సినిమా రివ్యూ : రుద్రుడు 
రేటింగ్ : 2/5
నటీనటులు : రాఘవా లారెన్స్, శరత్ కుమార్, ప్రియా భవానీ శంకర్, పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్ తదితరులు
ఛాయాగ్రహణం : ఆర్.డి. రాజశేఖర్
సంగీతం : జీవీ ప్రకాష్ కుమార్
రచన, దర్శకత్వం, నిర్మాణం : కతిరేశన్!
తెలుగులో విడుదల : 'ఠాగూర్' మధు 
విడుదల తేదీ: ఏప్రిల్ 14, 2022


రాఘవా లారెన్స్ (Raghava Lawrence) కొంత విరామం తర్వాత కథానాయకుడిగా నటించిన సినిమా 'రుద్రుడు' (Rudhrudu Movie). ప్రచార చిత్రాలు చూస్తే పక్కా మాస్ కమర్షియల్ తమిళ సినిమా అని తెలుస్తూ ఉంది. అసలు, సినిమా కథ ఏంటి? తెలుగు ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఏం ఉన్నాయి?


కథ (Rudhrudu Movie Story) : విశాఖలో భూమి (శరత్ కుమార్)కి ఎదురు లేదు.  డబ్బు కోసం ఎన్నో నేరాలు చేస్తాడు. కరుడుగట్టిన డబ్బు పిశాచి. క్రూరుడు. అటువంటి భూమి మనుషులను రుద్ర (రాఘవా లారెన్స్) చంపేస్తాడు. ఓ పెద్ద కంపెనీలో జీతానికి ఉద్యోగం చేసే సగటు యువకుడు ఎందుకు హంతకుడు అయ్యాడు? అతను ప్రేమించి పెళ్లి చేసుకున్న అనన్య (ప్రియా భవానీ శంకర్) ఏమైంది? రుద్ర జీవితంలో ఏం జరిగింది? రుద్రుడిగా మారి ఎందుకు రక్త చరిత్ర రాశాడు? తన మనుషులను చంపింది రుద్ర అని తెలుసుకున్న భూమి ఏం చేశాడు? రుద్ర, భూమికి సంబంధం ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 


విశ్లేషణ (Rudhrudu Review Telugu) : హీరోయిజం ఎలివేట్ చేసే కమర్షియల్ సినిమాల్లో చాలా పాటలకు రాఘవా లారెన్స్ కొరియోగ్రఫీ చేశారు. అటువంటి సినిమా ఒకటి చేయాలని ఆశపడినట్లు ఉన్నారు. ఫైట్స్ కోసం 'అఖండ' మూడు సార్లు చూశానని, తనకూ అటువంటి ఫైట్స్ కావాలని సేమ్ ఫైట్ మాస్టర్స్ చేస్తే 'రుద్రుడు'కు స్టన్ శివను తీసుకున్నామని విడుదలకు ముందు రాఘవా లారెన్స్ చెప్పారు. ట్రైలర్ చూశాక, ఆయన మాటలు విన్నాక... 'రుద్రుడు' ఎలా ఉంటుందో ఓ అంచనాకు రావడం పెద్ద కష్టం ఏమీ కాదు. అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఉంది. 


'రుద్రుడు' మొదలైనప్పటి నుంచి విశ్రాంతి వరకు, ఆ తర్వాత మళ్ళీ శుభం కార్డు పడే వరకూ... కమర్షియల్ మీటర్ ఎక్కడా తప్పలేదు. హీరో పరిచయం, ఆ తర్వాత ప్రేమకథ, మధ్యలో ఎమోషనల్ సీన్స్, పేరెంట్స్ సెంటిమెంట్ అండ్ లవ్... అన్నీ పది పదిహేను తెలుగు సినిమాల్లో చూసేసిన సన్నివేశాలను కిచిడీ రూపంలో మళ్ళీ చూసిన ఫీలింగ్ ఇస్తాయి. కథగా ఓ సోల్ మిస్ అయ్యింది. 


ప్రతి ఫైటులో హీరోయిజం ఎలివేట్ చేసే బాధ్యతను దర్శకుడు తూచా తప్పకుండా పాటించారు. కాకపోతే... ఇంటర్వెల్ వరకు అసలు హీరో ఎందుకు ఫైట్ చేస్తున్నాడో తెలియదు. అడ్డు వచ్చిన విలన్లను అడ్డంగా నరుక్కుంటూ, పొడుచుకుంటూ , కొట్టుకుంటూ పోవడమే. ఊచకోత కోస్తూ వెళ్ళడమే. తెరపై వచ్చే ఫైట్లకు ఏమాత్రం తగ్గకుండా జీవీ ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం ఇచ్చారు. తెలుగులో ఎవరైనా కమర్షియల్ స్టార్ వేల్యూ ఉన్న హీరో అటువంటి ఫైట్స్ చేస్తే ప్రేక్షకులు చూసేవారేమో!? ఈ సినిమాలో లాజిక్కులకు చోటు లేదు. 


విశ్రాంతి తర్వాత అసలు కథ మొదలైంది. హీరో గతాన్ని వివరిస్తూ... భూమిని మనుషులను చంపడానికి కారణం ఏమిటి? అనే చెప్పే సన్నివేశాలు ఆసక్తిగా సాగాయి. విశ్రాంతికి ముందు రొటీన్ సినిమా చూడటంతో అసలు కథ బావుంటుంది. ఇండియాలో పేరెంట్స్, ఎన్నారైలు నేపథ్యంలో సన్నివేశాలు ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. పతాక సన్నివేశాల్లో భూమి, రుద్రుడు మధ్య ఫైట్... నేపథ్యంలో వచ్చే పాట నిజంగా బావున్నాయి. కమర్షియల్ సినిమాకు ఎటువంటి హంగులు కావాలో... టెక్నికల్ అంశాల్లో అటువంటివి అన్నీ ఉన్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సైతం కమర్షియల్ బాణీలో సాగింది. 


నటీనటులు ఎలా చేశారు? : రాఘవా లారెన్స్ మాస్ హీరోగా ఎదిగే ప్రయత్నం ఈ సినిమాలో కనబడింది. రుద్రుడిగా కొన్ని సన్నివేశాల్లో బాగా చేశారు. యాక్షన్ సన్నివేశాల్లో కాలరుద్రుడిగా మెప్పించారు. ఆయన డ్యాన్స్ చెకపోతే ఆశ్చర్యం గానీ... చేస్తే ఏముంది? రాఘవా లారెన్స్ నుంచి ప్రేక్షకులు ఆశించే డ్యాన్స్, గ్రేస్ పాటల్లో కనబడుతుంది. ప్రియా భవానీ శంకర్ నటనలో వంక పెట్టడానికి ఏమీ లేదు. కమర్షియల్ సినిమాల్లో కథానాయిక పాత్ర పరిధి మేరకు చక్కగా చేశారు. శరత్ కుమార్ లుక్, యాక్టింగ్ ఓకే. మిగతా నటీనటుల్లో అందరూ తమిళ ఆర్టిస్టులే.   


Also Read : 'శాకుంతలం' రివ్యూ : సమంత సరిగా చేయలేదా? గుణశేఖర్ బాగా తీయలేదా?


చివరగా చెప్పేది ఏంటంటే? : రాఘవా లారెన్స్ (Raghava Lawrence Rudhran Review)ను కమర్షియల్ కథానాయకుడిగా చూపించడం కోసం చేసిన రుద్దుడు... ప్రయత్నమే 'రుద్రుడు'. కథతో సంబంధం లేకుండా ఊర మాస్ ఫైట్స్, యాక్షన్ కోరుకునే ప్రేక్షకులు మాత్రమే ఎంజాయ్ చేసే చిత్రమిది. మిగతా ప్రేక్షకులకు ఇబ్బందే. పతాక సన్నివేశాలు, సందేశం బావున్నాయి. కథలో విషయం ఉన్నా... కమర్షియల్ ఫార్మాట్ స్క్రీన్ ప్లే, స్టోరీ టెల్లింగ్ అసలు విషయాన్ని పక్కదారి పట్టించింది.


Also Read 'ఐ లవ్ యు ఇడియట్' రివ్యూ : తెలుగులో శ్రీలీల ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి రిలీజ్ చేశారా?