షాహిద్, సిటీలైట్స్, అలీగఢ్, సిమ్రన్, ఒమెర్టా లాంటి సినిమాలతో పాటు ‘స్కామ్ 1992’ లాంటి అదిరిపోయే వెబ్ సిరీస్‌లు అందించిన డైరెక్టర్ హన్సల్ మెహతా తెరకెక్కిస్తున్న సినిమా ‘ఫరాజ్’. ఢాకాలోని హోలీ ఆర్టిసాన్ కేఫ్ పై జులై 1, 2016న జరిగిన దాడి ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ కేఫ్ లో సాయంత్రాన్ని హాయిగా ఎంజాయ్ చేస్తున్న సాధారణ పౌరులపై ఉన్నట్లుండి బుల్లెట్ల వర్షం కురుస్తుంది. అక్కడ కొందరు ఉగ్రవాదులు తుపాకులు పట్టుకొని విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతారు. దీంతో ఫరాజ్ అనే 20 ఏళ్ల యువకుడు మరణిస్తాడు. ఇలా అసువులు బాసిన ఫరాజ్ హుస్సేన్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. అయితే, ఈ మూవీ రిలీజ్‌కు ముందే వివాదంలో చిక్కుకుంది. ఆ దాడిలో మరణించిన బాధితుల కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించడమే ఇందుకు కారణం.
సినిమా కథేంటి?
ఈ దాడిలో అసువులు బాసిన ఫరాజ్ హుస్సేన్ అనే 20 ఏళ్ల యువకుడి నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కించారు. బంగ్లాదేశ్ మీడియా మొఘల్ గా పేరుగాంచిన లతీఫుర్ రెహమాన్ మనువడే ఈ ఫరాజ్. ‘ఫరాజ్’ సినిమాలో ఆ క్యారెక్టర్ ను శశి కపూర్ మనవడు, కునాల్ కపూర్ కుమారుడు జహాన్ కపూర్ పోషించాడు. ఇక ఉగ్రవాదుల్లో ఒకడిగా పరేష్ రావల్ తనయుడు ఆదిత్య రావల్ నటించడం విశేషం. ఆ ఉగ్రదాడిలో కేఫేలోని పిల్లలను రక్షించడానికి ఫరాజ్ ప్రయత్నిస్తుంటాడు.
వివాదం ఏమిటీ?
ఆ దాడిలో చనిపోయిన తమ కుమారుల వివరాలు గోప్యంగా ఉంచాలని సినిమా విడుదలను సవాలు చేస్తూ.. ఇద్దరు బాధితుల కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. ఈ అప్పీల్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు సినిమా విడుదలపై స్టే విధించేందుకు నిరాకరించారు. ఈ కేసు ప్రాథమిక పిటిషన్ ను అక్టోబర్‌లోనే కోర్టు తిరస్కరించింది. నిర్మాతలతో కూర్చొని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని తెలిపింది. ఈ సినిమా గనుక అహ్మద్ ఫరాజ్ ను ఉద్దేశించి ఉంటే ముందే అతని గురించి తెలుసుకోవాలని కోర్టు నిర్మాతలకు సూచించింది.
సిద్ధార్థ్ మృదుల్, తల్వంత్ సింగ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ సినిమా విడుదలపై స్టే నిరాకరించినా.. ఈ సినిమాలో సమర్పించిన డిస్‌క్లెయిమర్‌కు ‘కచ్చితంగా కట్టుబడి’ ఉండాలని నిర్మాతలను ఆదేశించింది. అయితే ఈ సినిమా కథ నిజజీవితం ఆధారంగా తెరకెక్కిన కల్పిత కథ అని సమాచారం. ఈ చిత్రంపై జనవరి 24న నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. ఈ పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని గతంలోనే చిత్ర దర్శక, నిర్మాతలను ఆదేశించింది. అప్పటి నుంచి ఈ కేసు కోర్టులో పెడింగులో ఉంది. ఎట్టకేలకు మూవీ విడుదలకు ముందు స్పష్టత రావడంతో నిర్మాతలు మూవీని విడుదల చేశారు.
ఈ సినిమా విడుదల అవడంతో ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండు గంటలలోపే, మొత్తం కథను క్లారిటీగా చూపించారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా ఫరాజ్ కు మంచి టాక్ ను తెచ్చిపెడుతుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఈ కథలో ఫరాజ్ కంటే ఎక్కువగా ఆదిత్య రావల్ ఫోకస్ అవడంతో..సినిమా టైటిల్ కి కథ కాస్త భిన్నంగా ఉందనే టాక్ వినిపిస్తోంది.
Read Also: భక్తిలో అయినా ప్రేమలో అయినా తన్మయత్వం ఒకటే -విశ్వనాథ్ సినిమాలో ఈ ఒక్క పాట చాలు