బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ కు భారత్ తో పాటు ప్రపంచ నలుమూల్లో అభిమానులున్నారు. ఆయన సినిమా విడుదలైందంటే చాలు ఎగబడి చూస్తారు. తాజాగా బంగ్లాదేశ్ లో ఉంటున్న ఓ ఫ్యామిలీ, షారుఖ్ లేటెస్ట్ మూవీ ‘పఠాన్’ చూసేందుకు చేసిన ప్రయత్నం అందరినీ ఔరా అనిపిస్తోంది. ఈ సినిమా కోసం ఏకంగా ఫ్యామిలీ అంతా బంగ్లాదేశ్ నుంచి భారత్ కు రావడం చూసి అవాక్కవుతున్నారు.
ఫేస్ బుక్ లో షేర్ చేసిన ఫిరోజ్ అహ్మద్
‘పఠాన్‘ సినిమా చూసేందుకు బంగ్లాదేశ్ లో నివాసం ఉంటున్న ఫిరోజ్ అహ్మద్ ఫ్యామిలీ ఢాకా నుంచి త్రిపురలోని అగర్తాలకు వచ్చింది. ఈ విషయాన్ని ఫిరోజ్ తన ఫేస్ బుక్ వాల్ పై షేర్ చేశాడు. ఈ పోస్టును అగర్తలాలోని రూపసి సినిమా హాల్ యజమాని సతాదీప్ సాహా ట్విట్టర్ లో షేర్ చేశారు. “ఇది గొప్ప విషయం.. ప్రేక్షకులు ‘పఠాన్’ సినిమా చూడటానికి బంగ్లాదేశ్ నుంచి భారత్ కు వస్తున్నారు. అగర్తలా త్రిపురను, రూపసి సినిమాస్ ను సందర్శించినందుకు ధన్యవాదాలు" అంటూ ట్వీట్ చేశారు.
జవాన్ కూడా భారత్ లోనే చూస్తాం!
ఈ ట్వీట్ కు ఫిరోజ్ రిప్లై ఇచ్చారు. “హాయ్ సతాదీప్, మా పోస్ట్ ను అందరికీ షేర్ చేసినందుకు ధన్యవాదాలు. నేను భారతదేశానికి చెందిన వాడిని. నా కుటుంబంతో కలిసి బంగ్లాదేశ్‌లో ఉంటున్నా. అక్కడే ఉద్యోగం చేస్తున్నాను. బంగ్లాదేశ్ ప్రభుత్వం ‘పఠాన్’ సినిమాను కొన్నికారణలతో విడుదల చేయకూడదని ఆదేశించింది. షారుఖ్ ఖాన్ మీద ఉన్న అభిమానంతో సమీప భారత్ లో ఉన్న ఓ నగరానికి వెళ్లి సినిమా చూడాలని అనుకున్నాం. షారుఖ్ తర్వాత సినిమా ‘జవాన్’ను కూడా భారత్ లోనే చూడాలని ప్లాన్ చేస్తున్నాం” అని వెల్లడించారు.
బంగ్లాదేశ్ లో విడుదల కాని ‘పఠాన్’
ప్రపంచ వ్యాప్తంగా ‘పఠాన్’ సినిమా విడుదలైనా, కొన్ని చట్టపరమైన కారణాలతో ఈ సినిమా బంగ్లాదేశ్ లో విడుదల కాలేదు. “చట్టాల సంక్లిష్టత కారణంగా, సినిమా ఇప్పట్లో విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు” అని బంగ్లాదేశ్ దర్శకుడు అనోన్నో మమున్ వెల్లడించారు.
బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు జోరు
అటు షారుఖ్ బ్లాక్ బస్టర్ స్పై థ్రిల్లర్ ‘పఠాన్’ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. రెండో వారంలోకి అడుగు పెట్టిన ఈ సినిమా ఇప్పటికీ వసూళ్ల సునామీ సృష్టస్తోంది. విడుదలైన తొలి వారంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 600 కోట్లకు పైగా వసూళు చేసింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తొలి రోజునే భారత్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులోకి ఎక్కింది. ఈ మూవీలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించగా, జాన్ అబ్రహాం నెగెటివ్ రోల్ పోషించారు.
Read Also: ‘పఠాన్’ మూవీ గురించి మీకు తెలియని 8 ఇంట్రెస్టింగ్ విషయాలు