పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'ఓజీ' (OG Movie). ఆయన అభిమాని సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇవాళ పవన్ పుట్టినరోజు సందర్భంగా వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. అభిమానులకు ఆ టీజర్ విపరీతంగా నచ్చింది. సగటు సినీ ప్రేక్షకులను సైతం ఆకట్టుంది. ముఖ్యంగా పవన్ స్టయిలిష్ లుక్, ఆ స్లీక్ యాక్షన్ సీక్వెన్సులు నచ్చాయి. అయితే... యాక్షన్ మాత్రమే కాదు, అంతకు మించి అనేట్లు దర్శకుడు సుజీత్ టీజర్ కట్ చేశారు. అందులో మీరు ఈ అంశాలు గమనించారా?


పవన్ ఎంట్రీ... 15వ సెకనులో!
'ఓజీ' టీజర్ (OG Teaser)లో ముందుగా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశం పవన్ కళ్యాణ్ ప్రజెన్స్! పవర్ స్టార్ లుక్స్, స్టైల్ నుంచి ఆయన యాక్షన్ వరకు... అన్నీ అభిమానులకు నచ్చేశాయి. అయితే... ఆ వీడియోలో పవన్ ఎప్పుడు ఎంట్రీ ఇచ్చారో తెలుసా? 15వ సెకనులో!


ముంబై వీధుల్లో ఓ కార్నర్! పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను కార్నర్ చేయాలని ఓ గ్యాంగ్ ట్రై చేసింది. కౌంటర్ ఎటాక్ ఇస్తూ... పవన్ కళ్యాణ్ చిన్న తుపాకీతో ఎదురు కాల్పులు జరిపారు. అయితే... ఆ ఫ్రేమ్ అంతగా రిజిస్టర్ కాలేదు. ఈసారి నిశితంగా గమనిస్తే.... పాజ్ చేసి చూస్తే... పవన్ కనపడతారు. 


పోలీస్ స్టేషన్‌లో చెయ్యి నరికేంత పవర్!
మాఫియా, రౌడీలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌లో వేసేంత పవర్ పోలీసుకు ఉంది. ఖాకీ చొక్కాలో అంత హీరోయిజం ఉంటుంది. అటువంటి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మరీ ఒకరి చెయ్యి నరకాలంటే... ఆ వ్యక్తికి ఎంత పవర్ ఉండాలి? అంత పవర్ ఫుల్ మాఫియా నాయకుడిగా పవన్ కళ్యాణ్ పాత్రను సుజీత్ చూపించారు. ఆ పవరుకు తమన్ నేపథ్య సంగీతం తోడు కావడంతో పవర్ స్టార్ హీరోయిజం మరింత ఎలివేట్ అయ్యింది. పోలీస్ స్టేషన్ నుంచి పవన్ కళ్యాణ్ వెళ్ళేటప్పుడు కొన్ని ఫైల్స్ తీసుకు వెళుతున్నట్టు సీన్ ఉంది. 


ఆ మరాఠీ మాటలకు అర్థం తెలుసా?
'ఓజీ' ప్రచార చిత్రంలో పవన్ కళ్యాణ్ మరాఠీలో డైలాగులు చెప్పారు. ఇంతకీ, ఆ మాటలకు అర్థం తెలుసా? 'Lavkar' అంటే... 'త్వరగా' అని అర్థం. 'Khade Khade Kaayi Bagthos Jaakar Dhund' అంటే... నిలబడి ఏం చూస్తున్నావ్ రా! వెళ్లి త్వరగా వెలుతుకు' అని అర్థం. ముంబై నేపథ్యంలో సినిమా కదా! అందుకని, మరాఠీ డైలాగులు ఉపయోగించినట్లు ఉన్నారు. 


'సాహో' ప్రపంచాన్ని అలా పరిచయం చేశారా!?
'ఓజీ' కంటే ముందు సుజీత్ దర్శకత్వం వహించిన సినిమా 'సాహో'. వాజీ సిటీలో ఆ కథ జరిగినట్లు చూపించారు. ఆ వాజీ సిటీకి, ముంబైలో ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌కు సంబంధం ఉంటుందని ఫిల్మ్ నగర్ ఖబర్. అంటే ఇది సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ అన్నమాట! ఇప్పుడీ 'ఓజీ' వీడియోలో 'వాజీ ఇంపోర్ట్స్ & ఎక్స్పోర్ట్స్' అని  బోర్డు చూపించారు. దాని ముందు ఫైట్ జరిగినట్లు హింట్ ఇచ్చారు. అది ఏమిటి? అనేది సినిమా వస్తే గానీ తెలియదు.


యాక్షన్ మాత్రమే కాదు... అంతకు మించి!
పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఓ ప్రత్యేకత ఏమిటంటే... ఆయన సినిమాల్లో సమాజానికి సందేశం ఇచ్చే పాటలు ఉంటాయి. పోరాట స్ఫూర్తి రగిలించే సన్నివేశాలు సైతం ఉంటాయి. ఇప్పుడీ 'ఓజీ'లో కొంత మంది రోడ్ల మీద ఆందోళన చేసే దృశ్యాలు, వాళ్ళను పోలీసులు కొట్టడం వంటివి ఉన్నాయి. వాళ్ళు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు? ఎందుకు ఆందోళన చేస్తున్నారు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అలాగే, బాంబే పోర్ట్ ట్రస్ట్ & ఈ కథకు సంబంధం ఏమిటి? అనేది కూడా!


కత్తులతో నరికే కాలం నుంచి తుపాకీలు వరకు!
'ఓజీ' కథ ఏ కాలంలో జరుగుతుంది? ప్రస్తుతానికి అయితే టైమ్ పీరియడ్ ఏదీ చెప్పలేదు. కానీ, టీజర్ చూస్తే ఒక్కటి అర్థం అవుతోంది... కత్తులతో ముంబై నగరాన్ని శాసించే రోజుల నుంచి తుపాకులతో యుద్ధం చేసే రోజుల వరకు జరుగుతుందని! ''పదేళ్ళ క్రితం వచ్చిన తుఫాను'' అంటూ మొదలు పెట్టి ''వాడు నరికిన మనుషుల రక్తాన్ని ఏ తుఫానూ కడగలేకపోయింది'' అంటూ అర్జున్ దాస్ చెప్పే మాటలు వింటే అది నిజమని అనిపిస్తోంది. బెల్ బాటమ్ పాంట్స్ పవన్ వేయడం చూస్తుంటే... 70, 80ల నేపథ్యం తీసుకున్నారేమో! 


Also Read : పవన్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన 'ఓజీ' టీజర్... ఆకాశమే హద్దుగా అంచనాలు, సుజీత్ ఏం చేస్తాడో?




రాత్రి వేళ ఆ జాతర ఏమిటి?
'ఓజీ' టీజర్ చూస్తే... మాఫియా గ్యాంగ్స్ మధ్య రాత్రి వేళ తూటాల జాతర ఖాయంగా కనబడుతోంది. అంతే కాదు... మరో జాతరను కూడా చూపించారు. అది ఏమిటి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్!


Also Read : బాక్సాఫీస్ బరిలో రౌడీ ర్యాంపేజ్ - రికార్డ్ స్థాయిలో 'ఖుషి' ఫస్ట్ డే కలెక్షన్స్!


లాస్ట్, బట్ నాట్ లీస్ట్... పవన్ స్టైల్!
'నేను ట్రెండ్ ఫాలో కాను. ట్రెండ్ సెట్ చేస్తా' - 'గబ్బర్ సింగ్'లో పవన్ డైలాగ్. ఇప్పుడీ 'ఓజీ' వీడియోతో మరోసారి స్టైల్ పరంగా ట్రెండ్ సెట్ చేశారు. ఆయన వాకింగ్ స్టైల్, ఆ స్వాగ్, లుక్స్... అన్నీ సూపర్!



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial