The Kashmir Files Unreported : 2022లో రిలీజైన 'ది కశ్మీర్ ఫైల్స్' ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ సినిమాను దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించారు. ఈ చిత్రం అప్పట్లో ఎంతటి విజయాన్ని సాధించిందో.. అదే స్థాయిలో ఎన్నో వివాదాలను ఎదుర్కొంది. తాజాగా ఆయన మరో క్రేజీ అప్ డేట్ తో వచ్చారు. 'ది కశ్మీర్ ఫైల్స్' ను వెబ్ సిరీస్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు అధికారికంగా తెలియజేశారు.
నాన్-ఫిక్షన్ ప్రాజెక్ట్ ది 'కశ్మీర్ ఫైల్స్ అన్‌రిపోర్టెడ్'ను త్వరలో స్ట్రీమర్ జీ5(ZEE5)లో విడుదల చేయనున్నట్లు వివేక్ అగ్నిహోత్రి ప్రకటించారు. దాంతో ఈ సిరీస్ కు సంబంధించిన ఓ చిన్న క్లిప్ ను కూడా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. "కశ్మీర్ పండితుల మారణహోమం జరిగిందనే వాస్తవాన్ని అంగీకరించలేని వారు, భారత శత్రువులు ‘ది కశ్మీర్ ఫైల్స్’ను ప్రశ్నించారు. ఇప్పుడు నేను హిందువుల మారణ హోమానికి సంబంధించిన చేదు నిజాన్ని వెబ్ సిరీస్ రూపంలో మీ ముందుకు తీసుకురాబోతున్నాను. భావోద్వేగాలతో కూడిన ఈ సిరీస్ ను చూడడానికి రెడీగా ఉండండి. కళ్ల ముందు కనిపిస్తోన్న వాస్తవాన్ని కూడా అంగీకరించలేని వారు మాత్రమే దీన్ని విమర్శిస్తారు" అంటూ ఆయన క్యాప్షన్ లో రాసుకువచ్చారు. ఈ సిరీస్ ను 'కశ్మీర్ అన్ రిపోర్టెడ్' అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు కూడా వెల్లడించారు.
'కశ్మీర్ ఫైల్స్ అన్‍రిపోర్టెడ్' వెబ్ సిరీస్‍కు సంబంధించి వివేక్ అగ్నిహోత్రి షేర్ చేసిన ఈ టీజర్ వీడియోలో.. కొన్ని కశ్మీర్ ఫైల్స్ సీన్లు కూడా ఉన్నాయి. దీంతో 'కశ్మీర్ ఫైల్స్' ను మరింత వివరంగా.. సినిమాలో చూపించని మరిన్ని అంశాలతో వెబ్ సిరీస్‍గా 'అన్‍రిపోర్టెడ్' పేరుతో వివేక్ అగ్నిహోత్రి రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ఈ ప్రకటనపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. సమాధి అయిన చాలా నిజాలను ఇది కచ్చితంగా బయటికి తీసుకొస్తుందని ఓ యూజర్ కామెంట్ చేయగా... మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఈ సారి ఈ 'కశ్మీర్ ఫైల్స్' అన్‍రిపోర్టెడ్ ఎలాంటి సంచలనాలు రేపుతుందో వేచి చూడాలి.
అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి నటించిన ఈ 'ది కశ్మీర్ ఫైల్స్' మార్చి 11, 2022న విడుదలైంది. అయితే ఆ సంవత్సరంలో అత్యంత వాణిజ్యపరంగా విజయవంతమైన హిందీ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. 1990లో కశ్మీర్‌లో హిందువులపై జరిగిన మారణ హోమాన్ని, దారుణాలను ఈ చిత్రంలో చూపించారు. అయితే, కశ్మీర్ ఫైల్స్ మూవీని దుష్ప్రచారమని కొందరు విమర్శిస్తే.. ఇన్నాళ్లకు నిజాలను బయటికి తెచ్చారని మరికొందరు ప్రశంసించారు. అదే కశ్మీర్ అంశంపై ఇప్పుడు వెబ్ సిరీస్ గా రానుంది.
Read Also : Project K Glimpse : బిగ్ బ్రేకింగ్ - 'ప్రాజెక్ట్ కె' గ్లింప్స్ వచ్చేసింది, టైటిల్ కూడా చెప్పేశారు!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial