సినిమా రివ్యూ : శాకుంతలం
రేటింగ్ : 1.75/5
నటీనటులు : స‌మంత, దేవ్ మోహ‌న్, మోహ‌న్ బాబు, అల్లు అర్హ, శివ బాలాజీ, ప్ర‌కాష్‌ రాజ్‌, మ‌ధుబాల‌, గౌత‌మి, అదితి బాల‌న్‌, అన‌న్య నాగ‌ళ్ల‌, జిష్షు సేన్ గుప్తా తదితరులు
మూలకథ : కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా
మాటలు : సాయి మాధవ్ బుర్రా 
పాటలు : చైతన్య ప్రసాద్, శ్రీమణి  
ఛాయాగ్రహణం : శేఖర్ వి. జోసెఫ్
సంగీతం : మణిశర్మ 
నిర్మాణ సంస్థలు : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుణ టీమ్ వర్క్స్
సమర్పణ : 'దిల్' రాజు 
నిర్మాత : నీలిమా గుణ
రచన, దర్శకత్వం : గుణశేఖర్
విడుదల తేదీ: ఏప్రిల్ 14, 2022


సమంత (Samantha) ప్రధాన పాత్రలో గుణశేఖర్ (Gunasekhar) తెరకెక్కించిన దృశ్యకావ్యం 'శాకుంతలం' (Shaakuntalam Movie). ఇందులో దేవ్ మోహన్ (Dev Mohan) హీరో. పాన్ ఇండియా రిలీజ్ చేశారు. ఈ సినిమా ఎలా ఉంది? 'యశోద' తర్వాత సమంత మరో విజయం అందుకున్నారా? లేదా? గుణశేఖర్ సినిమాల్లో వీఎఫ్ఎక్స్ వీక్ అనే విమర్శను అధిగమించారా? లేదా?


కథ (Shaakuntalam Movie Story) : విశ్వామిత్రుని తపస్సు భంగం చేయడానికి మేనక (మధుబాల)ను ఇంద్రుడు భూలోకానికి పంపిస్తాడు. తపస్సు భంగం కావడమే కాదు... వాళ్ళిద్దరూ శారీరకంగా ఒక్కటి అవుతారు. ఫలితంగా మేనక ఓ అమ్మాయికి జన్మ ఇస్తుంది. ఆ చిన్నారిని భూలోకంలో వదిలి స్వర్గానికి వెళ్ళిపోతుంది. అడవిలో చిన్నారిని చూసిన కణ్వ మహర్షి శకుంతల అని పేరు పెట్టి కన్న బిడ్డలా పెంచుతాడు. కట్ చేస్తే... శకుంతల పెద్దది అవుతుంది. 


ఓ రోజు కణ్వ మహర్షి ఆశ్రమానికి వచ్చిన దుష్యంత మహారాజు (దేవ్ మోహన్)... శకుంతల (సమంత)ను చూస్తాడు. ఒకరిపై మరొకరు మనసు పడతారు. గంధర్వ వివాహం చేసుకుని ఒక్కటి అవుతారు. రాజ్యానికి వెళ్ళిన తర్వాత సకల రాచ మర్యాదలతో ఆహ్వానించి, మహారాణిగా ప్రజలకు పరిచయం చేస్తానని చెబుతాడు. శకుంతల గర్భవతి అవుతుంది. ఎంతకూ దుష్యంతుడు రాకపోవడంతో అతడి దగ్గరకు వెళుతుంది. కణ్వ మహర్షి ఆశ్రమానికి తాను వెళ్ళిన విషయం గుర్తుంది కానీ శంకుతల ఎవరో తనకు తెలియదని దుష్యంత మహారాజు చెబుతాడు. అతడు ఎందుకు అలా చెప్పాడు? నిండు సభలో శకుంతలకు జరిగిన అవమానం ఏమిటి? ఆ తర్వాత ఏమైంది? మధ్యలో దుర్వాస మహాముని (మోహన్ బాబు) పాత్ర ఏమిటి? దుష్యంతుడు, శకుంతల చివరకు ఎలా ఒక్కటి అయ్యారు? అనేది సినిమా. 


విశ్లేషణ (Shaakuntalam Review Telugu) : వెండితెరపై 'శాకుంతలం' మొదలైన కాసేపటి ప్రేక్షకుడి మదిలో కలిగే మొదటి సందేహం... 'త్రీడీలో ఎందుకు సినిమా చూపిస్తున్నారు? టూడీలో చూపిస్తేనే బావుండేది ఏమో!?' అని! బహుశా... ఈ మధ్య కాలంలో ఇంత వరస్ట్ త్రీడీ వర్క్ ప్రేక్షకులు చూసి ఉండరు. 


కథ, కథనం, సన్నివేశాల్లో ఎంత బలం ఉంది? వంటి సంగతులు తర్వాత! 'శాకుంతలం' థియేటర్లలో అడుగుపెట్టిన ప్రేక్షకులపై పడిన మొదటి దెబ్బ... విజువల్ ఎఫెక్ట్స్ & త్రీడీ వర్క్! గుణశేఖర్ ఊహలో తప్పు లేదు. కానీ, ఆ ఊహ తెరపైకి ఎంత అందంగా వచ్చింది? అనేది ముఖ్యమే కదా! ప్రేక్షకుడికి ఆ ఊహ తెలిసినపుడేగా... విజయం వరించేది! ఆయన ఊహ విజువలైజేషన్ రూపంలోకి రాలేదనేది ముమ్మాటికీ నిజం! గ్రీన్ మ్యాట్ మీద సినిమా తీసి విజువల్ ఎఫెక్ట్స్ చేయించడం అంత సులభం కాదు సుమా! ఓ సన్నివేశంలో నటీనటులు స్పష్టంగా కనిపిస్తే... మరో సన్నివేశంలో చాలా చిన్నగా కనబడతారు. అదేమి విచిత్రమో!? 


విజువల్ ఎఫెక్ట్స్, త్రీడీ వర్క్ బాలేదంటే సన్నివేశాల్లో అసలు బలం లేదు. కథలో బలమైన సంఘర్షణ లేదు. దేవ్ మోహన్, సమంత మధ్య కెమిస్ట్రీ కుదరలేదు. ఓ మాట చెప్పాలి... ప్రేమకథలో, సన్నివేశాల్లో బలం కంటే హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ కుదిరితే సినిమా పాస్ అయిపోయినట్టే! ఇక్కడ అది కూడా లేదు. దాంతో సీరియల్ సాగినట్లు సన్నివేశాలు సాగాయి. రణభూమిలో యుద్ధ సన్నివేశాలు సైతం పేలవంగా సాగాయి. ఎప్పుడు అయిపోతుందా? అన్నట్లు ఉందీ సినిమా.


అందరికీ తెలిసిన కథను మళ్ళీ చెప్పడం దర్శకుడికి కత్తి మీద సాము లాంటి వ్యవహారం. అందులోనూ ఎటువంటి మలుపులు లేని అభిజ్ఞాన శాకుంతలం కథను యథాతథంగా తీయాలనుకున్నప్పుడు... ప్రతి సన్నివేశం ఓ దృశ్యకావ్యం అన్నట్లు ఉంటే తప్ప ప్రేక్షకుడ్ని థియేటర్లో కూర్చోబెట్టడం కష్టం. గుణశేఖర్ వంటి దర్శకుడికి ఇవేవీ తెలియనివి కాదు. అయితే... ఆయన లెక్క తప్పింది. దేవ్ మోహన్ బదులు తెలుగు హీరో ఎవరినైనా తీసుకుని ఉంటే బావుండేది. సమంత కంటే ఆయనకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది. సమంతను చూడాలని థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులకు ఇదీ మింగుడుపడని అంశమే.  


మణిశర్మ (Mani Sharma) స్వరాలు మధ్య మధ్యలో మనసుకు ఊరట కలిగించాయి. ఆయన సంగీతం కాస్త స్వాంతన చేకూర్చింది. వరస్ట్ త్రీడీ వర్క్ కారణమో? లేక మరొకటో? సినిమాటోగ్రఫీ బాలేదు. నిర్మాతలు ఖర్చు పెట్టినట్టు తెరపై సన్నివేశాలు చూస్తే అర్థం అవుతూ ఉంటుంది. అయితే, వాళ్ళ ఖర్చు అంతా బూడిదలో పోసిన పన్నీరే.


నటీనటులు ఎలా చేశారు? : తెలుగులో సమంత తొలి సినిమా 'ఏ మాయ చేసావె' ప్రేమకథే. అందులో ఆమె నటనకు ఎంతో మంది ముగ్దులయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో సమంత అద్భుతంగా నటించారు. అయితే, శకుంతల పాత్రకు సమంత సూటవ్వలేదని అనిపిస్తుంది. సొంత డబ్బింగ్గూ మైనస్సే. ప్రేమకథ కంటే భావోద్వేగభరిత సన్నివేశాల్లో నటిగా అనుభవం చూపించారు సామ్. దేవ్ మోహన్ రూపం బావుంది కానీ నటన బాలేదు. మేనకగా మధుబాలను చూడలేం. గౌతమి, అనన్యా నాగళ్ళ, జిష్షుసేన్ గుప్తా, శివ బాలాజీ, కబీర్ సింగ్, సచిన్ ఖేడేకర్ సహా చాలా మంది తారాగణం తెరపై కనిపించారు. ఎవరూ గుర్తుంచుకునేంత రీతిలో నటన కనబరచలేదు.


దుర్వాస మహాముని పాత్రలో మోహన్ బాబు కాసేపు కనిపించారు. కంచు కంఠంతో డైలాగులు చెబుతూ సన్నివేశాలకు ప్రాణం పోశారు. పతాక సన్నివేశాల్లో శకుంతల, దుష్యంతుల కుమారుడిగా అల్లు అర్హ కనిపించారు. ఆ చిన్నారి నటన ముద్దొస్తుంది. తెలుగు డైలాగులను అర్హ చక్కగా చెప్పింది.


Also Read  'ఐ లవ్ యు ఇడియట్' రివ్యూ : తెలుగులో శ్రీలీల ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి రిలీజ్ చేశారా?  


చివరగా చెప్పేది ఏంటంటే? : శకుంతలను కాళిదాసు శృంగార నాయికిగా అభిజ్ఞాన శాకుంతలంలో వర్ణించారు. సమంతను ఆ విధంగా చూపించడంలో గుణశేఖర్ ఫెయిల్ అయ్యారు. నటీనటుల ఎంపికలోనూ ఆయన ఫెయిలే. సినిమాలో ప్రేమా లేదు, గీమా లేదు. ఏ దశలోనూ ఆకట్టుకోదు. సన్నివేశాల్లో సాగదీత, వరస్ట్ త్రీడీ వర్క్ వెరసి ప్రేక్షకుల కళ్ళను కష్టపెడతాయి. థియేటర్లలో చివరి వరకూ కూర్చోవాలంటే చాలా ఓపిక కావాలి. శాకుంతలం... ప్రేక్షకుడి సహనానికి పరీక్ష! పతాక సన్నివేశాల్లో అర్హ నటన అల్లు అభిమానులకు, ప్రేక్షకులకు నచ్చుతుంది. 


Also Read : 'జూబ్లీ' రివ్యూ : స్టార్ హీరోయిన్ ఎఫైర్... వేశ్యతో ఔత్సాహిక దర్శకుడి ప్రేమ... అదితీ రావు హైదరి వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?