సినిమా రివ్యూ : మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి
రేటింగ్ : 3/5
నటీనటులు : అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి, మురళీ శర్మ, జయసుధ, అభినవ్ గోమఠం, సోనియా దీప్తి, తులసి, నాజర్ తదితరులు
ఛాయాగ్రహణం : నిరవ్ షా
నేపథ్య సంగీతం : గోపి సుందర్
స్వరాలు : రధన్
నిర్మాతలు : వంశీ - ప్రమోద్
కథ, కథనం, మాటలు, దర్శకత్వం : మహేష్ బాబు పి.
విడుదల తేదీ: సెప్టెంబర్ 07, 2023
అనుష్క శెట్టి సినిమా ఐదేళ్ల తర్వాత వెండితెరపైకి వచ్చింది. థియేటర్లలో 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' (Miss Shetty Mr Polishetty) ఈ రోజు విడుదలైంది. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'జాతి రత్నాలు' తర్వాత నవీన్ పోలిశెట్టి నటించిన చిత్రమిది. యువి క్రియేషన్స్ నిర్మించింది. ఈ సినిమా (miss shetty mr polishetty review) ఎలా ఉంది?
కథ (miss shetty mr polishetty story) : అన్విత ఆర్. శెట్టి (అనుష్క) షెఫ్. పెళ్ళికి ఆమె వ్యతిరేకం. తల్లి (జయసుధ) మరణం తర్వాత ఒంటరితనం ఫీలవుతుంది. తనకు ఓ తోడు కావాలని, ఆ తోడు తన బిడ్డ అవ్వాలని అనుకుంటుంది. పెళ్లి చేసుకోకుండా లీగల్ ప్రొసీజర్ ద్వారా బిడ్డకు జన్మనివ్వాలని ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నాల్లో ఉన్న ఆమె ఓ రోజు సిద్ధూ పోలిశెట్టి (నవీన్ పోలిశెట్టి) స్టాండప్ కామెడీ షో చూస్తుంది. తన బిడ్డకు అతడు తండ్రి కావాలని ఆశిస్తుంది. అన్విత పరిచయం తర్వాత ఆమెతో ప్రేమలో పడతాడు సిద్ధూ. ఓ రోజు సినిమాటిక్ స్టైల్ లో ప్రపోజ్ చేస్తాడు. అప్పుడు అన్విత చెప్పిన సమాధానం విని షాక్ అవుతాడు. పెళ్లి కాకుండా పిల్లల్ని కనాలని అనుకోవడం సమాజానికి విరుద్ధమని, యాంటీ సోషల్ ఎలిమెంట్ అని తన అభిప్రాయాలు చెబుతాడు. దాంతో ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది? అన్విత దేశం వదిలి లండన్ ఎందుకు వెళ్ళింది? అసలు, ఆమె తల్లి అయ్యిందా? లేదా? లండన్ వెళ్లిన తర్వాత సిద్ధూ లేని లోటును, తన తోడు లేడని ఎందుకు ఫీలయ్యింది? చివరకు, ఇద్దరూ కలిశారా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (miss shetty mr polishetty review) : 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' కథలో మెదడుకు పని కల్పించే పెద్ద కథ ఏమీ లేదు. పెళ్లి కాకుండా తల్లి కావాలని ఓ మహిళ ఏం చేసింది? ఆ క్రమంలో ఆమెకు ఎటువంటి అబ్బాయి పరిచయం అయ్యాడు? ఆ తర్వాత ఏమైంది? క్లుప్తంగా చెప్పాలంటే... కథ ఇంతే! కానీ, ఆ కథలో కామెడీ, పాటలు, ఎమోషన్స్ చాలా చక్కగా కుదిరాయి.
పెళ్లి కాకుండా ఓ మహిళ ప్రెగ్నెంట్ కావడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. ఒకవేళ దర్శకుడు అనుకుంటే... ఆ సీన్లను చాలా విధాలుగా, రకాలుగా తీయవచ్చు. కానీ, మహేష్ బాబు పి ఎక్కడా హద్దు మీరలేదు. గీత దాటలేదు. కుటుంబం అంతా కలిసి చూసే చక్కటి వినోదాన్ని అందించారు. అలాగని, సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఆద్యంతం అలరించిందని చెప్పలేం.
సినిమా ప్రారంభం సాదాసీదాగా ఉంటుంది. అనుష్క, జయసుధ మధ్య బాండింగ్ & ఆ సీన్లు రొటీన్. హీరో, అతని తండ్రి మధ్య సీన్లలో కూడా కొత్తదనం లేదు. హీరో ఆఫీస్ సీన్లలో కూడా! అయితే, కామెడీ కోటింగ్ కారణంగా సరదాగా సాగుతుంది. పతాక సన్నివేశాల్లో హీరో హీరోయిన్లను కనెక్ట్ చేసిన విధానం, వాళ్ళ నేపథ్యాలను వాడిన తీరు బావుంది. తనలో భయాల గురించి అనుష్క చెప్పే సీన్ కంటతడి పెట్టింస్తుంది.
స్టాండప్ కామెడీలో 'అన్నీ అయిపోయిన తర్వాత ఏమైనా మిగిలుంటే... అది ప్రేమ ఏమో!?' అని హీరో డైలాగ్ చెబుతాడు. సినిమాలో చెప్పిన పాయింట్ అందుకు పూర్తి భిన్నమైంది. స్త్రీ పురుషుల మధ్య ఏమీ జరగకుండా, అసలు ఒక్క ముద్దు కూడా పెట్టుకోకుండా ప్రేమ పుడుతుందని చెప్పే చిత్రమిది. సింపుల్ కథను అంతే సింపుల్ ఎమోషన్స్, క్యారెక్టర్లతో తీసిన చిత్రమిది. ఫస్టాఫ్‌లో కొంత నిడివి తగ్గిస్తే బావుండేది.
సాధారణంగా ప్రేమకథలను చూసేటప్పుడు తెరపై పాత్రల్లో, సన్నివేశాల్లో తమను ప్రేక్షకులను ఊహించుకోవడం కామన్. ఈ కథలో అటువంటి సీన్లు లేదు. అసలు ఇది రెగ్యులర్ రొటీన్ లవ్ స్టోరీ కాదు. కానీ, చివరకు వచ్చేసరికి ఎమోషన్స్ కనెక్ట్ అవుతాయి. హీరో హీరోయిన్లు కలవాలని ప్రేక్షకుడు కోరుకునేలా ఉంది. అందుకు ప్రధాన కారణం గోపి సుందర్ నేపథ్య సంగీతం! రధన్ బాణీలు బావున్నాయి. నిరవ్ షా సినిమాటోగ్రఫీ విజువల్ పొయెట్రీలా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి.
నటీనటులు ఎలా చేశారంటే : సినిమా ప్రారంభంలో అనుష్క పాత్ర సాధారణంగా ఉంటుంది. ఏ దశలోనూ పాత్రను డామినేట్ చేయాలని చూడలేదు. లండన్ నుంచి భారత్ వచ్చిన అమ్మాయి రోల్ అని హద్దులు మీరలేదు. హుందాగా కనిపించారు. పతాక సన్నివేశాల్లో నటిగా తన టాలెంట్ చూపించారు అనుష్క. భావోద్వేగ భరిత సన్నివేశాల్లో ఆమె అభినయం మహిళల మనసులను తాకుతుంది.
నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ మరోసారి ఆకట్టుకుంటుంది. స్టాండప్ కామెడీలో తనకు తిరుగు లేదన్నట్లు కొన్ని సన్నివేశాల్లో విపరీతంగా నవ్వించారు. ముఖ్యంగా సెకండాఫ్ అంతా స్టాండప్ కామెడీ సీన్లు బావున్నాయి. ఎమోషనల్ సీన్స్ కూడా చక్కగా చేశారు.
సినిమా ప్రారంభమైన 15 నిమిషాల్లో జయసుధ పాత్ర ముగుస్తుంది. అనుష్కకు తల్లిగా, బాలకృష్ణ వీరాభిమానిగా ఆమె కనిపించారు. నాజర్, మురళీ శర్మ, తులసి... తెరపై కనిపించారు. ఆయా పాత్రలు వాళ్ళ అనుభవం ముందు చిన్నవి. అయితే, వాళ్ళు నటించడం వల్ల ఆ పాత్రలకు హుందాతనం వచ్చింది. హీరో స్నేహితుడిగా అభినవ్ గోమఠం కనిపించారు. నవీన్ పోలిశెట్టితో పోలిస్తే... ఆయనకు నవ్వించే అవకాశం అసలు రాలేదు. హీరోయిన్ స్నేహితురాలిగా సోనియా దీప్తి జస్ట్ ఓకే. మరీ చిన్న సీన్లలో ఓవర్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చినట్లు అనిపిస్తుంది.
Also Read : పెళ్ళికి అనుష్క రెడీ! కానీ, ఓ కండిషన్ - అదేమిటో తెలుసా?
చివరగా చెప్పేది ఏంటంటే : జీవితంలో ప్రతి ఒక్కరికి భాగస్వామి కావాలని, తోడుగా ఓ మనిషి ఉండాలని సందేశం ఇచ్చే సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. అయితే, మెసేజ్ ఇచ్చినట్లు అనిపించదు. పతాక సన్నివేశాల వరకు కనిపించదు. కేవలం వినోదం మాత్రమే ముందు సీటులో కూర్చుంటుంది. స్క్రీన్ ముందు కూర్చున్న ప్రేక్షకులను నవ్విస్తుంది. ఎండింగ్ ఎమోషనల్ సీన్లు హార్ట్ టచింగ్‌గా ఉన్నాయి. అసలు కథ, కామెడీ, ఎమోషన్స్ ఇంటర్వెల్ తర్వాతే ఉన్నాయి! మీ టికెట్ రేటుకు సరిపడా ఫన్ గ్యారెంటీ!
Also Read : పవన్ కళ్యాణ్ లుక్ & గన్స్ నుంచి కథ వరకు - 'ఓజీ' టీజర్‌లో ఇవి గమనించారా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial