Kadapa Crime : ఆధార్ ఫింగర్ ప్రింట్స్ తో కోట్ల రూపాయలను కాజేస్తూ ప్రజలను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర సైబర్ కేటుగాడ్ని అరెస్టు చేసినట్లు వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. కడప నగరంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ సైబర్ నేరస్థుడి అరెస్టు వివరాలను వెల్లడించారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం గోరక్ పూర్ కు చెందిన శేషనాథ్ శర్మ ఆధార్ కార్డుకు అనుసంధానంగా ఉన్న వేలి ముద్రలను డూప్లికేట్ చేసి ప్రజల బ్యాంక్ అకౌంట్ల నుంచి వారికి తెలియకుండా నగదు కాజేస్తున్నాడు. ఈ నేరంతో సంబంధం ఉన్న మరో ఇద్దరు ముఠా సభ్యుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామన్నారు. దేశంలోని పలు రాష్ట్రాలలో సుమారు 440 యాప్స్ ద్వారా నేరాలు చేసినట్లు తేలిందన్నారు. అరెస్టు అయిన శేషనాథ్ శర్మపై దేశవ్యాప్తంగా 128 కేసులు నమోదు కాగా తెలంగాణలో 107 కేసులు నమోదైనట్లు తెలిపారు.
కోటికి పైగా మోసం
నిందితుడి నుంచి ఆధార్ నెంబర్లు, ఫింగర్ ప్రింట్లు ఉన్న హార్డ్ డిస్క్ తో పాటు స్కానర్ రెండు మొబైల్స్ ఫింగర్ ప్రింట్ డివైస్, ఒక మోనిటర్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఇలాంటి నేరాలకు పాల్పడడం ద్వారా నిందితుడు సుమారు కోటి రూపాయలు పైగా మోసం చేసినట్లు తెలిపారు. వైఎస్ఆర్ జిల్లాలో ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ప్రజలందరూ తమ ఆధార్ కార్డుల బయోమెట్రిక్ లాక్ లేదా తగు భద్రత చర్యలు తీసుకోవాలని ఎస్పీ వివరించారు. ఈ సమావేశంలో ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీ చెంచుబాబు ,సైబర్ క్రైమ్ సీఐ శ్రీధర్ నాయుడు, చిన్న చౌక్ సీఐ శ్రీరామ్ శ్రీనివాస్, ఎస్సైలు శ్రీనివాస్, రవి కుమార్, మధు మల్లేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ లో రెచ్చిపోయిన దొంగలు
హైదరాబాద్ (Hyderabad) నగరంలో రెచ్చిపోయిన దొంగలను పోలీసులు తేలిగ్గా పట్టుకున్నారు. వారు ఇద్దరూ ఒకేరోజులో ఏకంగా 20 ఇళ్లల్లో దొంగతనాలు (Hyderabad Theft Cases) చేయడం విస్మయం కలిగిస్తోంది. కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్ పరిధిలో కొద్ది రోజుల క్రితం ఒక్కరోజు వ్యవధిలో 20 ఇళ్లలో వరుస చోరీలకు వీరు పాల్పడ్డారని హైదరాబాద్ సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు (Hyderabad Police) తెలిపారు. వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. బషీర్‌బాగ్ లోని సీసీఎస్ కార్యాలయంలో హైదరాబాద్ క్రైమ్స్ అండ్ సిట్ అడిషనల్ సీపీ ఏఆర్ శ్రీనివాస్, టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ వివరాలు వెల్లడించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కర్ణాటక హుబ్లీకి చెందిన దార్ల నెహమయ్య అలియాస్ మెహమయ్య అలియాస్ బ్రూస్‌లీ, అదే రాష్ట్రం సేడం అనే ప్రాంతానికి చెందిన మందుల శంకర్ ఇద్దరూ స్నేహితులు. కూలీ పనులు చేసుకొని బతికేవారు గంజాయి, మద్యానికి బానిసలు అయ్యారు. వీరు పనుల కోసం వివిధ నగరాలు తిరుగుతూ ఉంటారు. మొదట మురికి వాడలు ఉన్న ప్రాంతాల ఆచూకీ తెలుసుకుని, అక్కడ ఒక గదిని అద్దెకు తీసుకుంటారు. నెల రోజుల పాటు వేర్వేరు ప్రాంతాల్లో రెక్కీ చేసి, తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తిస్తారు. మద్యం తాగి లేదా గంజాయి పీల్చి ఇక తాము ఎంచుకున్న ప్రదేశాలకు దొంగతనాలకు బయలుదేరతారు. స్ర్కూ డైవర్, కటింగ్ ప్లేయర్‌లు వీరి ఆయుధాలు. తాళాలు తెరిచి ఇళ్లలోకి చొరబడి బంగారం, వెండి లాంటి ఖరీదైన వస్తువులు తీసుకొని ఉడాయిస్తారు.