సినిమా రివ్యూ : ఫ్రెడ్డీ
రేటింగ్ : 3/5
నటీనటులు : కార్తీక్ ఆర్యన్, అలాయా ఎఫ్ తదితరులు
ఛాయాగ్రహణం : అయాంక బోస్
సంగీతం : ప్రీతం
నిర్మాణ సంస్థ : బాలాజీ టెలి ఫిల్మ్స్
కథ, స్క్రీన్ ప్లే : పర్వీజ్ షేక్
దర్శకత్వం : శశాంక ఘోష్
విడుదల తేదీ: డిసెంబర్ 2, 2022
ఓటీటీ వేదిక : డిస్నీప్లస్ హాట్‌స్టార్


బాలీవుడ్ కొత్తతరం హీరోల్లో కార్తీక్ ఆర్యన్‌ది ప్రత్యేక శైలి. రొమాంటిక్ కామెడీలతో హిట్లు కొట్టడం తన స్పెషాలిటీ. తెలుగు బ్లాక్‌బస్టర్ ‘అల వైకుంఠపురంలో’ సినిమాను ‘షెహజాదా’ పేరిట హిందీలో రీమేక్ కూడా చేస్తున్నాడు. ఈ సినిమా 2023 ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇటీవల తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకి వచ్చి కొత్త తరహా సినిమాలు కూడా ప్రయత్నిస్తున్నాడు. గతేడాది ‘ధమాకా’ అనే థ్రిల్లర్ సినిమాతో ఓటీటీలోనే హిట్ కొట్టిన కార్తీక్, ఇప్పుడు మళ్లీ మరో సైకలాజికల్ థ్రిల్లర్‌తో ఓటీటీలోనే ప్రేక్షకులను పలకరించాడు. అదే ‘ఫ్రెడ్డీ’ సినిమా. డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమ్ అవుతున్న సినిమా కార్తీక్ ఆర్యన్‌కు మరో థ్రిల్లింగ్ హిట్ ఇచ్చిందా?


కథ: డాక్టర్ ఫ్రెడ్డీ జిన్‌వాలా (కార్తీక్ ఆర్యన్) పెద్ద డెంటిస్ట్. పెళ్లి చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే ఫ్రెడ్డీ ఇంట్రావర్ట్ బిహేవియర్ కారణంగా అమ్మాయిలెవరూ తనను ఇష్టపడరు. అయితే ఒక పార్టీలో కైనాజ్ ఇరానీని (అలాయా ఎఫ్) చూసి ఇష్టపడతాడు. కానీ ఆమెకు అప్పటికే పెళ్లయిందని తెలుస్తుంది. తర్వాత ఒకరోజు అనుకోకుండా ఫ్రెడ్డీ క్లినిక్‌కు ట్రీట్‌మెంట్ కోసం కైనాజ్ వస్తుంది. కైనాజ్‌ను తన భర్త బాగా కొడుతున్నాడని ఫ్రెడ్డీ గమనిస్తాడు. దీంతో అతని అడ్డు తొలగించి కైనాజ్‌ను దక్కించుకోవాలనుకుంటాడు. కైనాజ్ దీనికి మొదట ఒప్పుకోకపోయినా తర్వాత సరే అంటుంది. దీంతో కైనాజ్ భర్తను ఫ్రెడ్డీ కారు యాక్సిడెంట్ చేసి చంపేస్తాడు. ఆ తర్వాత ఫ్రెడ్డీ, కైనాజ్‌ల జీవితంలో ఎటువంటి మార్పులు వచ్చాయి? వీరి కథ ఎటు చేరుకుంది? తెలియాలంటే డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ఫ్రెడ్డీ చూడాల్సిందే.


విశ్లేషణ: ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే దర్శకుడు శశాంక ఘోష్ కానీ, హీరో కార్తీక్ ఆర్యన్ కానీ ఈ స్థాయి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాను ఇప్పటివరకు తీయలేదు. కార్తీక్ ఆర్యన్ గతంలో ‘ధమాకా’ తీసినప్పటికీ దానికి, దీనికి అసలు సంబంధం లేదు. శశాంక ఘోష్ నెరేషన్ స్టైల్‌కి, కార్తీక్ ఆర్యన్ స్టెల్లార్ పెర్ఫార్మెన్స్ తోడయి సినిమాను ఎక్కడికో తీసుకెళ్తాయి.


నిజానికి ‘ఫ్రెడ్డీ’ చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. ఫ్రెడ్డీ పెళ్లి చూపుల ప్రయత్నాలు విఫలం కావడం, కైనాజ్‌తో పరిచయం, లవ్ ట్రాక్, సాంగ్స్ దగ్గర సినిమా కొంచెం స్లో అయినా... కైనాజ్ భర్తను హత్య చేయాలని ఫ్రెడ్డీ ఫిక్స్ అయినప్పటి నుంచి సినిమా పరుగులు పెడుతుంది. అక్కడ నుంచి అనవసరమైన సన్నివేశం కాదు కదా, అక్కర్లేని షాట్ కూడా కనిపించదు. ఒక్క షాట్ మిస్సవకుండా సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెడతారు.


అన్నిటికీ భయపడే ఒక అమాయకమైన డాక్టర్‌లో నుంచి కరడుగట్టిన నేరస్తుడు, సైకో బయటకు వచ్చే సన్నివేశాలను చాలా కన్విన్సింగ్‌గా రాశారు. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన హాలీవుడ్ సినిమా ‘క్విక్‌గన్ మురుగన్’ తీసింది కూడా ఈ సినిమా దర్శకుడు శశాంక్ ఘోషే.


అవ్వడానికి ‘ఫ్రెడ్డీ’ ఓటీటీ సినిమానే అయినా టాప్ టెక్నీషియన్స్ దీనికి పని చేశారు. తెలుగులో ‘దువ్వాడ జగన్నాథం (డీజే)’, ‘గద్దలకొండ గణేష్’, హిందీలో ‘కిక్’, ‘రేస్ 3’ వంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించిన అయాంక బోస్ ఈ సినిమాకు కూడా ఛాయాగ్రహణం అందించారు. సినిమా మూడ్‌కు తగ్గట్లు ఆయన కెమెరా వర్క్ ఉంది. అలాగే బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతం అందించిన పాటలు, ముఖ్యంగా నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. ఎడిటర్ చందన్ అరోరా సినిమాను చాలా క్రిస్ప్‌గా కట్ చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.


Also Read : వదంది రివ్యూ: అమెజాన్ ప్రైమ్‌లో కొత్త థ్రిల్లర్ వెబ్ సిరీస్ - థ్రిల్ చేసిందా? బోర్ కొట్టించిందా?


ఇక నటీనటుల విషయానికి వస్తే... ఇప్పటివరకు కార్తీక్ ఆర్యన్ చేసిన పాత్రల్లో ‘ఫ్రెడ్డీ’ ది బెస్ట్ అని చెప్పవచ్చు. ఒక రకంగా సినిమా అంతా తన వన్ మ్యాన్ షోనే కనిపిస్తుంది. ఫిట్‌గా, సరదాగా, లవర్ బోయ్ పాత్రల్లో ఎక్కువగా కనిపించే కార్తీక్ దానికి పూర్తి భిన్నంగా ఇంట్రావర్డ్‌గా, ఎంతో లోతున్న పాత్రలో కనిపించాడు. కైనాజ్ పాత్రలో కనిపించిన అలాయా స్క్రీన్ మీద అందంగా కనిపిస్తుంది. మిగతా పాత్రలకు కథలో పెద్దగా స్కోప్ లేదు.


ఓవరాల్‌గా చెప్పాలంటే... థ్రిల్లర్, సైకలాజికల్ సినిమాలను ఇష్టపడేవారు కచ్చితంగా చూడాల్సిన సినిమా ‘ఫ్రెడ్డీ ’. అయితే ఓటీటీ సినిమా కాబట్టి అక్కడక్కడా కాస్త అభ్యంతర సన్నివేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కుటుంబంతో కలిసి చూడటం కంటే సింగిల్‌గా ఉన్నప్పుడో, ఫ్రెండ్స్‌తోనో చూడటం బెటర్.


Also Read : 'గోల్డ్' రివ్యూ : పృథ్వీరాజ్ సుకుమారన్, నయనతారతో 'ప్రేమమ్' దర్శకుడు తీసిన సినిమా