సినిమా రివ్యూ : గోల్డ్
రేటింగ్ : 2.5/5
నటీనటులు : పృథ్వీరాజ్ సుకుమారన్, నయనతార, దీప్తి సతి, అజ్మల్ అమర్, కృష్ణ శంకర్, మల్లికా సుకుమారన్ తదితరులు
ఛాయాగ్రహణం : అనేద్ సి. చంద్రన్, విశ్వజిత్ ఒడుక్కథిల్
సంగీతం : రాజేష్ మురుగేశన్
నిర్మాతలు : సుప్రియా మీనన్, లిస్టిన్ స్టీఫెన్
రచన, దర్శకత్వం : అల్ఫోన్స్ పుత్రెన్
విడుదల తేదీ: డిసెంబర్ 1, 2022
మలయాళంలో నివిన్ పౌలి, సాయి పల్లవి జంటగా నటించిన 'ప్రేమమ్' భాషలకు అతీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేయగా... అక్కడ కూడా విజయం అందుకుంది. 'ప్రేమమ్' విడుదలైన ఏడేళ్ళకు, ఆ సినిమా దర్శకుడు అల్ఫోన్స్ పుత్రెన్ (Alphonse Puthren) మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran), నయనతార (Nayanthara) నటించిన మలయాళ సినిమా 'గోల్డ్' (Gold Movie). ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే?
కథ (Gold Movie Story) : జోషి (పృథ్వీరాజ్ సుకుమారన్) ఇంటి ముందు ఎవరో ఓ బొలెరో ట్రక్ పార్క్ చేసి వెళిపోతారు. కొత్తగా కొనుకున్న కారును ఇంటి ముందుకు తీసుకు వెళ్ళడానికి అది అడ్డంగా ఉంటుంది. దాంతో జోషి పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ట్రక్‌లో ఏముందో? అని చూస్తే స్పీకర్స్ ఉంటాయి. ట్రక్ కొట్టేయడానికి ఓ విలన్ గ్యాంగ్ వస్తుంటుంది. వాళ్ళను జోషి కొట్టి పంపిస్తుంటాడు. ఒకరోజు జోషి ఇంట్లో మ్యూజిక్ స్పీకర్ పని చేయదు. ట్రక్‌లో ఓ స్పీకర్ తీసుకుంటాడు. అప్పుడు అది స్పీకర్ కాదని, స్వచ్ఛమైన బంగారాన్ని స్పీకర్స్ రూపంలో ప్యాక్ చేశారని తెలుస్తుంది. ఆ తర్వాత జోషి ఏం చేశాడు? అసలు, బంగారం ఎవరిది? ఎందుకు జోషి ఇంటి ముందు వదిలేసి వెళ్ళిపోయారు? పోలీసులకు ట్రక్‌లో ఉన్నది బంగారం అని తెలిసిందా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Gold Movie Telugu Review) : 'గోల్డ్' ఏ జానర్ సినిమా అంటే... కామెడీ అని చెప్పాలి. దాన్ని థ్రిల్లర్ తరహాలో తెరకెక్కించాలని అనుకున్నారు. థ్రిల్ కంటే ప్రేక్షకులను కామెడీ ఎక్కువ ఆకట్టుకుంటుంది. క్యారెక్టర్లు ఎక్కువ అయినప్పటికీ... దర్శకుడు ఎటువంటి కన్‌ఫ్యూజన్ లేకుండా ప్రజెంట్ చేశారు. తెరపై ప్రతి పాత్ర ప్రత్యేకంగా కనిపిస్తుంది. పేర్లు విచిత్రంగా ఉంటాయి. క్యారెక్టరైజేషన్లు ప్రేక్షకులు నోటీస్ చేసేలా ఉంటాయి. మరి, సినిమా ఎలా ఉంది? అంటే...
'గోల్డ్' కామెడీ థ్రిల్లర్ అయినప్పటికీ... దర్శకుడు అల్ఫోన్స్ ఓ సందేశం ఇచ్చారు. చీమ చిన్నది అయినప్పటికీ... తనకంటే ఎన్నో రేట్లు బరువున్న తీపి పదార్థాలను తీసుకువెళ్లడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. 'గోల్డ్'లో హీరో సామాన్యుడు అయినా... తన శక్తికి మించి మరీ బంగారాన్ని కొట్టేయాలని చూస్తాడు. చీమకు అడ్డంకులు ఎదురైనట్టు... హీరోకి ఎటువంటి అడ్డంకులు ఎదురయ్యాయనేది సినిమా. హీరో ప్రయత్నం, ప్రయాణం ఆసక్తికరంగా మొదలైనా... కొంత సమయం గడిచిన తర్వాత పడుతూ లేస్తూ ముందుకు వెళుతుంది. ప్రేక్షకులు పక్కకు చూసేలా చేస్తుందీ సినిమా. మధ్య మధ్యలో అల్ఫోన్స్ మార్క్ కామెడీ ఆకట్టుకుంటుంది. ప్రకృతికి ముడిపెడుతూ సన్నివేశాలు చిత్రీకరించిన తీరు బావుంది. అల్ఫోన్స్ ఆ విషయంలో తన ప్రత్యేకత చాటుకున్నారు.
చీమ తనకు దొరికిన తీపిని ఇతర చీమలకు పంచి పెడుతుంది. ఈ సినిమాలో హీరో కూడా అంతే! అయితే... అతడు ఎలా ఇతరులకు ఇచ్చాడనేది సస్పెన్స్. అల్ఫోన్స్ కొన్ని సీన్లు తీసిన విధానం ఆకట్టుకుంటుంది. దర్శకుడిగా అతడి డిటైలింగ్ చాలా నిశితంగా పరిశీలిస్తే గానీ అర్థం కాదు. కానీ, డిటైలింగ్ పేరుతో మరీ స్లోగా సినిమాను నడిపించాడు. అందువల్ల, మధ్యలో కొన్ని బోరింగ్ మూమెంట్స్ ఉంటాయి. పాటలు బావున్నాయి. సెకండాఫ్‌లోని పాటల్లో వచ్చే అమ్మాయి డ్యాన్స్ బాగా చేసింది. కానీ, ఆ పాటలు కథకు అడ్డం పడ్డాయి. రాజేష్ మురుగేశన్ స్వరాలు బావున్నాయి. నేపథ్య సంగీతం కూడా! కమర్షియల్ సినిమాల్లో సీన్స్ మీద అల్ఫోన్స్ కొన్నిసార్లు సెటైర్లు వేశారు. కథ ఎంతసేపటికీ ముందుకు కదలదు. అక్కడ అక్కడే తిరుగుతూ ఉంటుంది. అందువల్ల, సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ లొకేషన్లలో లాగించేశారు.
నటీనటులు ఎలా చేశారు? : ప్రేక్షకులకు ముందుగా ఓ విషయం చెప్పాలి. ఈ చిత్రంలో నయనతారది అతిథి పాత్ర. గట్టిగా లెక్కపెడితే... నాలుగైదు సీన్స్‌లో ఆమె కనపడతారు. ఒకవేళ సీక్వెల్ తీస్తే... అందులో ఎక్కువ సేపు కనిపిస్తారేమో!? హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఎంజాయ్ చేస్తూ జోషి క్యారెక్టర్ చేసినట్టు సినిమా చూస్తున్నప్పుడు తెలుస్తుంది. దీప్తి సేతి ఓ సన్నివేశం, ఓ పాటలో కనిపించారు. పాటలో పృథ్వీరాజ్‌తో పాటు హుషారుగా స్టెప్పులు వేశారు. తెరపై చాలా మంది నటీనటులు కనిపిస్తారు. ప్రతి ఒక్కరూ తమ పాత్ర పరిధి మేరకు చేశారు.
Also Read : 'రిపీట్' రివ్యూ : నవీన్ చంద్ర, మధుబాల నటించిన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సినిమా ఎలా ఉందంటే?
ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : 'గోల్డ్' సింపుల్ కథ. అంతే సింపుల్‌గా కామెడీతో ప్రేక్షకులకు చెప్పాలని ప్రయత్నించారు. అయితే, ఈసారి 'ప్రేమమ్'లా సక్సెస్ కాలేదు. ఫిల్మ్ మేకింగ్ పరంగా ఆయన అప్రోచ్ అభిమానులను ఆకట్టుకుంది. సినిమాగా చూస్తే సగటు ప్రేక్షకులను కాస్త డిజప్పాయింట్ చేయవచ్చు. నో థ్రిల్స్... ఓన్లీ కామెడీ! నవ్వుకోవడం కోసం అయితే ఓసారి వెళ్ళవచ్చు.
Also Read : 'తోడేలు' రివ్యూ : తెలుగులో సినిమా హిట్టా? ఫట్టా?