Bujji and Bhairava Animated Prelude Review: ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా ‘కల్కి 2898 ఏడీ’. జూన్ 27వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఈ సినిమాకు సంబంధించిన యానిమేషన్ సిరీస్ ‘బుజ్జి అండ్ భైరవ’ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన రెండు ఎపిసోడ్లు విడుదల అయ్యాయి. ఒక్కో ఎపిసోడ్ నిడివి 14 నిమిషాలుగా ఉంది. మరో రెండు ఎపిసోడ్లు సినిమా రిలీజ్ అయ్యాక విడుదల చేస్తామని యూనిట్ ప్రకటించింది. మరి ఇప్పుడు రిలీజ్ అయిన రెండు ఎపిసోడ్లలో ఏం ఉంది?
బుజ్జి ఎవరు?
అసలు బుజ్జి అంటే ఎవరు అనేది ఈ యానిమేటెడ్ ప్రిల్యూడ్‌లో చూపించారు. BU - JZ - 1 అనే కోడ్ నేమ్ ఉన్న ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డివైస్‌నే బుజ్జి. ఈ డివైస్‌ను ఒక వెహికిల్‌కి అటాచ్ చేస్తారు. 99 మిషన్లు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసిన ఈ డివైస్ 100వ మిషన్‌లో ఉండగా... తనపై దాడి జరిగి వెహికిల్ నాశనం అయిపోయి గ్లింప్స్‌లో చూపించిన చిన్న డివైస్ మాత్రం మిగులుతుంది. 100 మిషన్లు పూర్తి చేసి కాంప్లెక్స్‌కి షిఫ్ట్ అయిపోవాలనేది దీని డ్రీమ్. ‘కల్కి’ సినిమా గ్లింప్స్‌లో ఒక పెద్ద ట్రయాంగిల్ చూపించారు కద. దాని పేరు కాంప్లెక్స్ అంట. ఈ చిన్న డివైస్‌ను ప్రభాస్ మొట్టమొదటిసారి చూసినప్పుడు దానిపై BU - JZ - 1 కోడ్ నేమ్ మొత్తాన్ని కలిపి ‘బుజ్జి’ అని చదువుతాడు. అలా దానికి బుజ్జి అనే పేరు ఫిక్స్ అవుతుంది.
భైరవ ఎవరు?
బుజ్జిలాగానే భైరవకి కూడా కాంప్లెక్స్‌కి షిఫ్ట్ అయిపోవాలనేది డ్రీమ్. దానికి ఒక మిలియన్ యూనిట్స్ అవసరం అవుతాయి. యూనిట్స్ అనేది 2898 నాటి ఇండియన్ కరెన్సీ. డబ్బు సంపాదనే ధ్యేయంగా భైరవ జీవిస్తూ ఉంటాడు. తన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అనేది చూపించలేదు. భైరవ ఉండే ఇంటి ఓనర్‌గా బ్రహ్మానందం కనిపిస్తాడు. బ్రహ్మానందం, ప్రభాస్‌ల మధ్య కామెడీ బాగా వర్కవుట్ అయింది. మరి బ్రహ్మానందం సినిమాలో ఉంటారో లేదో చూడాలి.
శంభల సిటీ రిఫరెన్స్...
మహా విష్ణువు పదో అవతారం కల్కి... శంభల నగరంలో పుడతాడనేది మన పురాణాల్లో రాసిన విషయమే. దీనికి సంబంధించిన రిఫరెన్స్ కూడా ఈ ప్రిల్యూడ్‌లో చూపించారు. కాంప్లెక్స్‌కు వెళ్తున్న వెహికిల్స్‌పై శంభల సిటీకి చెందిన రెబల్స్ దాడి చేసి అందులో ఆహారాన్ని కొల్లగొడతారు. శంభల సిటీలో పిల్లలకు కనీసం ఆహారం కూడా లేదని వీరి మాటల్లో వివరిస్తారు. ఈ రెబల్స్‌లో ఒకరు సినిమా గ్లింప్స్‌లో చూపించిన పశుపతిలా కనిపిస్తారు. దీన్ని బట్టి పశుపతి పాత్ర శంభల నగరానికి సంబంధించిన రెబల్ అనుకోవచ్చు.
ఆ విగ్రహం కమల్ హాసన్‌దేనా?
ఈ సిరీస్‌లో ఒక చోట చాలా పెద్ద విగ్రహం ఒకటి నిర్మాణంలో ఉన్నట్లు చూపిస్తారు. ఆ విగ్రహం చుట్టూ ఒక చిన్న యాక్షన్ ఎపిసోడ్ కూడా ఉంటుంది. ఆ విగ్రహం పోలికలు చూడటానికి కాస్త కమల్ హాసన్ తరహాలో ఉంటాయి.
Also Read: ఫ్యూరియోసా రివ్యూ: ‘మ్యాడ్ మ్యాక్స్’ ప్రీక్వెల్ ఎలా ఉంది? ఫస్ట్ పార్ట్ రేంజ్‌లో ఆకట్టుకుందా?
వరల్డ్ బిల్డింగ్ ఎలా ఉంది?
తాము బిల్డ్ చేసిన 2898 నాటి వరల్డ్ ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం కూడా ఈ గ్లింప్స్‌లో చేశారు. ‘ఆల్టర్డ్ కార్బన్’, ‘రెడీ ప్లేయర్ వన్’, ‘డ్యూన్’ వంటి ఫ్యూచరిస్టిక్ సినిమాలు, సిరీస్‌ల్లో చూసినట్లే బాగా డబ్బులున్న వాళ్లు, పాలించే వాళ్లు అంతా ప్రత్యేకమైన ప్రాంతంలో, డబ్బు లేని వాళ్లు మరో ప్రాంతంలో ఉన్నట్లు చూపించారు. 2898 నాటికి కరెన్సీ రూపాయల్లో ఉండదు. అది యూనిట్స్‌లోకి మారిపోయి ఉంటుంది. అప్పటికి పూర్తిగా డిజిటల్ మనీనే. ప్రతి ఒక్కరి చేతికి ఒక డివైస్ ఉంటుంది. నీ దగ్గర ఎంత డబ్బులు ఉంటాయో ఆ డివైస్‌లో కనిపిస్తుంది. మన డివైస్‌ని వేరే వారి డివైస్ దగ్గరికి తీసుకెళ్లి ఆథెంటికేషన్ ఇస్తే మనీ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఓవరాల్‌గా అరగంట యానిమేషన్ సిరీస్‌తో సినిమా మీద ఇంట్రస్ట్‌ని డబుల్ చేయడంలో టీమ్ సక్సెస్ అయ్యారు.
కల్కి... భైరవ ఒక్కరు కాదా?
మన పురాణాల ప్రకారం కల్కి శంభల నగరంలో పుడతారు. కానీ ఈ సినిమాలో ప్రభాస్ పోషించిన భైరవ పాత్ర కాశీ నగరంలో ఉంటుంది. భైరవ పాత్ర బ్యాక్‌గ్రౌండ్ గురించి కూడా పెద్దగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. చిన్నప్పుడు శంభల నగరంలో పుట్టి తర్వాత భైరవ కాశీ నగరానికి వస్తాడా? లేకపోతే కల్కి పాత్ర అవతారానికి భైరవ సాయం చేస్తాడా... ఇలాంటి ఇంట్రస్టింగ్ విషయాలు తెలియాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.