సినిమా రివ్యూ : నాతో నేను
రేటింగ్ : 2.5/5
నటీనటులు : సాయి కుమార్, శ్రీనివాస సాయి, ఆదిత్య ఓం, దీపాలి రాజ్‌పుత్, ఐశ్వర్య ఉల్లింగల, విజయ్ చందర్, రాజీవ్ కనకాల, గౌతమ్ రాజు తదితరులు
ఛాయాగ్రహణం : ఎస్. మురళీ మోహన్ రెడ్డి
నేపథ్య సంగీతం : ఎస్. చిన్నా
స్వరాలు : సత్య కశ్యప్
సమర్పణ : ఎల్లలు బాబు టంగుటూరి
నిర్మాత : ప్రశాంత్ టంగుటూరి
కథ, మాటలు, పాటలు, కథనం, దర్శకత్వం : శాంతి కుమార్ తూర్లపాటి
విడుదల తేదీ: జూలై 21, 2023
'జబర్దస్త్' కార్యక్రమం ద్వారా పాపులరైన మిమిక్రీ ఆర్టిస్ట్, నటుడు శాంతి కుమార్ తూర్లపాటి (Jabardasth Shanthi Kumar) దర్శకుడిగా పరిచయమైన సినిమా 'నాతో నేను'. సాయి కుమార్, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలు పోషించారు. ఆదిత్య ఓం, దీపాలి రాజ్‌పుత్ ఓ జంటగా... శ్రీనివాస సాయి, 'జబర్దస్త్' ఐశ్వర్య మరో జంటగా నటించారు. ప్రేమ, వినోదంతో పాటు మానవ సంబంధాల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఎలా ఉందంటే?
కథ (Natho Nenu Movie Story) : కోటిగాడు అలియాస్ కోటేశ్వరరావు (శ్రీనివాస సాయి)కి 20 ఏళ్ళు. ఆ వయసులో దీప ('జబర్దస్త్' ఐశ్వర్య)తో ప్రేమలో పడతాడు. కానీ, అమ్మాయి ఇంట్లో పెద్దలు ఒప్పుకోరు. దాంతో దూరం అవుతారు. కోటిగాడు (ఆదిత్య ఓం)కి 40 ఏళ్ళు వస్తాయి. అప్పుడు నాగలక్ష్మి (దీపాలి రాజ్‌పుత్)ని చూసి ఇష్టపడతాడు. ఆ ప్రేమకథ ఏమైంది? కోటేశ్వరరావు (సాయి కుమార్)కు 60 ఏళ్ళు వచ్చేసరికి డబ్బులు బాగా సంపాదిస్తాడు. ఊరిలో మంచి పేరు తెచ్చుకుంటాడు. అయితే... అప్పుడు అతని జీవితంలో ఏం జరిగింది? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు? కోటేశ్వరరావుకు ఎదురైన స్వామిజీ ఇచ్చిన వరం ఏమిటి? ఆ వరంతో కోటేశ్వరరావు ఏం చేశాడు? చివరకు ఏమైంది? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ (Natho Nenu Movie Review) : ఓ మనిషి జీవితంలో మూడు దశలను ఆవిష్కరిస్తూ రూపొందిన చిత్రమిది. 'కేరాఫ్ కంచరపాలెం' టైపు అన్నమాట! ఆ సినిమాలో కులం, మతం, పరిస్థితులు కథానాయకుడికి అడ్డుగోడగా నిలబడితే... 'నాతో నేను'లో మనీ విలన్ రోల్ పోషించిందని చెప్పవచ్చు. బుల్లితెరపై వినోదం పంచిన 'జబర్దస్త్' శాంతి కుమార్... వెండితెరకు వచ్చేసరికి ఫిలాసఫీని చెప్పే ప్రయత్నం చేశారు.
'ప్రతి మనిషి సాటి మనిషిలో మూడు అక్షరాల మనిషిని చూడటం కంటే... మొదటి రెండు అక్షరాల మనీని చూడటం దగ్గరే ఆగిపోతున్నాడు' - ఇదీ ట్రైలర్ చివర్లో సాయి కుమార్ చెప్పే మాట. ఈ కథను క్లుప్తంగా చెప్పాలంటే... ఈ ఒక్క మాట సరిపోతుంది. 'జబర్దస్త్' శాంతి కుమార్ రాసుకున్న కథలో, చెప్పాలనుకున్న పాయింట్‌లో విషయం ఉంది. డైలాగుల్లో డెప్త్ ఉంది. ముఖ్యంగా సాయి కుమార్ (Sai Kumar)కు రాసిన మాటలు!
మంచి కథను చెప్పే క్రమంలో 'జబర్దస్త్' శాంతి కుమార్ తడబడ్డారు. దర్శకుడిగా ఆయన అనుభవలేమి తెరపై కనిపించింది. సూటిగా పాయింట్ చెబితే బావుండేది. కమర్షియల్ హంగుల పేరుతో కొన్ని సన్నివేశాలు యాడ్ చేయడం స్టోరీ ఫ్లో దెబ్బ తీసింది. కొన్ని సన్నివేశాల్లో కామెడీ ఓకే. కానీ, కథకు అడ్డు తగిలింది. స్క్రీన్ ప్లే ఇంకా బెటర్ గా రాసుకోవాల్సింది.
'నాతో నేను'లో పాటలకు సత్య కశ్యప్ మ్యూజిక్ అందించారు. ఆయన బాణీలు ఓకే. స్క్రీన్ మీద ఫ్లోలో వెళ్ళిపోయాయి. ఎస్. చిన్నా నేపథ్య సంగీతం కూడా! ఇటువంటి సినిమాలకు సినిమాటోగ్రఫీ, సాంగ్స్ ఎక్స్ట్రాడినరీగా ఉండటం అవసరం. శాంతి కుమార్ ఆ విషయంలో కాన్సంట్రేట్ చేయలేదు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టు ఉన్నాయి. శాంతి కుమార్ మీద నమ్మకంతో నిర్మాతలు ఖర్చు చేశారు.
నటీనటులు ఎలా చేశారు? : సాయి కుమార్ వయసుకు తగ్గ పాత్ర చేశారు. తనను డైలాగ్ కింగ్ అని ఎందుకు అంటారో మరోసారి చూపించారు. ఫిలాసఫీ టచ్ ఉన్న డైలాగులు ఆయన చెప్పడం వల్ల ఇంపాక్ట్ యాడ్ అయ్యింది. నటుడిగానూ ఆయన ఆకట్టుకుంటారు. ఎమోషనల్ సీన్స్ బాగా చేశారు.
శ్రీనివాస సాయి, ఐశ్యర్య మధ్య కెమిస్ట్రీ బావుంది. ముఖ్యంగా రెట్రో సాంగులో! లవ్ ఫెయిల్యూర్ సీన్స్‌లో శ్రీనివాస సాయి నటన కూడా! ఆదిత్య ఓం కూడా వయసుకు తగ్గ పాత్ర చేశారు. ఓవర్ ది బోర్డ్ వెళ్ళకుండా నటించారు. హీరోయిన్ దీపాలి రాజ్‌పుత్ గ్లామర్ హైలైట్ అవుతుంది. రాజీవ్ కనకాల, విజయ్ చందర్, భద్రం తదితరులు పాత్రల పరిధి మేరకు చేశారు.
Also Read : 'బవాల్' రివ్యూ : అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ సినిమా
చివరగా చెప్పేది ఏంటంటే? : మనిషికి 'మనీ' మాత్రమే ముఖ్యం కాదని చెప్పే సందేశంతో రూపొందిన చిత్రమిది. కథలో విషయం ఉంది. అయితే, కథనంతో పాటు దర్శకత్వంలో తడబాటు కనిపించింది. అందరికీ నచ్చే సినిమా కాదిది. సాయి కుమార్ నటన, ఫిలాసఫీ టచ్ కోరుకునే ప్రేక్షకులకు ఓకే.
Also Read : 'హత్య' రివ్యూ : 'బిచ్చగాడు' హీరో విజయ్ ఆంటోనీ కొత్త సినిమా ఎలా ఉందంటే?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial