Kotamreddy Vs Corporator : నెల్లూరు రూరల్ లో ఆధిపత్య పోరు మొదలైంది. ఈ గట్టునుండేది ఎవరు, ఆ గట్టునుండేది ఎవరంటూ లెక్కలు మొదలయ్యాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంటే అందరు కార్పొరేటర్లు ఉంటారనుకుంటే సడన్ గా ఆ లెక్కలు మారాయి. జై జగన్, జై ఆదాల అంటూ కొందరు తిరుగుబాటు స్వరం వినిపించారు. దీంతో కోటంరెడ్డి నేరుగా రంగంలోకి దిగారు. తన మాట విననంటున్న కార్పొరేటర్ల ఇంటికెళ్లి రాయబారం నడిపించాలనుకున్నారు. కానీ వాళ్లు తిరగబడ్డారు. తమని బెదిరిస్తున్నారంటూ ఏకంగా ఓ కార్పొరేటర్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. శుక్రవారం ఉదయం తన కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫ్లెక్సీలు చించేశారు 22వ డివిజన్ కార్పొరేటర్ విజయభాస్కర్ రెడ్డి. తాను జగన్ వెంట నడుస్తానని ఎంపీ ఆదాలకు మద్దతు పలికారు. దీంతో కోటంరెడ్డి మధ్యాహ్నం తన ఇంటికొచ్చారని, తనపై సీరియస్ అయ్యారని చెబుతున్నారు. తనకు కార్పొరేటర్ టికెట్ ఇప్పించింది కోటంరెడ్డే అయినా, తాను జగన్ పార్టీలో గెలిచానని, ఆయనతోనే ఉంటానన్నారు. ఈ వ్యవహారం పరిశీలించి లీగల్ ఒపీనియన్ తీసుకుని ముందుకెళ్తామన్నారు డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి. 


ఫోన్ ట్యాపింగ్ కాదు మ్యాన్ ట్యాపింగ్ 


నిన్ను అరెస్ట్ చేయం, నిన్ను ఎన్ కౌంటర్ చేయం, అసలా అవసరం ఎవరికీ లేదని ఎమ్మెల్యే కోటంరెడ్డికి బదులిచ్చారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. కోటంరెడ్డిని చంద్రబాబు పావులా వాడుకుంటున్నారని, ఆయన భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారని, ఆయన ఉచ్చులో కోటంరెడ్డి పడ్డారని చెప్పారు. అది ఫోన్ ట్యాపింగ్ కాదని, మ్యాన్ ట్యాపింగ్ అని, చంద్రబాబు చేసిన ఆ ట్యాపింగ్ ఉచ్చులో కోటంరెడ్డి పడ్డారని అన్నారు. టీడీపీలోకి వెళ్లాలనుకుంటే ఒక్క కారణం సరిపోతుందని, కానీ వైసీపీలో ఉండాలంటే కోటంరెడ్డి వంద కారణాలు ఆలోచించాలన్నారు. జగన్, కోటంరెడ్డిని చాలా నమ్మారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేశారన్నారు. ఒకవేళ నిజంగానే కోటంరెడ్డికి వైసీపీలో అవమానం జరిగితే, ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లి రాజకీయాల నుంచి విరమించుకోవాలన్నారు. అంతే కానీ, టీడీపీలోకి వెళ్తూ వైసీపీపై బురదజల్లడం సరికాదన్నారు. ట్యాపింగ్ అంటూ ఆయన చేసిన ఆరోపణలను ఆయనే రుజువు చేయాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ కాదని అధికారులు వివరణ ఇచ్చారని, ఆయనే కేంద్రం దృష్టికి ఈ విషయం తీసుకెళ్తానన్నారు కదా, అదే చేయనీయండి అంటూ ప్రెస్ మీట్ లో చెప్పారు కాకాణి. 


కోర్టుకు వెళ్తే తేలిపోతుంది


ఫోన్ ట్యాపింగ్ జరగలేదని ప్రభుత్వం చెబుతోందని, జరగని దాన్ని జరిగినట్టు చెపుతుంటే, దానిపై విచారణ ఏముంటుందని మంత్రి కాకాణి అన్నారు. ఆధారాలుంటే మీరే వాటిని కేంద్రానికి పంపించండి, అమిత్ షాకి పంపించండి అని కోరారు. కోర్టకైనా వెళ్లొచ్చని సూచించారు. కోర్టుకి వెళ్తే అది ట్యాపింగా, రికార్డింగా అనేది తేలిపోతుందన్నారు. చంద్రబాబు చెప్పినట్టే కోటంరెడ్డి మాట్లాడారని, ఆయన ట్రాప్ లో పడిపోయారన్నారు. చంద్రబాబు క్రిమినల్ మెంటాలిటీ కోటంరెడ్డికి కనెక్ట్ చేశారని అందుకే ఆయన అలా మాట్లాడుతున్నారని చెప్పారు. వైసీపీని వదిలి ఎవరూ కోటంరెడ్డి వెంట నడవబోరని చెప్పారు కాకాణి. కోటంరెడ్డి వెంట వెళ్లకుండా పార్టీకి కట్టుబడి ఉండేవారికి పార్టీ సముచిత స్థానం కల్పిస్తామన్నారు. కష్టకాలంలో పార్టీ వెంట నడిస్తే వారిని గుర్తు పెట్టుకుంటామన్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ రూరల్ లో మరింత బలపడుతుందన్నారు కాకాణి.