సినిమా రివ్యూ : బుట్ట బొమ్మ
రేటింగ్ : 2.5/5
నటీనటులు : అనిఖా సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ, ప్రేమ్ సాగర్, నవ్యా స్వామి, నర్రా శ్రీను, 'మిర్చి' కిరణ్, పమ్మి సాయి, వాసు ఇంటూరి, 'పుష్ప' జగదీశ్ తదితరులు
స్క్రీన్ ప్లే, మాటలు : గణేష్ కుమార్ రావూరి
ఛాయాగ్రహణం : వంశీ పచ్చిపులుసు
సంగీతం : గోపీసుందర్, స్వీకర్ అగస్తి
నిర్మాతలు : నాగ‌వంశీ ఎస్‌. - సాయి సౌజ‌న్య‌
దర్శకత్వం : శౌరి చంద్రశేఖర్ రమేష్
విడుదల తేదీ: ఫిబ్రవరి 4, 2023


మలయాళ సినిమా 'కప్పేలా' (Kappela Telugu Remake Review)ను తెలుగులో 'బుట్ట బొమ్మ' (Butta Bomma Movie)గా రీమేక్ చేశారు. త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సూర్యదేవర నాగవంశీ నిర్మాతలు కావడం... ప్రచార చిత్రాలు బాగుండటంతో సినిమాపై ప్రేక్షకుల చూపు పడింది. మరి, సినిమా ఎలా ఉంది?


కథ (Butta Bomma Movie Story) : సత్య (అనిఖా సురేంద్రన్)ది సాధారణ మధ్య తరగతి కుటుంబం. వాళ్ళది అరకు. ఇంట్లోనే టైలరింగ్ చేసే తల్లి, రైసు మిల్లులో పని చేసే తండ్రి, స్కూల్‌కు వెళ్ళే చెల్లి, ఫోన్ తీసుకుని బాయ్ ఫ్రెండుతో మాట్లాడే పక్కింట్లో స్నేహితురాలు, తనకు లైన్ వేసే డబ్బున్న జమీందారు ... ఇదీ సత్య లైఫ్! ఏడు వేలు పెట్టి కెమెరా ఫోన్ కొనుక్కోవడం ఆమె యాంబిషన్. ఎందుకంటే... కెమెరా ఫోనుతో రీల్స్ చేసి ఫేమస్ అయిపోవాలని! సాఫీగా సాగుతున్న సత్య జీవితాన్ని ఒక్క రాంగ్ డయల్ మలుపు తిప్పుతుంది. ఫోనులో పరిచయమైన మురళి (సూర్య వశిష్ఠ)తో ప్రేమలో పడుతుంది. అతడిని చూడకుండా ప్రేమిస్తుంది. ఇంట్లో పెళ్లి సంబంధం ఖాయంతో చేయడంతో సూర్యను చూడటం కోసం విశాఖ వెళుతుంది. ఆ తర్వాత ఏమైంది? ఆర్కే (అర్జున్ దాస్) ఎవరు? సత్య, మురళిని ఎందుకు ఫాలో అయ్యాడు? ఏం చేశాడు? అనేది తెరపై చూసి తెలుసుకోవాలి. 


విశ్లేషణ : కథలు ఎక్కడో ఉండవు. మన చుట్టుపక్కల మనకు తెలియకుండా చాలా జరుగుతాయి. తెలిసిన తర్వాత ఆశ్చర్యపోవడం మన వంతు అవుతుంది. అలాంటి ఓ కథే 'బుట్ట బొమ్మ'. మలయాళంలో 'కప్పేలా'కు మంచి ప్రశంసలు వచ్చాయి. ఆ కథతో తెలుగు సినిమా అంటే ఆసక్తి ఏర్పడింది. కొందరు 'కప్పేలా' చూశారు. కొంత మంది చూడలేదు. 'కప్పేలా'లో ఏముంది? ఎలా తీశారు? అనేది పక్కన పెట్టి, ఈ సినిమాకు వస్తే... 


'బుట్ట బొమ్మ'లో అందమంతా కథలో కాదు, క్యారెక్టరైజేషన్లలో ఉంది. ఇదొక సింపుల్ కథ. చాలా అంటే చాలా సింపుల్! రెండు ట్విస్టులను బేస్ చేసుకుని రాసుకున్న కథ. ఒకటి ఇంటర్వెల్ ముందు, ఇంకొకటి క్లైమాక్స్ ముందు వస్తాయి! మలయాళ సినిమా చూసిన వాళ్ళకు ఆ ట్విస్టులు ఏంటో తెలుస్తాయి. చూడని వాళ్ళను సర్‌ప్రైజ్ చేస్తాయి. 


సినిమా ప్రారంభమైన తర్వాత, క్యారెక్టరైజేషన్లు ఏంటో అర్థమయ్యాక... ఇంటర్వెల్ వరకు ఆడియన్ వెయిట్ చేయాల్సి వస్తుంది. అమ్మాయి నేపథ్యం గట్రా బావుంది. అయితే, పొడుపు కథలకు సమాధానాలు చెప్పాడని అమ్మాయి... ఆమె గొంతు బావుందని అబ్బాయి ప్రేమలో పడటమే మనసుకు ఎక్కదు. ఆ సన్నివేశాలను నమ్మేలా తీయడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యారు. అక్కడ వినోదమూ వర్కవుట్ కాలేదు. ఇంటర్వెల్ వరకు ఇదొక ప్రేమ కథ అనుకుంటే... ఆ తర్వాత థ్రిల్లర్ టర్న్ తీసుకుంటుంది. అర్జున్ దాస్ ఇమేజ్, ఆయన క్యారెక్టర్ సినిమాను కాసేపు పరుగులు పెట్టిస్తుంది. చిన్న పాయింట్ తీసుకుని సాగదీసిన చాలా చోట్ల కలుగుతుంది. క్యారెక్టర్లతో కనెక్ట్ అయ్యేలా దర్శకుడు సినిమా తీయలేకపోయారు.


'బుట్ట బొమ్మ'లో చాలా సన్నివేశాల్లో రచయితగా గణేష్ రావూరి మెరిశారు. ఆయన మాటల్లో త్రివిక్రమ్ ప్రభావం కనపడింది. కొన్ని అర్థవంతమైన సంభాషణలు రాశారు. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బావున్నాయి. పాటలు వినసొంపుగా ఉన్నాయి. నేపథ్య సంగీతం ఓకే. తెలుగులో ఇటువంటి నేపథ్యంలో సినిమాలు రావడం కూడా కనెక్ట్ కాలేకపోవడానికి ఒక కారణం ఏమో!?


నటీనటులు ఎలా చేశారంటే? : అనిఖా సురేంద్రన్ నటన కంటే రూపం పాత్రకు సరిగ్గా సరిపోయింది. తన వయసు పాత్ర కావడంతో పెద్దగా కష్టపడాల్సిన పని పడలేదు. పల్లెటూరి అమ్మాయిగా, సాధారణ కుటుంబంలో యువతిగా సెట్ అయ్యారు. 'బుట్ట బొమ్మ'లో స్టార్ అంటే అర్జున్ దాస్! నటుడిగా బాగా చేశారు. ఇక, వాయిస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. సూర్య వశిష్ఠకు తొలి చిత్రమైనా చక్కగా చేశారు. లుక్స్, యాక్టింగ్ బావున్నాయి. నవ్య స్వామి పాత్ర నిడివి తక్కువే. మిగతా తారాగణం పాత్రలకు తగినట్లు నటించారు.


Also Read : 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?


చివరగా చెప్పేది ఏంటంటే? : 'బుట్ట బొమ్మ' సింపుల్ సినిమా. స్వీట్ సినిమా! చిన్న పాయింట్ తీసుకుని చక్కగా తెరకెక్కించారు. అయితే, థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏదో వెలితిగా ఉంటుంది. పార్టులు పార్టులుగా కొన్ని సీన్స్ సూపర్ అనిపిస్తాయి. అయితే, ఓవరాల్ సినిమాగా 'జస్ట్ ఓకే' అనిపిస్తుంది.


Also Read : 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?