కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌ లో రూపొందిన తాజా చిత్రం ‘లియో’.  చిత్రంలో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది.  స్టార్ యాక్టర్లు సంజయ్ దత్, అర్జున్ సర్జా కీలక పాత్రలు పోషిస్తున్నారు. దసరా కానుకగా థియేటర్లలోకి రాబోతున్నది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్,  పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను నిర్మాత నాగవంశీ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఆయన ఈ మూవీ గురించి చేసిన వ్యాఖ్యలు విజయ్ అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే?

  


‘లియో’ తెలుగు థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేసిన నాగ వంశీ


విజయ్ ప్రతిష్టాత్మక చిత్ర ‘లియో’ తెలుగు థియేట్రికల్ రైట్స్ నాగ వంశీ తీసుకున్నారు. ఇందుకోసం ఏకంగా రూ. 22 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటికే ఈ సినిమా విడుదలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ చిత్రం బాలయ్య సినిమా ‘భగవంత్ కేసరి’కి పోటీగా బరిలోకి దిగబోతోంది. రెండు సినిమాలు అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నాయి. వీటిలో ఏ సినిమా విజయం సాధిస్తుందోనని అందరిలో ఆసక్తి నెలకొంది.  


నాగ వంశీ కామెంట్స్ పై విజయ్ అభిమానుల ఆగ్రహం


ఈ నేపథ్యంలో నిర్మాత నాగ వంశీ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తిని కలిగిస్తున్నాయి. విజయ్ అభిమానులకు మాత్రం ఎక్కడలేని కోపం తెప్పిస్తున్నాయి. ఇటీవల ఓ ఈవెంట్ లో మాట్లాడిన ఆయన ‘లియో’ మూవీ రైట్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి, బాలయ్య  అభిమానులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ‘భగవంత్ కేసరి’ సినిమాకి ఎన్ని థియేటర్స్ అవసరం ఉంటాయో అన్నింట్లో రిలీజ్ చేసుకోవచ్చని చెప్పారు. ఈ వ్యాఖ్యలు పట్ల బాలయ్య అభిమానులను ఫుల్ ఖుషీ చేశాయి. మరోవైపు విజయ్ అభిమానులకు మాత్రం తీవ్ర ఆగ్రహం కలిగిస్తున్నాయి. వాస్తవానికి తమిళ ప్రేక్షకులు ఏదో రకంగా తెలుగు సినిమాపై కోపం వెల్లగక్కుతూనే ఉంటారు. వారి సినిమాలను తెలుగులో ఎంకరేజ్ చేయడం లేదంటారు. ఈ నేపథ్యంలో నాగ వంశీ చేసిన కామెంట్స్ కోపాన్ని కలిగిస్తున్నాయి.


విజయ్ అభిమానుల ట్రోలింగ్, నాగ వంశీ వివరణ


కొంత మంది విజయ్ అభిమానులు నాగ వంశీ మీద ట్రోలింగ్ కూడా మొదలు పెట్టేశారు. తెలుగులో ‘లియో’ను తక్కువ థియేటర్లకు పరిమితం చేయాలని ఆయన భావిస్తున్నారని మండిపడుతున్నారు. తెలుగు సినిమాలను ప్రోత్సహించేందుకే ఆయన ఇలా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగ వంశీ రియాక్ట్ అయ్యారు. ‘లియో’ రైట్స్ ను తాను భారీ మొత్తం ఖర్చు చేసి కొనుగోలు చేశానని చెప్పారు. అలాంటప్పుడు లాభాలు రావాలని ఉంటుంది కానీ, నష్టం వచ్చేలా ఎందుకు నిర్ణయం తీసుకుంటానని ప్రశ్నించారు. ఏ సినిమాకు ఉన్న ప్రాధాన్యత, ఆ సినిమాకు ఉంటుందని మాత్రమే తన వ్యాఖ్యల ఉద్దేశం అన్నారు. ‘లియో’ను తక్కువ చేస్తే నష్టపోయేది తానేనని గుర్తుంచుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో విజయ్ అభిమానులు కాస్త శాంతించారు.  


 Read Also: 'మంత్ ఆఫ్ మధు' మూవీ పెద్దలకు మాత్రమే - కలర్స్ స్వాతి ఏం చెప్పిందంటే!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial