New Regulations for Tamil Movies : ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (FEFSI) కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఇప్పుడు ఆ నిబంధనలే తమిళ చిత్ర పరిశ్రమలో వివాదాలకు దారి తీస్తున్నాయి. తమిళ చిత్రాల్లో కేవలం తమిళ నటీనటులు, సాంకేతిక నిపుణులు మాత్రమే ఉండాలని కొత్తగా ఆదేశాలు జారీ చేసింది. అంతే కాదు వీటిని ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేసింది. ఈ క్రమంలో కొత్త నిబంధనలపై వచ్చిన విమర్శలను ప్రస్తావిస్తూ.. తమ సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని ఫెఫ్సీ ప్రెసిడెంట్ ఆర్కే సెల్వమణి చెప్పారు.
దేశంలోని అతిపెద్ద చిత్ర పరిశ్రమల్లో ఒకటైన కోలీవుడ్‌లో భాషేతర తారలు నటించడం, సీన్ల కోసం విదేశాల్లో షూట్ చేయడం మామూలే. అయితే ఇది తమిళనాడు సినిమా నిర్మాతల అవకాశాలను నాశనం చేస్తోందని ఫెఫ్సీ ఆరోపణలు చేసింది. ఇకపై తమిళ సినిమాల్లో కేవలం తమిళ నటులు, సాంకేతిక నిపుణులనే చేర్చుకోవాలని చెప్పింది. అత్యవసర పరిస్థితుల్లో మినహా సినిమాలను పూర్తిగా తమిళనాడులోనే చిత్రీకరించాలని ఆదేశించింది. దాంతో పాటు షూట్ అనుకున్న సమయానికి పూర్తి కాకపోతే లేదా బడ్జెట్ కు మించి ఉంటే నిర్మాతలు తప్పనిసరిగా సంస్థకు వ్రాత పూర్వకంగా తెలియజేయాలని చెప్పింది.
సినిమా కథకు దర్శకుడే యజమాని. కాబట్టి దానికి సంబంధించిన సమస్యలకు దర్శకుడే బాధ్యత వహించాలని ఫెఫ్సీ తెలిపింది. ఇతర పరిశ్రమలకు చెందిన నటీనటుల జోక్యంతో ఫెఫ్సీ సభ్యులకు సినిమాలు రావడం లేదని, తమిళ సినిమాల షూటింగ్ లు తమిళనాడుకు దూరమవుతున్నాయని ఆరోపించింది. ఇక ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రూపొందించిన నిబంధనలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ కొత్త షరతులపై నడికర్ సంఘం మినహా ముఖ్యమైన సంస్థలేవీ ఇంకా స్పందించలేదు. అయితే ఇతర భాషలకు చెందిన నటీనటులను అవకాశాలు ఇవ్వకూడదనే నిర్ణయాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని ఫెఫ్సీ ప్రెసిడెంట్ ఆర్కే సెల్వమణి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఇతర సినీ పరిశ్రమల్లో మాదిరిగానే.. తమిళంలోనూ ఇతర దేశాల, రాష్ట్రాల నటీనటులు నటిస్తారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పలు తమిళ సినిమాల్లోనూ మళయాళీ నటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పెద్ద పెద్ద సినీ తారల సినిమాలు ఎక్కువగా విదేశాల్లో షూట్ చేయడం కూడా చూస్తూనే ఉన్నాం. దీంతో తాజాగా ఫెఫ్సీ తీసుకువచ్చిన కొత్త షరతులపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.
ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా అనేది తమిళ చిత్ర పరిశ్రమలోని వివిధ రంగాలకు చెందిన వ్యక్తుల సంఘం. దర్శకుడు, నిర్మాత ఆర్కే. సెల్వమణి ఈ సంస్థకు ఛైర్మన్ గా ఉన్నారు. ఇది చలనచిత్రంతో పాటు టెలివిజన్ పరిశ్రమలోని ఇతర రంగాలలోని 23యూనియన్ల భాగస్వామ్యం. ఈ సంస్థలో దాదాపు 25వేల మంది సభ్యులున్నారు.
Also Read: కచ్చితంగా రామ్ చరణ్‌తో కలిసి సినిమా చేస్తా: ప్రభాస్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial