ప్రస్తుతం మన తెలుగు సినిమా స్థాయి ప్రపంచ నలుమూలలకు చేరుకున్న విషయం తెలిసిందే. ఇక గత ఏడాది విడుదలైన 'ఆర్ఆర్ఆర్' మూవీ ఏకంగా ఆస్కార్ అవార్డును అందుకొని తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచింది. 'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకోవడం తెలుగు సినీ పరిశ్రమలో మరో అరుదైన ఘనతగా చెప్పొచ్చు. అలా మన తెలుగు సినిమాకి భారీ వసూళ్లతో పాటు అరుదైన గౌరవాలు దక్కడంతో హిందీ పరిశ్రమ మీద ఒత్తిడి పెరిగిందని చెప్పొచ్చు. అందుకే ఇప్పుడు బాలీవుడ్ మేకర్స్ తమ సినిమాలకు భారీగా వసూళ్లు వస్తున్నా... అంతటితో తృప్తి చెందకుండా ఏకంగా అవార్డులపై కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఓ బాలీవుడ్ దర్శకుడు తన సినిమాని ఏకంగా ఆస్కార్ కి పంపించాలని ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇంతకీ ఎవరా డైరెక్టర్? ఏంటా సినిమా? అనేది తెలియాలంటే పూర్తి వివరాలకు వెళ్లాల్సిందే! బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీడియోల్, అమీషా పటేల్ జంటగా నటించిన 'గదర్ 2' ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 600 కోట్ల కలెక్షన్స్ అందుకుని బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అయితే చిత్ర దర్శకుడు అనిల్ శర్మ ఈ చిత్రాన్ని ఆస్కార్ పురస్కారాలకు పంపడానికి కృషి చేస్తున్నట్లు తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇటీవల ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్ శర్మ కి 'గదర్ 2' ని ఆస్కార్ కి పంపుతున్నారా? అని అడిగారు.
ఆస్కార్ పశ్నకు అనిల్ శర్మ బదులిస్తూ... "చాలామంది ఈ సినిమాను ఆస్కార్ కు పంపమని పదే పదే నాకు ఫోన్ కాల్స్ చేస్తున్నారు. 2001లో నేను తెరకెక్కించిన 'గదర్' ఆస్కార్ కి వెళ్లలేదు. ఇప్పుడు 'గదర్ 2' కూడా ఆస్కార్ కి ఎలా వెళుతుందో తెలియదు. కానీ మేమంతా ఇప్పుడు దానిపైనే ఫోకస్ చేసాం. కచ్చితంగా 'గదర్ 2' ఆస్కార్ కి వెళ్ళాలి. ఎందుకంటే 'గదర్ 2' ఆస్కార్ కి అర్హత ఉన్న చిత్రం. 'గదర్' కూడా ఆస్కార్ కు వెళ్లాల్సిన సినిమానే. 1947 నాటి విభజన నేపథ్యంలో తీసిన 'గదర్' కథను చాలా డిఫరెంట్ గా చెప్పాము. అది ఒక కొత్త కథ, అలాగే 'గదర్ 2' కూడా పూర్తిగా కొత్త కథతోనే తెరకెక్కింది" అని అన్నారు.
తన సినిమాలకు ఎటువంటి అవార్డులు అందుకోకపోవడం గురించి అనిల్ శర్మ మాట్లాడుతూ... "అలాంటి సమయంలో నేను అసలు పని చేయనట్లే అనిపిస్తుంది. ఒకప్పుడు ధర్మేంద్ర గారు తాను కచ్చితంగా అవార్డు గెలవాలని, ఆ అవార్డును స్టేజ్ పై అందుకోవాలని కొత్తగా సూట్లను తయారు చేసుకుంటానని, అవార్డు షోల కోసం కొత్త టైలు ధరిస్తానని నాతో చెప్పడం ఇప్పటికీ నాకు గుర్తుంది. కానీ ఇప్పటికీ ఆయనకు ఏ అవార్డు రాలేదు. అప్పుడు ఆయన నాతో 'నేను ఈ పరిశ్రమలో భాగమైనట్లు నాకు అనిపించడం లేదని' చెప్పేవారు. ఇప్పుడు నాకు కూడా అలాగే ఉంది. మేము ఎలాంటి అవార్డులు అందుకోలేదు. కానీ మా సినిమా పై ప్రేక్షకుల ఆదరణ ఉంది. 'గదర్ 2' తో మేము ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నాం. నేను అబద్ధాలు చెప్పను. కానీ మాకు కూడా అవార్డులు రావాలి. ఇక నా విషయానికొస్తే నేను అవార్డ్స్ ని ఎక్స్పెక్ట్ చేయను. ఎందుకంటే వాటిని నేను పొందలేనని నాకు తెలుసు" అని చెప్పుకొచ్చారు డైరెక్టర్ అనిల్ శర్మ.
Also Read : పవన్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన 'ఓజీ' టీజర్ - సుజీత్ ఏం చేస్తాడో? ఆకాశమే హద్దుగా అంచనాలు