సినిమా రివ్యూ : బటర్ ఫ్లై
రేటింగ్ : 2.5/5
నటీనటులు : అనుపమా పరమేశ్వరన్, నిహాల్ కోదాటి, భూమికా చావ్లా, రావు రమేష్, ప్రవీణ్, 'రచ్చ' రవి, ప్రభు, రజిత, 'వెన్నెల' రామారావు, మేఘన, మాస్టర్ దేవాన్షు, బేబీ ఆద్య తదితరులు
మాటలు : దక్షిణ్ శ్రీనివాస్
పాటలు : అనంత్ శ్రీరామ్ 
ఛాయాగ్రహణం : సమీర్ రెడ్డి 
సంగీతం : అర్విజ్, గిడియన్ కట్టా  
నిర్మాతలు : రవిప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్ళూరి, ప్రదీప్ నల్లమెల్లి 
కథ, కథనం, దర్శకత్వం : ఘంటా సతీష్ బాబు
విడుదల తేదీ: డిసెంబర్ 29, 2022
ఓటీటీ వేదిక : డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌


అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) కు ఈ ఏడాది కలిసొచ్చిందనే చెప్పాలి. సంక్రాంతికి 'రౌడీ బాయ్స్', తర్వాత పాన్ ఇండియా సక్సెస్ 'కార్తికేయ 2', మధ్యలో 'అంటే సుందరానికి'లో ప్రత్యేక పాత్ర, ఇటీవల '18 పేజెస్' సినిమాలతో థియేటర్లలో సందడి చేశారు. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చారు. అనుపమ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'బటర్ ఫ్లై' (Butterfly Movie 2022). తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ఓటీటీ విడుదల చేసింది. ఈ సినిమా ఎలా ఉంది?    


కథ (Butterfly Movie Story) : గీత (అనుపమా పరమేశ్వరన్)కు ఓ చిన్న సమస్య ఉంది. కొత్తవాళ్ళతో త్వరగా కలవలేదు. ఆమెకు ఓ అక్క ఉంది. పేరు వైజయంతి (భూమిక)... ప్రముఖ లాయర్. తల్లిదండ్రులు ప్రమాదంలో చనిపోవడంతో చిన్నప్పటి నుంచి గీతను అక్కలా కాకుండా అమ్మలా పెంచింది. ఓ పరీక్ష రాయడం కోసం వైజయంతి ఢిల్లీ వెళుతుంది. సరిగ్గా అదే సమయంలో ఆమె ఇద్దరు పిల్లలు కిడ్నాప్ అవుతారు. విడాకులకు కోర్టులో కేసు వేసిందని వైజయంతి భర్త (రావు రమేష్) కిడ్నాప్ చేశాడా? లేదా ఏదైనా కేసు విషయంలో తమ దారిలోకి తెచ్చుకోవాలని ఎవరైనా క్రిమినల్స్ చేశారా? తన సమస్యను అధిగమించి మరీ వైజయంతికి తెలియకుండా పిల్లలు ఇద్దరినీ విడిపించడం కోసం గీత ఏం చేసింది? ఆమె కష్టాలు పడింది? డబ్బులు తీసుకున్న తర్వాత పిల్లల్ని చంపిన కిడ్నాపర్లు వంటి ఘటనలు జరిగిన సిటీలో చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ : 'ఆడపిల్లకి అమ్మ కడుపులో, స్మశానంలో మాత్రమే రక్షణ ఉంది' - సినిమా ప్రారంభంలోని ఓ సన్నివేశంలో భూమిక చెప్పే మాట. నేటి సమాజంలో మహిళల పరిస్థితికి అద్దం పట్టే మాట. 'బటర్ ఫ్లై' చిత్రంలో కథా రచయిత, దర్శకుడు ఘంటా సతీష్ బాబు అంతర్లీనంగా ఇచ్చిన సందేశమిది. అయితే, అసలు కథ వేరు. పైన చెప్పినట్టు కిడ్నాప్ అయిన అక్క పిల్లలను కాపాడాలని ఓ అమ్మాయి ఎంత ట్రై చేసింది? అనేది మెయిన్ స్టోరీ. ఆ అమ్మాయి ప్రయాణంలో ఈ సందేశాన్ని చక్కగా మేళవించారు. 


'బటర్ ఫ్లై' కథ, సినిమాలో చెప్పిన విషయం పూర్తిగా కొత్తది అని చెప్పలేం. గతంలో కిడ్నాప్, మిస్టరీ డ్రామాలు చూశాం. మహిళలకు సమాజంలో రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. ఆ రెండూ ఒక్క కథలో మిళితం చేయడం సినిమా ప్రత్యేకత. అనాథ, ఆడపిల్ల అంటూ హీరోయిన్ క్యారెక్టర్ మీద సింపతీ క్రియేట్ అయ్యేలా దర్శకుడు సీన్లు తీయలేదు. భూమిక, అనుపమ పాత్రలను ఉన్నతంగా చూపించారు. అందుకు అతడిని మెచ్చుకోవాలి. కథ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ, కథనంలో లూప్ హోల్స్ వదిలేశారు. సినిమాటిక్ లిబర్టీ చాలా తీసుకున్నారు. టెన్షన్ బిల్డ్ చేయాల్సిన సన్నివేశాలను సాధారణంగా తీశారు. 


సినిమా ప్రారంభంలో పిల్లలకు భూమిక ఓ కథ చెబుతారు. సరిగ్గా కాన్సంట్రేట్ చేస్తే మెయిన్ విలన్ ఎవరనేది అప్పుడే క్లారిటీ వస్తుంది. సినిమా స్టార్ట్ చేసిన అరగంట వరకు క్యారెక్టర్లు ఎస్టాబ్లిష్ చేయడానికి టైమ్ తీసుకున్నాడు దర్శకుడు. ఆ తర్వాత మరో అరగంట నిదానంగా నడిపారు. అసలు కథ గంట తర్వాత మొదలవుతుంది. అప్పటి నుంచి పతాక సన్నివేశాల వరకు ఆసక్తికరంగా తీసుకు వెళ్లారు. గొంగళి పురుగు సీతాకోక చిలుకలా మారడానికి టైమ్ పట్టినట్టు... కొత్త వాళ్ళను కలవడానికి ఇబ్బంది పడే అమ్మాయి, అక్క పిల్లల కోసం ఎంత మందిని కలిసింది? ఎంత టైమ్ తీసుకుంది? ఏం చేసింది? హీరోయిన్ క్యారెక్టరైజేషన్ చక్కగా రాశారు. దర్శకుడు ఇక్కడ తెలివి చూపించాడు. భూమిక చెప్పే కథలో పాత్రలు మంచివి. కానీ, కథలో చెడ్డవాళ్ల గురించి ఆ కథలో హింట్ ఉంది. హీరోయిన్ కథలో మార్పును సూచించడానికి 'బటర్ ఫ్లై' టైటిల్ పెట్టారు. కానీ, అమ్మాయి గొంగళి పురుగు లాంటిది అని కాదు. 


సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బావుంది. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సాంగ్ రొటీన్ అని చెప్పాలి. అయితే, నేపథ్య సంగీతంలో వచ్చే పాట వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతుంది. అనంత్ శ్రీరామ్ సాహిత్యం అర్థవంతంగా ఉంది. చివరిలో వచ్చే పాట కూడా! నిర్మాణ విలువలు బావున్నాయి.


నటీనటులు ఎలా చేశారంటే? : సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాల్లో ఆర్టిస్టులకు నటించే అవకాశం ఉండదు. కానీ, 'బటర్ ఫ్లై'లో అలా కాదు. క్యారెక్టర్లకు తగ్గ నటీనటులను దర్శకుడు ఎంపిక చేసుకున్నారు. పతాక సన్నివేశాల్లో అనుపమా పరమేశ్వరన్ నటన ఆకట్టుకుంటుంది. భూమిక నటన ఆ పాత్రకు హుందాతనాన్ని తీసుకు వచ్చింది. అనుపమ లవర్ పాత్రలో నిహాల్ కోదాటి చక్కగా నటించారు. పాటలో డ్యాన్స్ కూడా చేశారు. ప్రేమికుడిగా, ప్రేయసి కష్టాల్లో ఉన్నప్పుడు ఆమె బాధను ఫీలయ్యే యువకుడిగా ఎమోషన్స్ బాగా చూపించారు. రావు రమేష్, 'వెన్నెల' రామారావు, 'రచ్చ' రవి తదితరులు పాత్రల పరిధి మేరకు చేశారు. 
   
Also Read : 'కనెక్ట్' రివ్యూ : 'కనెక్ట్' రివ్యూ : నయనతార సినిమా భయపెడుతుందా? బోర్ కొడుతుందా?


చివరగా చెప్పేది ఏంటంటే : రెగ్యులర్‌గా వచ్చే సస్పెన్స్, థ్రిల్లర్ మూవీలకు కాస్త డిఫరెంట్ సినిమా 'బటర్ ఫ్లై'. కిడ్నాప్స్ ఉన్నాయి. కానీ, వయలెన్స్ లేదు. మహిళలకు ఎదురయ్యే సమస్యలు ఉన్నాయి. కానీ, వల్గారిటీ లేదు. ఫ్యామిలీతో కలిసి చూసేలా సినిమా ఉంటుంది. కాకపోతే చిన్న సమస్య ఏంటంటే... చాలా నిదానంగా సినిమా ముందుకు వెళుతుంది. థ్రిల్ కూడా ఎక్కువ లేదు. ఓటీటీ కాబట్టి ట్రై చేయవచ్చు. సీతాకోక చిలుక అందంగా ఉంటుంది. అనుపమ అందంగా కనిపించడంతో పాటు ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలని సందేశం ఇచ్చారు. సందేశాత్మక సస్పెన్స్ చిత్రమిది. స్ట్రాంగ్ ఫిమేల్ క్యారెక్టర్స్ ఉన్న సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు 'బటర్ ఫ్లై' నచ్చుతుంది.
 
Also Read : ధమాకా రివ్యూ: 2022ని రవితేజ హిట్టుతో ముగించాడా? థియేటర్లో ధమాకా పేలిందా? తుస్సుమందా?