సినిమా రివ్యూ : బవాల్ 
రేటింగ్ : 2.75/5
నటీనటులు : వరుణ్ ధావన్, జాన్వీ కపూర్, ముఖేష్ తివారి, మనోజ్ పహ్వ, శశి వర్మ, అంజుమన్ సక్సేనా తదితరులుకథ : అశ్విని అయ్యర్ తివారి 
ఛాయాగ్రహణం : మితేష్ మిర్చందాని 
పాటలు : మిథూన్, తనిష్క్ బాగ్చి, అక్షదీప్ సేన్ గుప్తా
నేపథ్య సంగీతం : డేనియల్ బి జార్జ్!
నిర్మాత : సాజిద్ నడియాడ్ వాలా 
రచన, దర్శకత్వం : నితేష్ తివారీ 
విడుదల తేదీ: జూలై 21, 2023
ఓటీటీ వేదిక : అమెజాన్ ప్రైమ్ వీడియో


హిందీ సినిమాలు సల్మాన్ ఖాన్ 'దంగల్', సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 'చిచ్చోరే'తో దక్షిణాది ప్రేక్షకుల్లోనూ అభిమానులను సొంతం చేసుకున్న దర్శకుడు నితేష్ తివారీ (Nitesh Tiwari). ఆయన దర్శకత్వం వహించిన సినిమా 'బవాల్' (Bawaal Movie). ఇందులో వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ జంటగా నటించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉంది?


కథ (Bawaal Movie Story) : అజ్జు భాయ్ అలియాస్ అజయ్ (వరుణ్ ధావన్) ఓ పాఠశాలలో హిస్టరీ టీచర్. అయితే... లక్నోలో అతనికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.లేనిపోని గొప్పలు చెబుతూ ప్రజల్లో తనకంటూ ఓ ఇమేజ్ సృష్టించుకుని మైంటైన్ చేస్తూ ఉన్నాడు. అజ్జు భార్య పేరు నిషా (జాన్వీ కపూర్). ఆమెకు ఫిట్స్ ఉన్నాయని తెలిసీ పెళ్లి చేసుకున్నాడు. అయితే... పెళ్లి రోజు ఫిట్స్ వచ్చి మంచం మీద పడటంతో నిషాను దూరం పెట్టాడు. ఓ గదిలో ఉన్నప్పటికీ... వేర్వేరుగా నిద్రిస్తూ ఉంటారు. ఒక్కసారి కూడా భార్యను బయటకు తీసుకువెళ్లిన పాపాన పోలేదు.


సంసార జీవితంలో సమస్యలు ఉన్నప్పటికీ... సొసైటీలో అజ్జు ఇచ్చే బిల్డప్ అసలు ఏమాత్రం తగ్గదు. క్లాసులో పాఠాలు చెప్పకుండా కాలక్షేపం చేస్తుంటాడు. ఓ రోజు సెకండ్ వరల్డ్ వార్ గురించి ఓ పిల్లాడు ప్రశ్న అడిగితే సమాధానం చెప్పకుండా లాగిపెట్టి చెంపదెబ్బ కొడతాడు. ఆ పిల్లాడు ఎమ్మెల్యే కొడుకు కావడం అజ్జును నెల రోజులు సస్పెండ్ చేస్తాడు. ఆ సస్పెన్షన్ వల్ల తన ఇమేజ్ దెబ్బ తింటుందని కొత్త ప్లాన్ వేస్తాడు. రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన ప్రదేశాలకు సొంత ఖర్చులతో వెళ్లి అక్కడ నుంచి పిల్లలకు ఆన్‌లైన్ క్లాసులు చెబుతానని అనుమతి తీసుకుంటాడు. తండ్రి డబ్బులు ఇవ్వాలంటే భార్యను కూడా తీసుకువెళ్ళక తప్పదని నిషాను కూడా తీసుకు వెళతాడు. ఆ జంట జీవితంలో ఆ టూర్- ఎటువంటి మార్పులు తీసుకొచ్చింది? రెండవ ప్రపంచ యుద్ధంలో ఏం జరిగిందో తెలుసుకున్న అజ్జులో ఎటువంటి మార్పులు వచ్చాయి? ఇద్దరి మధ్య విడాకుల ప్రస్తావన ఎందుకు వచ్చింది? చివరకు, ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 


విశ్లేషణ (Bawaal Movie Review) : 'బవాల్' చూసిన తర్వాత కథలో ఏముంది? అని ఆలోచిస్తే... పెద్దగా ఏమీ కనిపించదు. ఊహ లోకంలో జీవితం సాగదీసే, తమను అందరూ పొగడాలని కోరుకునే సామాన్య యువకుడు ఊరిలో కనీసం ఒక్కరైనా కనపడతారు. అజ్జు లాంటి వాళ్ళను మనం చూసే ఉంటాం. రియాలిటీకి దగ్గర జీవించే నిషా లాంటి అమ్మాయిలు అరుదుగా ఉన్నప్పటికీ... ఎప్పుడో ఒకప్పుడు ఎదురై ఉంటారు.


రచయిత అశ్విని అయ్యర్ తివారీ కొత్త కథ రాయలేదు. కానీ, చాలా మందికి కనెక్ట్ అయ్యే కథ రాశారు. కొన్ని సినిమాలు మొదలైన కాసేపటికి... ముగింపు అర్థం అవుతుంది. 'బవాల్' మొదలైన కాసేపటికి ఎండింగ్ ఈజీగా ఊహించవచ్చు. ఇమేజ్ కోసం పరితపించే హీరోలో మార్పు వస్తుందని, చివరకు భార్యకు దగ్గర అవుతారని చిన్న పిల్లాడిని అడిగినా సరే చెప్పేస్తాడు. ఆ కథలో హృదయానికి హత్తుకునే సీన్లు చాలా రాశారు.


'బవాల్'లో కొన్ని మూమెంట్స్, సీన్స్ సొసైటీని రిప్రజెంట్ చేస్తాయి. 'మనలోనూ ఓ హిట్లర్ ఉన్నాడు' అని చెబుతుంటే 'నిజమే' అనిపిస్తుంది. ఓ సన్నివేశంలో హీరో హీరోయిన్లు కూర్చుని ఒకరి ఇష్టాలు మరొకరికి చెబుతుంటారు. ఇద్దరి మధ్య కామన్ ఇష్టాలు ఏవీ ఉండవు. ఆ మాటే వరుణ్ ధావన్ అంటే... 'కామన్ గా ఉండాలా?' అని జాన్వీ కపూర్ ప్రశ్నిస్తుంది. భార్య భర్తల మధ్య కామన్ ఇష్టాఇష్టాలు ఉండాల్సిన అవసరం లేదని, ఒకరిపై మరొకరికి ప్రేమ ఉంటే చాలని సున్నితంగా సందేశం ఇచ్చే చిత్రమిది. భార్యను కొట్టకుండా, తిట్టకుండా ఉన్నంత మాత్రాన బాగా చేసుకుంటున్నట్లు కాదని, కనీసం ఒక్కరైనా బయటకు తీసుకు వెళ్ళారా? ఆమె ఇష్టాలు ఏంటో అడిగారా? అని ప్రశ్నిస్తుందీ సినిమా!


సినిమా చూస్తుంటే... రెండవ ప్రపంచ యుద్ధంలో అమరులైన సైనికులు ఎదుర్కొన్న ఇబ్బందులు ముందు మన కష్టాలు ఎంత? అనిపిస్తుంది. లక్నోలో యువకుడి జీవితానికి, రెండవ ప్రపంచ యుద్ధానికి ముడిపెట్టిన తీరు బావుంది. అయితే... యుద్ధం నేపథ్యంలో కొన్ని సీన్లు సాగదీశారు. 'బవాల్'లో లోపాలు లేవా? అంటే... ఉన్నాయి. కథ, కథనం ప్రిడిక్టబుల్! మధ్యలో కొన్ని సీన్లు బోర్ కొట్టిస్తాయి. కామెడీ అంతగా వర్కవుట్ కాలేదు. భార్య భర్తల సీన్ల మధ్యలో వచ్చే కొన్ని పంటి కింద రాయిలా తగులుతాయి. పాటలు వినసొంపుగా ఉన్నాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. కొన్ని చోట్ల మెరుగ్గా ఉంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ నీట్‌గా ఉన్నాయి. నిర్మాత పెట్టిన ఖర్చు తెరపై కనబడుతుంది. నిర్మాణ విలువలు బావున్నాయి.


నటీనటులు ఎలా చేశారు? : వరుణ్ ధావన్, జాన్వీ కపూర్... అజ్జు, నిషా - టిపికల్ బాలీవుడ్ హీరో హీరోయిన్స్ రోల్స్ చేశారు. అజ్జుగా వరుణ్ ధావన్ చక్కగా చేశారు. ఆయన పర్ఫార్మెన్స్ బావుంది. జాన్వీ విషయానికి వస్తే... ఆఫ్ స్క్రీన్ గ్లామర్ డ్రస్‌లలో కనిపించే అమ్మాయి. ఆన్ స్క్రీన్ మీద ఎమోషనల్ రోల్స్ చేస్తున్నారు. 'బవాల్'లో ఇంట్రడక్షన్ నిద్ర లేవడం నుంచి పతాక సన్నివేశాలకు ముందు ఇంగ్లీష్ టు హిందీ ట్రాన్స్‌లేట్ వరకు... ప్రతి సీనులో పర్ఫెక్షన్ చూపించారు. భార్యకు భర్త కనీస గౌరవం ఇవ్వని సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చేశారు. మిగతా వాళ్ళు పర్వాలేదు. పాత్రల పరిధి మేరకు చేశారు.


Also Read : 'హత్య' రివ్యూ : 'బిచ్చగాడు' హీరో విజయ్ ఆంటోనీ కొత్త సినిమా ఎలా ఉందంటే?


చివరగా చెప్పేది ఏంటంటే? : సింపుల్ & బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉన్న సినిమా 'బవాల్'. కథ, కథనాలు ఊహాజనితంగా ఉన్నప్పటికీ... హృదయానికి హత్తుకునే సన్నివేశాలు ఉన్నాయి. వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ అద్భుతంగా నటించారు. ఎలా జీవించాలో చెప్పే చిత్రమిది. ఫ్యామిలీ డ్రామా, రొమాంటిక్ ఫిలిమ్స్ మెచ్చే ప్రేక్షకులు హ్యాపీగా చూడొచ్చు. 


Also Read : 'హిడింబ' రివ్యూ : మనుషులను తినే గిరిజన జాతి మహానగరానికి వస్తే?










ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial