బిగ్ బాస్ హౌజ్‌లో ఫ్రెండ్‌షిప్ అనేది ఏర్పడిన తర్వాత ఒక కంటెస్టెంట్.. మరో కంటెస్టెంట్ కోసం ఏం చేయడానికి అయినా సిద్ధపడతాడు. ఒక్కొక్కసారి ఏమీ టాస్క్ పెట్టకుండానే తమలో తాము నిర్ణయం తీసుకోవాలి అని బిగ్ బాస్ చెప్పినప్పుడు వారిలోని ప్రేమలు బయటికొస్తాయి. అలాంటి త్యాగాలు చూస్తున్నప్పుడు.. అవి సినిమాలను తలపిస్తాయి. తాజాగా టేస్టీ తేజ, ప్రిన్స్ యావర్ మధ్య జరిగిన త్యాగం చూస్తున్నప్పుడే అదే అనిపించింది. మాటల్లో చెప్పలేనంత బాధ ఉన్నా కూడా యావర్.. తేజ కోసం చేసిన త్యాగం చూసి ప్రేక్షకులు సైతం ఫిదా అయిపోతున్నారు. ఇక శుభశ్రీ కూడా గౌతం కోసం అలాంటి త్యాగమే చేసింది.
చిట్టి ఆయిరే..
బిగ్ బాస్ సీజన్ 7లో మొదటి కెప్టెన్ అవ్వడానికి కంటెస్టెంట్స్ అంతా కేవలం ఒకే అడుగు దూరంలో ఉన్నారు. ఇప్పటివరకు మూడు టాస్కులు జరగగా.. అందులో లీడ్‌లో ఉన్నవారు మాత్రమే ఈ టాస్క్‌కు అర్హులుగా నిలిచారు. దీంతో అందరికంటే తక్కువ స్టార్స్ సాధించిన ప్రియాంక, శోభా శెట్టి ఈ టాస్క్‌ను ఆడలేకపోయారు. దీని పేరు ‘చిట్టి ఆయిరే’. ఈ టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్స్‌కు తమ కుటుంబ సభ్యుల దగ్గర నుండి లెటర్స్ వస్తాయి. జంటలుగా విడిపోయిన కంటెస్టెంట్స్‌లో ఎవరో ఒకరు మాత్రమే తమకోసం వచ్చిన లెటర్‌ను చదవాలి, మరొకరు త్యాగం చేయాలి. అయితే చదివిన కంటెస్టెంట్స్ మాత్రమే కెప్టెన్సీ కంటెండర్‌గా నిలుస్తారు. లెటర్ దక్కనివారికి కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశం కూడా దక్కదు. ఈ క్రమంలో యావర్.. తేజ కోసం త్యాగం చేసి తన లెటర్‌ను చింపేశాడు.
త్యాగం చేసిన యావర్..
టేస్టీ తేజకు తన తండ్రి దగ్గర నుండి, యావర్‌కు తన అన్న దగ్గర నుండి లెటర్ వచ్చింది. తేజ.. అన్ని విధాలుగా ఆలోచించి యావర్‌ను లెటర్ చదవమని, తాను త్యాగం చేస్తానని చెప్పాడు. ఒకసారి కూడా కంటెండర్ అవ్వలేకపోయానని, అయినా లెటర్ విషయంలో యావర్.. తన లెటర్‌ను చదవడమే సరైన నిర్ణయమని అన్నాడు. కానీ యావర్ దానికి ఒప్పుకోలేదు. తేజనే లెటర్ చదవమని అన్నాడు. ఇతరులను బాధపెట్టి సంతోషం పొందడం తనకు అలవాటు లేదని వ్యాఖ్యలు చేశాడు. తేజ మాత్రం తాను అంత ఎమోషనల్ మనిషి కాదని, లెటర్ యావర్ చదివితేనే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. కానీ తన తండ్రి గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత తన లెటర్ కూడా యావర్ చేతికి ఇచ్చి చింపేయమన్నాడు. కానీ యావర్ మాత్రం తన లేఖను చింపేశాడు. కాసేపటి తర్వాత దీనిని గమనించిన తేజ.. ఆపడానికి ప్రయత్నించినా లాభం లేదు.
తండ్రి పంపిన లెటర్ చూసి తేజ ఏడుపు..
యావర్ ముందు తాను ఎమోషనల్ పర్సన్ కాదు అన్న తేజ.. తన తండ్రి పంపిన లెటర్ చదువుతూ వెక్కివెక్కి ఏడ్చాడు. ఆ తర్వాత బయటికి వచ్చి యావర్‌ను ఓదార్చే ప్రయత్నం చేశాడు. ‘‘ఎవరైనా నాకోసం ఒకటి చేస్తే. నేను రెండు చేస్తా. వారికోసం చనిపోవడానికి కూడా వెనకాడను’’ అంటూ తేజపై తనకు ఉన్న ఇష్టాన్ని బయటపెట్టాడు యావర్. లెటర్‌తో పాటు మొదటిసారి కంటెండర్‌షిప్‌ను కూడా దక్కించుకున్నాడు తేజ. ఇక గౌతమ్, శుభశ్రీల మధ్య కూడా లెటర్ విషయంలో పెద్ద చర్చే జరిగింది. లెటర్ గురించి కాకుండా కంటెండర్‌షిప్ గురించి ఎక్కువగా ఆలోచించాడు గౌతమ్. ప్రస్తుతం రేసులో అసలు అమ్మాయిలు లేరని, అందుకే శుభశ్రీ త్యాగం చేస్తే తాను కంటెండర్ అవుతానని గౌతమ్ అన్నాడు. శుభశ్రీ మాత్రం తన కుటుంబ సభ్యుల నుండి వచ్చిన లెటర్‌ను చదవాలని పట్టుబట్టింది. దీంతో గౌతమ్.. కోపంతో తన లెటర్‌ను చింపేయబోయాడు. గేమ్ గెలుస్తానని చెప్తే తాను త్యాగం చేస్తానని శుభశ్రీ ఒప్పుకుంది. తన లెటర్‌ను త్యాగం చేసింది. నేడు పూర్తయిన టాస్క్ ప్రకారం ప్రస్తుతం కెప్టెన్సీ రేసులో కంటెండర్లుగా తేజ, గౌతమ్ కన్ఫర్మ్ అయ్యారు.
Also read: ఈ ‘బిగ్ బాస్’ సీజన్‌లో ఫేక్ కంటెస్టెంట్లు వీళ్లేనట - వీరిలో మీ ఫేవరెట్ ఉన్నారా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial