సినిమా రివ్యూ : ది గ్రేట్ ఇండియన్ సూసైడ్
రేటింగ్ : 2.5/5
నటీనటులు : హెబ్బా పటేల్, రామ్ కార్తీక్, పవిత్రా లోకేష్, నరేష్ విజయకృష్ణ, బబ్లూ, జయప్రకాష్ తదితరులు
ఛాయాగ్రహణం : అనంత్ నాగ్ - అజయ్ నాగ్
సంగీతం : శ్రీచరణ్ పాకాల
రచన, నిర్మాణం, దర్శకత్వం : విప్లవ్ కోనేటి
విడుదల తేదీ : అక్టోబర్ 6, 2023 
ఓటీటీ వేదిక : ఆహా


హెబ్బా పటేల్ (Hebah Patel), రామ్ కార్తీక్ జంటగా నటించిన సినిమా 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్' (The Great Indian Suicide Review). ఇంతకు ముందు 'తెలిసినవాళ్లు' పేరుతో ఫస్ట్ లుక్ విడుదల చేశారు. గోడపై హెబ్బా పటేల్ ఫోటో, కుర్చీలో తల లేని శరీరం... దర్శక నిర్మాత విప్లవ్ కోనేటి ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేశారు. 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్' పేరుతో ఈ సినిమాను ఎక్స్‌క్లూజివ్‌గా ఆహా ఓటీటీలో విడుదల చేసింది. 


కథ (The Great Indian Suicide Story) : హేమంత్ (రామ్ కార్తీక్) అనాథ. సొంతంగా మాంచి కాఫీ షాప్ రన్ చేస్తున్నాడు. చైత్ర (హెబ్బా పటేల్) హోమ్ మేడ్ కుకీస్ సరఫరా చేస్తుంటుంది. ఆమె పద్ధతి, తీరు చూసి హేమంత్ ప్రేమలో పడతాడు. ఒక రోజు ప్రపోజ్ చేస్తాడు. హేమంత్ అంటే ఇష్టం ఉన్నప్పటికీ చైత్ర నో చెబుతుంది. కుటుంబ సభ్యులందరూ కొన్ని రోజుల్లో ఆత్మహత్యలు చేసుకోబోతున్నామని చెప్పి షాక్ ఇస్తుంది. ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కల్ట్ సూసైడ్ ఎందుకు ప్లాన్ చేశారు? దీని వెనుక చైత్ర పెదనాన్న నీలకంఠం (సీనియర్ నరేష్) పాత్ర ఏమిటి? నరేష్ భార్యగా నటించిన పవిత్రా లోకేష్, ఇతర కుటుంబ సభ్యుల పాత్రలు ఏమిటి? అనేది 'ఆహా' ఒరిజినల్ సినిమా 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్' చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ (The Great Indian Suicide Review) : ఢిల్లీలో జరిగిన బురారీ ఫ్యామిలీ సూసైడ్స్ సంచలనం సృష్టించాయి. తమన్నా 'ఆఖ్రి సచ్' వెబ్ సిరీస్ కథ కల్పితమే అయినా ఆ హత్యలను ఆధారంగా చేసుకుని తీశారు. 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్'కి కూడా అటువంటి సామూహిక ఆత్మహత్యలు కారణమని చెప్పాలి. దర్శకుడు ఆ విధమైన ఘటనలు ఎక్కడ జరిగాయో కూడా సినిమాలో చూపించారు. అయితే... కథనం విషయంలో ఆయన తెలివితేటలు చూపించారు. చివరి అరగంట మలుపులతో నడిపి ఉత్కంఠ పెంచారు.  


సాధారణ ప్రేమ కథగా 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్' మొదలైంది. రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ పాత్రలు పరిచయం చేయడానికి దర్శకుడు కొంత సమయం తీసుకున్నారు. స్టార్టింగ్ సీన్స్ సోసోగా ఉన్నాయి. సూసైడ్ కాన్సెప్ట్ స్టార్ట్ అయ్యాక కథలో కాస్త వేగం పెరిగింది. హెబ్బా పటేల్ ఇంటిలో రామ్ కార్తీక్ ఎంటరైన తర్వాత ఆసక్తి మొదలైంది. 


కుటుంబం అంతా ఆత్మహత్యలు చేసుకోవాలని అనుకోవడం వెనుక కారణం ఏమిటి? దానిని హీరో ఎలా చేధించాడు? అనేది క్లుప్తంగా కథ! ఒక్కసారి ఆ కథ మొదలైన తర్వాత దాన్నుంచి బయటకు రాలేదు దర్శకుడు. మనం వార్తల్లో చదివిన, విన్న కథలే అయినప్పటికీ... ఆసక్తిగా ముందుకు నడిపారు. 


ఆత్మహత్యల వెనుక ఉన్న రిజిన్ రివీల్ చేయడం పెద్ద ట్విస్ట్. దొంగ బాబాలు / స్వామీజీలు బాగోతాలు, లైంగిక వేధింపుల బారిన పడ్డ అమ్మాయిలు... చాలా విషయాలను దర్శకుడు ప్రస్తావించారు. ఆ విషయాలను కనెక్ట్ చేసిన తీరు బావుంది. పాటలలో చార్ట్ బస్టర్స్ ఉంటే బావుండేది. నేపథ్య సంగీతం బావుంది. కెమెరా వర్క్ ఓకే. పరిమిత నిర్మాణ వ్యయంలో ఉన్నంతలో బాగా తీశారని తెరపై తెలుస్తూ ఉంది.  


నటీనటులు ఎలా చేశారంటే : చైత్రగా హెబ్బా పటేల్ డీ గ్లామర్ రోల్ చేశారు. నటిగా ఆమె కొత్తదనం చూపించలేదు. కానీ, ఆమె ముఖంలో అమాయకత్వం ఆ పాత్రకు సూటయ్యింది. రామ్ కార్తీక్ లుక్స్ బావున్నాయి. డీసెంట్ యాక్టింగ్ చేశారు. ఇద్దరూ ప్రేమలో ఉన్నారనే విధంగా వాళ్ళ కెమిస్ట్రీ కుదరలేదు. 


హీరోయిన్ పెదనాన్నగా, కోట్ల ఆస్తికి యజమానిగా సీనియర్ నరేష్ కనిపించారు. మేక వన్నె పులి తరహా క్యారెక్టర్ అది. నరేష్ పాత్రకు ఇచ్చిన ట్విస్ట్ సర్‌ప్రైజ్ చేస్తుంది. పవిత్రా లోకేష్ పాత్ర హుందాగా ఉంది. నుదుట తిలకం, చేతిలో జపమాల, నిండైన చీర కట్టులో చక్కగా కనిపించారు. జయప్రకాశ్ పాత్ర నిడివి తక్కువ. ఉన్నంతలో బాగా చేశారు. హీరో స్నేహితుడిగా బబ్లూ ఓకే.
  
Also Read : 'మామా మశ్చీంద్ర' రివ్యూ : సుధీర్ బాబు ట్రిపుల్ యాక్షన్ హిట్టా? ఫట్టా?


చివరగా చెప్పేది ఏంటంటే : 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్'లో స్టార్టింగ్ సీన్స్ కొన్ని మినహాయిస్తే... ఆత్మహత్యల కాన్సెప్ట్ మొదలైన తర్వాత ఎంగేజింగ్‌గా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ట్విస్ట్స్ బావున్నాయి. వీకెండ్ ఓ లుక్ వేయవచ్చు. ఇదొక టైమ్ పాస్ థ్రిల్లర్!


Also Read 'మ్యాడ్' రివ్యూ : ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ సినిమా ఎలా ఉంది? నవ్వించారా? లేదా?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial