్), ముంబైలోని ఇరుకు ఇంట్లో జీవించలేక భర్తతో వేరు కాపురం పెట్టాలని ప్రయత్నించే షీతల్ (సంవేదన), ఫైనాన్షియల్ ప్రాబ్లంకు తోడు పెళ్ళైన మహిళను ప్రేమించానని తెలుసుకునే షాహిద్ (హుస్సేన్ దలాల్), తమ బంధాన్ని బహిర్గతం చేయలేని భాగస్వామితో మెల్రాయ్ (సయాన్ బెనర్జీ)... లావణ్య స్కూల్ మేట్స్ ఒక్కొక్కరిదీ ఒక్కో కథ. వీళ్ళ ప్రయాణం ఏ తీరానికి చేరింది? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ (Jee Karda Web Series Review) : మనసు మహా చెడ్డది. బలహీన క్షణంలో ప్రేమికులను మర్చిపోయి మరొకరితో శారీరక సాంగత్యాన్ని కోరుతుంది. ఆ తర్వాత చేసిన పనికి గిల్టీగా ఫీలయితే? తప్పు చేశామనే భావన వెంటాడితే? 'జీ కర్దా' వెబ్ సిరీస్ కథ రాయడానికి స్ఫూర్తినిచ్చిన అంశం బహుశా ఇదే అయ్యుండొచ్చు.


'జీ కర్దా'లో దర్శక, రచయితలను అభినందించాల్సిన విషయం ఏమిటంటే... ఈ తరం యువతీ యువకుల జీవితాలను ప్రతిబింబించేలా పాత్రలను తీర్చిదిద్దారు, సిరీస్ తీశారు. లివ్-ఇన్ రిలేషన్షిప్ ఓకే కానీ పెళ్లి అంటే చేసేది తప్పా? ఒప్పా? అని ఆలోచించే అమ్మాయిగా తమన్నా క్యారెక్టర్ డిజైన్ చేశారు. సవతి తండ్రి చేతిలో లైంగిక వేధింపులకు గురయ్యే అబ్బాయి నుంచి త్వరలో పెళ్లి చేసుకోబోయే కుమార్తెతో బ్రేకప్ గురించి డిస్కస్ చేసే తల్లి వరకు... మోడ్రన్ సొసైటీలో రిలేషన్షిప్స్ మీద రీసెర్చ్ చేసి సీన్లు రాశారని అర్థం అవుతోంది.


క్యారెక్టరైజేషన్స్‌కు వస్తే... 'జీ కర్దా' దర్శక రచయితలు ఫిల్టర్స్ ఏం పెట్టుకోలేదు. స్కూల్ ఫ్రెండ్ మీద క్రష్ ఉన్న అమ్మాయి... మరొకరికి శారీరకంగా దగ్గరైనట్టు చూపించారు. ఇరుకు ఇంట్లో రొమాన్స్ ఎలా ఉంటుందో చూపించారు. రియాలిటీకి దగ్గరగా సిరీస్ తీశారు. అయితే... కథలో ట్విస్టులు ఎగ్జైట్ చేయవు. ఎప్పటికైనా ఏం జరుగుతుందో ఆడియన్స్ ఈజీగా ఊహిస్తారు. చివరి రెండు ఎపిసోడ్స్ మరీ రొటీన్ & బోరింగ్! సాగదీసిన ఫీలింగ్ కలిగింది. సయాన్ బెనర్జీ ట్రాక్ బలవంతంగా కథలో ఇరికించినట్టు ఉంది. ఆ ప్రేమకథలో డెప్త్ లేదు.


తమన్నా, సుహైల్, ఆషిమ్ ట్రాక్ ఎండింగ్ ఎక్స్‌పెక్ట్ చేసినట్టు ఉంటుంది. అలాగే, షీతల్ క్యారెక్టర్ చివరిలో భర్తతో చెప్పే మాటలు కూడా! వీటన్నిటి కంటే ముఖ్యంగా కథలో 'వీరే ది వెడ్డింగ్', 'ఫోర్ మోర్ షాట్స్' ఛాయలు ఎక్కువ కనపడతాయి. వాటి ప్రభావం 'జీ కర్దా' మీద బలంగా ఉంది. ప్రధాన పాత్రధారులు తమలో తాము మానసిక సంఘర్షణకు లోనయ్యే సన్నివేశాలను మరింత ప్రభావం చూపేలా తీయొచ్చు. కానీ, ఎందుకో ఆ దిశగా దృష్టి పెట్టలేదు. 


ట్విస్టులు, కథలో తర్వాత ఏం జరుగుతుందో ఊహించేలా ఉన్నా... సిరీస్ అలా అలా చూస్తూ ఉండేలా తీయడంలో సక్సెస్ అయ్యారు. సచిన్ - జిగార్ స్వరాలు, నేపథ్య సంగీతం బావున్నాయి. ముంబై మూడ్ కెమెరా వర్క్ కారణంగా ఎలివేట్ అయ్యింది.  


నటీనటులు ఎలా చేశారు? : కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ డాల్ రోల్స్ తమన్నా చేశారు. అయితే, 'జీ కర్దా'లో మరో అడుగు ముందుకు వేశారు. క్యారెక్టర్ డిమాండ్ చేసిందనొచ్చు లేదా ఇమేజ్ మేకోవర్ అనొచ్చు... బోల్డ్ / రొమాంటిక్ సీన్స్ చేశారు. లావణ్య పాత్రలో చక్కటి నటన కనబరిచారు. సందీప్ కిషన్ 'నిను వీడని నీడను నేను'లో కథానాయికగా నటించిన అన్యా సింగ్... ప్రీత్ పాత్రలో కనిపించారు. కాస్త ఫన్, ఇంకాస్త రొమాన్స్ మేళవించిన పాత్ర ఆమెది. డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. సుహైల్ నయ్యర్, ఆషిమ్ గులాటీ, ఇతర నటీనటుల పాత్రలకు న్యాయం చేశారు.  


Also Read : విమానం' రివ్యూ : ఏడిపించిన సముద్రఖని, వేశ్యగా అనసూయ - సినిమా ఎలా ఉందంటే?


చివరగా చెప్పేది ఏంటంటే? : 'జీ కర్దా' కథ, కథనాల్లో కొత్తదనం లేదు. ఆల్రెడీ 'వీరే ది వెడ్డింగ్' చూసిన వాళ్ళకు, ఆ సినిమాకు కొత్త వెర్షన్ కింద అనిపిస్తుంది. అయితే, న్యూ ఏజ్ ఆడియన్స్ తమను తాము రిలేట్ చేసుకునే సన్నివేశాలు ఉన్నాయి. రియాలిటీకి దగ్గరగా తీశారు. మోడ్రన్ ఆడియన్స్ టైమ్ పాస్ చేయొచ్చు.


Also Read : 'సైతాన్' రివ్యూ : బోల్డ్ సీన్స్, బ్రూటల్ కిల్లింగ్స్ - హాట్‌స్టార్‌లో వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?