సినిమా రివ్యూ : మ్యాడ్
రేటింగ్ : 2.75/5
నటీనటులు : నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్, రఘుబాబు, 'రచ్చ' రవి, మురళీధర్ గౌడ్, విష్ణు, అంతోనీ, శ్రీకాంత్ రెడ్డి, అనుదీప్ కేవీ తదితరులు
ఛాయాగ్రహణం : షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి
సంగీతం : భీమ్స్ సిసిరోలియో
సమర్పణ : సూర్యదేవర నాగవంశీ 
నిర్మాతలు : హారిక సూర్యదేవర, సాయి సౌజన్య
రచన, దర్శకత్వం : కళ్యాణ్ శంకర్
విడుదల తేదీ: అక్టోబర్ 6, 2023 


మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ (Narne Nithin) హీరోగా పరిచయమైన సినిమా 'మ్యాడ్' (Mad Telugu Movie). ఇందులో రామ్ నితిన్, సంగీత్ శోభన్ మరో ఇద్దరు హీరోలు. 'జాతి రత్నాలు' కంటే ఎక్కువ నవ్విస్తుందని నిర్మాత నాగవంశీ చెప్పారు. ప్రచార చిత్రాలు చూస్తే కాలేజ్ కామెడీని క్యాప్చర్ చేసినట్లు ఉన్నాయి. మరి, సినిమా ఎలా ఉంది? 


కథ (Mad Movie Story) : అశోక్ (నార్నే నితిన్), మనోజ్ (రామ్ నితిన్), దామోదర్ (సంగీత్ శోభన్) ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతారు. వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అవుతారు. అశోక్ తక్కువ మాట్లాడతాడు. కొంచెం ఇంట్రావర్ట్ టైపు! అతను అంటే జెన్నీ (అనంతిక సనీల్ కుమార్)కి ఇష్టం. మరి, అతనికి? అమ్మాయిలు కనిపిస్తే మనోజ్ ఫ్లర్ట్ చేస్తాడు. అటువంటి అబ్బాయి శృతి (శ్రీ గౌరీ ప్రియా రెడ్డి)ని చూసి ఇష్టపడతాడు. అతనికి ఆ అమ్మాయి ఎందుకు దూరం అయ్యింది? మళ్ళీ దగ్గర అయ్యిందా? లేదా? తనకు అమ్మాయిలు పడరని బలమైన నమ్మకంతో ఉన్న దామోదర్ కి ఓ అజ్ఞాత అమ్మాయి లేఖ రాస్తుంది. రోజూ ఫోనులో మాట్లాడుతుంది. ఆమె ఎవరు? ఈ కథలో రాధ (గోపికా ఉదయన్) పాత్ర ఏమిటి? 


మనోజ్, అశోక్, దామోదర్... ముగ్గురిదీ ఓ గ్రూప్! దాని పేరు మ్యాడ్ (MAD)! వీళ్ళ ప్రేమ కథలు పక్కన పెడితే... కాలేజీలో సీనియర్స్ వీళ్ళను ఎలా ర్యాగింగ్ చేశారు? జేసీ కాలేజీతో గొడవ ఏమిటి? వీళ్ళు సీనియర్స్ అయ్యాక ఏం చేశారు? అనేది సిల్వర్ స్క్రీన్ మీద చూడాలి. 


విశ్లేషణ (Mad Movie Review) : 'హ్యాపీ డేస్' నుంచి కన్నడ డబ్బింగ్ 'హాస్టల్ డేస్' వరకు కాలేజ్ నేపథ్యంలో కామెడీ ఎంటర్టైనర్స్ చాలా వచ్చాయి. ఎన్ని సినిమాలు వచ్చినా సరే... ప్రేక్షకాదరణ లభించడానికి కారణం ఆ కథల్లో వినోదం, ఫ్రెష్‌నెస్! మరీ ముఖ్యంగా ఆయా సినిమాల్లో కామెడీ!


'మ్యాడ్' సినిమాకు వస్తే... సిట్యువేషనల్ కామెడీ బలంగా వర్కవుట్ అయ్యింది. క్లైమాక్స్ ముందు వచ్చే సన్నివేశంలో ఒకరిని 'లాజిక్స్ అడుగుతున్నాడు' కొడతారు. ఇటువంటి సినిమాల్లో లాజిక్స్ అడగకూడదు. జస్ట్ కామెడీ ఎంజాయ్ చేయాలంతే!


'మ్యాడ్'కు వస్తే... స్టార్టింగ్ టు ఎండింగ్ పంచ్ డైలాగ్స్ పేలాయి. కథ కంటే కామెడీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. కళ్యాణ్ శంకర్ అండ్ టీమ్ హీరోలతో పాటు మిగతా క్యారెక్టర్లకు కూడా క్యారెక్టరైజేషన్, టిపికల్ మేనరిజమ్స్ డిజైన్ చేయడంలో సక్సెస్ అయ్యారు. హీరోని హీరోయిన్ చెంపదెబ్బలు కొట్టడం కావచ్చు... 'టాక్సీవాలా' విష్ణు, ఆంటోనీ క్యారెక్టర్లు కావచ్చు... ప్రతి విషయంలో ఓ థీమ్ ఫాలో అయ్యారు. ఫస్టాఫ్ అలా అలా సరదాగా సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత గాళ్స్ హాస్టల్లోకి బాయ్స్ వెళ్లడం, సంగీత్ శోభన్ ప్రేయసి ఎవరు? అతడికి ఫోన్ కాల్స్ చేసింది ఎవరు? అనేది రివీల్ చేయడం కానీ నవ్వించాయి.


'మ్యాడ్'లో కథ గురించి మాట్లాడుకోవడనికి పెద్దగా ఏమీ లేదు. ఫస్ట్ ఇయర్ నుంచి డైరెక్ట్ నాలుగో ఏడాదికి వెళ్లారు. '3 ఇడియట్స్'లో అలాగే చేశాన్నారన్నట్లు చిన్న సెటైర్లు వేశారు. కథలో కామెడీ వర్కవుట్ అయినట్లు ఎమోషన్స్ వర్కవుట్ కాలేదు. అఫ్ కోర్స్... వాటికి ఎక్కువ ప్రాముఖ్యం కూడా ఇవ్వలేదు. భీమ్స్ సిసిరోలియో పాటలు, నేపథ్య సంగీతం కథతో పాటు సాగాయి. సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మాణ విలువల్లో రాజీ పడలేదు.


నటీనటులు ఎలా చేశారంటే : హీరోగా తొలి సినిమా అయినప్పటికీ... నార్నే నితిన్ చక్కగా చేశారు. యాక్షన్ సన్నివేశాల్లో ఆయన కటౌట్, స్టైల్ బావున్నాయి. మిగతా ఇద్దరు హీరోలతో పోలిస్తే... కామెడీ సన్నివేశాలు ఆయనకు తక్కువ ఉన్నాయి. 
హ్యాండ్సమ్ యంగ్ హీరోల్లో రామ్ నితిన్ ఒకరు అవుతారు. అతని స్క్రీన్ ప్రజెన్స్ చాలా బావుంది. లవర్ బాయ్ పాత్రలకు పర్ఫెక్ట్ ఫిట్! మరో హీరో సంగీత్ శోభన్ కామెడీ టైమింగ్ ఎక్స్‌ట్రాడినరీ. ఆయన నటన, డైలాగ్ డెలివరీ వల్ల కొన్ని సీన్స్ మరింత నవ్వించాయి. కామెడీ సీన్స్ మధ్యలో హీరోయిన్ల పాత్రల పరిధి తక్కువ. అయితే... ముగ్గురిలో గౌరీ ప్రియా రెడ్డి ఎక్కువ రిజిస్టర్ అవుతారు. 


హీరోలతో పాటు స్నేహితుడిగా కనిపించిన టాక్సీవాలా విష్ణు... నవ్వించారు. అతని తండ్రి పాత్రలో మురళీధర్ గౌడ్ కూడా నవ్వులు పూయించారు. ప్రిన్సిపాల్ పాత్రలో రఘుబాబు, ఆఫీస్ బాయ్ పాత్రలో 'రచ్చ' రవి కనిపించారు. 'జాతి రత్నాలు' చిత్ర దర్శకుడు అనుదీప్ ఓ సన్నివేశంలో మెరిశారు. 


Also Read : 'కన్నూర్ స్క్వాడ్' రివ్యూ : మమ్ముట్టి కొత్త సినిమా ఎలా ఉంది - కార్తీ మూవీనే మళ్లీ తీశారా?


చివరగా చెప్పేది ఏంటంటే : కామెడీ... కామెడీ... కామెడీ... 'మ్యాడ్'లో స్టార్టింగ్ టు ఎండింగ్ ప్రేక్షకులను నవ్వించడమే లక్ష్యంగా తీసిన సినిమా. హాయిగా రెండు గంటలు నవ్వుకోవడం కోసం వెళ్ళవచ్చు.


Also Read : 'అతిథి' రివ్యూ : హీరో వేణు తొట్టెంపూడి నటించిన హారర్ థ్రిల్లర్ సిరీస్



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial