సినిమా రివ్యూ : గ్రే ద స్పై హూ లవ్డ్ మి 
రేటింగ్ : 2.25/5
నటీనటులు : ఊర్వశీ రాయ్, అరవింద్ కృష్ణ, అలీ రెజా, ప్రతాప్ పోతన్, రాజ్ మాదిరాజు, షానీ సాల్మన్ తదితరులు
ఛాయాగ్రహణం : చేతన్ మధురాంతకం 
సంగీతం : నాగరాజ్ తాళ్ళూరి
నిర్మాతలు : వెంకట్ కిరణ్ కాళ్లకూరి, హేమా మాధురి కళ్లకూరి 
రచన, దర్శకత్వం : రాజ్ మాదిరాజు 
విడుదల తేదీ: మే 26, 2023


దర్శకుడిగా రాజ్ మాదిరాజు (Raj Madiraju) తీసిన చిత్రాలు తక్కువే. కానీ, ఆయనకు అభిమానులు ఎక్కువ. 'రిషి', 'ఐతే 2.0', 'ఆంధ్రా పోరి' తదితర చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన కొంత విరామం తర్వాత 'గ్రే' (Grey Telugu Movie)తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో ఊర్వశీ రాయ్, అరవింద్ కృష్ణ (Aravind Krishna), ప్రతాప్ పోతన్, అలీ రెజా ప్రధాన తారాగణం. ఈ సినిమా ఎలా ఉంది? 


కథ (Grey Telugu Movie Story) : ఫేమస్ న్యూక్లియర్ సైంటిస్ట్, ప్రొఫెసర్ సుదర్శన్ రెడ్డి (ప్రతాప్ పోతన్) తన ఇంటిలోని ఆఫీస్ రూములో మరణించారు. పోలీస్ ఉన్నతాధికారి చెప్పడంతో ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చానని నాయక్ (అలీ రేజా) ఆ ఇంటిలో ఎంటర్ అవుతారు. సుదర్శన్ రెడ్డి ఇంటికి వెళ్ళిన నాయక్... ప్రొఫెసర్ భార్య ఆరుషి (ఊర్వశి రాయ్) అందానికి ఫిదా అయ్యి ఆమెతో ఫ్లర్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అసలు... తన కంటే వయసులో 20 సంవత్సరాలు పెద్ద వాడైన సుదర్శన్ రెడ్డిని ఆరుషి ఎందుకు పెళ్లి చేసుకుంది? తనను ఎవరో చంపడానికి ట్రై చేస్తున్నారని ప్రొఫెసర్ ఎందుకు భావించేవారు? మధ్యలో డాక్టర్ రఘు (అరవింద్ కృష్ణ) ఎవరు? తనను ప్రొఫెసర్ ఎంత ప్రేమించినా సరే... శారీరక సుఖం కోసం ఆరుషి ఎవరెవరికి దగ్గర అయ్యింది? అసలు... సుదర్శన్ రెడ్డిది హత్యా? ఆత్మహత్యా? చివరకు ఏం తేలింది? నాయక్ నిజ స్వరూపం ఏమిటి? ఆరుషి నేపథ్యం ఏమిటి? మధ్యలో రా ఏం చేసింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ (Grey Telugu Movie Review) : 'గ్రే' గురించి చెప్పాలంటే... విశ్రాంతికి ముందు, ఆ తర్వాత అని చెప్పాలి! ఒక్క టిక్కెట్టు మీద రాజ్ మాదిరాజు రెండు సినిమాలు చూపించారు. ఇంటర్వెల్ వరకు ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్ తరహాలో ఉంటుంది. అరవింద్ కృష్ణ - ఊర్వశీ రాయ్, అలీ రెజా - ఊర్వశీ రాయ్ మధ్య సీన్లు మాస్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇంటర్వెల్ తర్వాత తనలో దర్శకుడిని రాజ్ మాదిరాజు బయటకు తీశారు. ఒక్కొక్కరి నేపథ్యం వెల్లడిస్తూ వస్తుంటే కథా గమనమే మారిపోయింది. 


ఈ మధ్య భారతీయ తెరపై 'రా' నేపథ్యంలో సినిమాలు ఎక్కువయ్యాయి. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ గూఢచారులుగా కనిపించారు. దీపికా పదుకోన్, కట్రీనా కైఫ్ కూడా ఏజెంట్ రోల్స్ చేశారు. అయితే... ఆ సినిమాలకు భిన్నమైన సినిమా 'గ్రే'. ఇందులో ఊర్వశీ రాయ్ ఏజెంట్. గూఢచారి నేపథ్యంలో వచ్చిన రొమాంటిక్ థ్రిల్లర్ ఇది. కథ పరంగా రాజ్ మాదిరాజు మంచి కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. అయితే... రేసీగా తీయలేదు. డ్రామాగా తీశారు. థ్రిల్ ఇచ్చేలా తీసుంటే రిజల్ట్ ఇంకా బావుండేది. 


'గ్రే' ఫస్టాఫ్ అంతా సాదాసీదాగా ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత ముఖ్యంగా క్లైమాక్స్ ముందు రివీల్ చేసిన ట్విస్ట్స్ షాకింగ్ గా ఉన్నాయి. సినిమా అంతా గ్రే కలర్ లో చూపించడం రాజ్ మాదిరాజ్ చేసిన ప్రయోగం. అది బావుంది. నేపథ్య సంగీతం పరంగా కూడా ఆయన ప్రయోగం చేశారు. అది అంతగా సక్సెస్ కాలేదు. టెక్నికల్ అంశాలు, సినిమాటిక్ గ్రామర్ పరంగా రాజ్ మాదిరాజు బ్రిలియన్స్, కొన్ని ప్రయోగాలు సీన్లలో కనబడతాయి. అయితే, రెగ్యులర్ ఆడియన్ అవి గమనిస్తారా? అంటే చెప్పలేం.  వాళ్ళకు కావాల్సింది తాము కోరుకున్న ఎంటర్టైన్మెంట్ లభించిందా? లేదా? అనేది మాత్రమే. 


నటీనటులు ఎలా చేశారు? : అరవింద్ కృష్ణది ఆరడుగుల కటౌట్! కానీ, అందుకు తగ్గ క్యారెక్టర్ అయితే ఈ సినిమాలో లభించలేదు. డాక్టర్ రఘు పాత్రకు అతను న్యాయం చేశారు. ఎండింగ్ చూస్తే... సీక్వెల్‌లో అరవింద్ కృష్ణ కటౌట్‌కు తగ్గ రోల్ ఉందని అర్థమవుతుంది. ప్రొఫెసర్ పాత్రకు ప్రతాప్ పోతన్ పెర్ఫెక్ట్ సెట్! ఆయన నటనకు వంక పెట్టలేం. తొలి సినిమాలోనే హీరోయిన్ ఊర్వశీ రాయ్ లెంగ్తీ & ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. ఆమె లిప్ లాక్ సీన్స్ చేశారు. సన్నివేశాలు డిమాండ్ చేయడంతో సెక్సీగా కనిపించారు. సెక్సీ సీన్లూ చేశారు. నటిగానూ ఓకే. అలీ రేజా పాత్రకు న్యాయం చేశారు. రాజ్ మాదిరాజు 'రా'లో ఉన్నతాధికారి పాత్ర చేశారు. దానికి ఆయన న్యాయం చేశారు. షాని సాల్మన్ చిన్న రోల్ చేశారు.  


Also Read : 'మళ్ళీ పెళ్లి' రివ్యూ : నరేష్, పవిత్ర తప్పు చేశారా? లేదంటే రమ్యా రఘుపతిది తప్పా? ఏం చూపించారంటే?


చివరగా చెప్పేది ఏంటంటే? : రాజ్ మాదిరాజు చేసిన డిఫరెంట్ అటెంప్ట్ 'గ్రే'. ఇది అందరికీ నచ్చే సినిమా కాదు. దీని టార్గెట్ ఆడియన్స్ ఓటీటీలో ఎక్కువ ఉంటారు. రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్స్ మధ్యలో కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్ చూడాలని కోరుకునే ప్రేక్షకులకు మాత్రమే 'గ్రే'.


Also Read 'మేమ్ ఫేమస్' రివ్యూ : 'మేజర్', 'రైటర్ పద్మభూషణ్' తర్వాత ఛాయ్ బిస్కెట్‌కు మరో హిట్టేనా?