KCR Rocks BJP Shock :   తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అసెంబ్లీ ప్రసంగం భారత రాష్ట్ర సమితి నేతల్ని ఉత్కంఠకు గురి చేసింది. కొన్నాళ్లుగా ఆమె ప్రభుత్వ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. ఓ సారి రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రభుత్వం ఆమోదించిన ప్రసంగం కాకుండా కేంద్రాన్ని కూడా పొగుడుతూ ప్రసంగించారు. అద సమయంలో ఇటీవల తమిళనాడు గవర్నర్ సీటీ రవి .. అక్కడి ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్ని కొన్ని పేరాలు వదిలేశారు. ఈ వివాదాల నడుమ తెలంగాణ సర్కార్ అసలు గవర్నర్ ప్రసంగమే వద్దనుకుంది. కానీ కోర్టుకు మాత్రం గవర్నర్ ప్రసంగం పెడతామని చెప్పి ఆ మేరకు పెట్టింది. గవర్నర్‌కు ప్రసంగం ఇచ్చి.. రెండు, మూడు సార్లు ్భిప్రాయాలు తెలుసుకుని మరీ కేబినెట్‌లో ఆమోదించారు. అయినా చివరి వరకూ బీఆర్ఎస్ నేతలకు టెన్షనే. 


ఎక్కడా తగ్గకుండా ప్రోటోకాల్ ఇచ్చిన ప్రభుత్వం !
  
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఎలాంటి వివాదాలు లేకుండా సాగిపోయింది. చాలా కాలంగా ప్రభుత్వం గవర్నర్ కు ప్రోటోకాల్ ఇవ్వడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ సారి అలాంటి పరిస్థితి రానివ్వలేదు.  బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి వచ్చిన గవర్నర్ తమిళిసైకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్వాగతం పలికారు. శాసనసభ, మండలి సభ్యులకు చిరునవ్వుతో అభివాదం చేస్తూ గవర్నర్ ముందుకు కదిలారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెను అనుసరించారు. ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా తమకు కేటాయించిన సీట్లలో నుంచి లేచి గవర్నర్ కు, ముఖ్యమంత్రికి అభివాదం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం.. గవర్నర్ ను పోడియం వద్దకు తీసుకెళ్లారు. అందరూ జాతీయగీతం పాడారు. ఆ తర్వాత గవర్నర్ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘జై తెలంగాణ’ నినాదంతో గవర్నర్ స్పీచ్ ముగించారు. ప్రసంగం పూర్తైన తర్వాత సభ నుంచి వెళ్తున్న సమయంలో మండలి చైర్మన్, స్పీకర్, సీఎం కేసీఆర్, మంత్రి వేముల తమిళిసై వెంట నడిచారు. 


ప్రసంగంలో వివాదం లేకుండా చూసుకున్న గవర్నర్ 


గవర్నర్ తమిళిసై కూడా ప్రభుత్వం తనతో చర్చించి ఆమోదించిన ప్రసంగ పాఠాన్ని యుధావిధిగా చదివారు. ప్రసంగంలోపూర్తిగా తెలంగాణ ప్రభుత్వ ఘనతలు ఉన్నాయి. ఏ ప్రభుత్వం ఉన్న తమ ఘనతల్ని.. పాలనా విజయాల్ని గొప్పగా చెప్పుకుంటూ ప్రసంగం రూపొందిస్తుంది. గవర్నర్ యధావిధిగా చదువుతారు. చదవకపోతే వివాదం అవుతుంది. అయితే గతంలో ఇలాంటి సందర్భాల్లో కేంద్ర ప్రస్తావన కూడా తమిళిసై ప్రసంగాల్లో తీసుకు వచ్చేవారు.కానీ ఈ సారి మాత్రం కేంద్ర ప్రస్తావన ఎక్కడా తీసుకు రాలేదు. దాంతో బీఆర్ఎస్ నేతలు కూడా ఊపిరి పీల్చుకున్నారు.  


ప్రభుత్వం, గవర్నర్ మధ్య ఇక వివాదం సద్దుమణిగినట్లేనా ?


గవర్నర్, ప్రభుత్వం మధ్య ఓ రకమైన వార్ చాలా కాలంగా జరుగుతోంది. ఓ వైపు ప్రభుత్వం ప్రోటోకాల్‌ కూడా కల్పించకపోవడం..  మరో వైపు తెలంగాణ గవర్నర్ బిల్లులన్నీ పెండింగ్‌లో పెట్టడం వంటివి చోటు చేసుకుంటూ వస్తున్నాయి. చివరికి రిపబ్లిక్ డేను కూడా కేసీఆర్ ప్రభుత్వం  నిర్వహించలేదు. అయితే ఇప్పుడు గవర్నర్ ప్రసంగంలో మొత్తం సెట్ అయినట్లే భావిస్తున్నారు. ముందు ముందు అటు గవర్నర్.. ఇటు ప్రభుత్వం ఇతర విషయాల్లో ఎలా స్పందిస్తారన్నదాన్ని బట్టి.. తదుపరి రాజకీయాలు ఉండే అవకాశం ఉంది.