సినిమా రివ్యూ: 'భీమ్లా నాయక్'
రేటింగ్: 3.5/5
నటీనటులు: పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యా మీనన్, సంయుక్తా మీనన్, మురళీ శర్మ, సముద్రఖని, రావు రమేష్, అజయ్, శత్రు తదితరులు
సినిమాటోగ్రఫీ: రవి కె. చంద్రన్
సంగీతం: తమన్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ 
స్క్రీన్ ప్లే, మాటలు: త్రివిక్రమ్ 
దర్శకత్వం: సాగర్ కె. చంద్ర
విడుదల తేదీ: ఫిబ్రవరి 24, 2022


Bheemla Nayak Movie Review: రీమేక్ సినిమాలందు పవన్ కల్యాణ్ చేసే రీమేక్స్ వేరు. 'దబాంగ్'ను 'గబ్బర్ సింగ్'గా రీమేక్ చేసినా... 'పింక్'ను 'వకీల్ సాబ్'గా రీమేక్ చేసినా... ఒరిజినల్ సినిమాలతో పవన్ కల్యాణ్ సినిమాలను కంపేర్ చేస్తే, కాస్త భిన్నంగా ఉంటాయి. కథ, కథనం, కథానాయకుడి పాత్ర చిత్రణ విషయంలో మార్పులు గమనించవచ్చు. తాజాగా పవన్ కల్యాణ్ నటించిన సినిమా 'భీమ్లా నాయక్'. మలయాళ హిట్ 'అయ్యప్పనుమ్ కోశియుమ్'కు రీమేక్ ఇది. ఇందులో రానా దగ్గుబాటి మరో హీరో. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, సంభాషణలు సమకూర్చడంతో పాటు ఓ పాట కూడా రాశారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. ఈ రోజు 'భీమ్లా నాయక్' విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది?


కథ: 'భీమ్లా నాయక్' (Bheemla Nayak) సబ్ ఇన్‌స్పెక్ట‌ర్‌. ఓ రాత్రి చెక్ పోస్ట్ దగ్గర డ్యూటీ చేస్తుండగా... గతంలో ఆర్మీలో పని చేసిన డానీ - డానియల్ శేఖర్ (రానా దగ్గుబాటి) గొడవ చేయడంతో అతడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకు వెళతారు. పోలీస్ స్టేష‌న్‌లో కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల సీజ్ చేసిన లిక్కర్ బాటిల్ ఓపెన్ చేసి... డానీకి భీమ్లా నాయక్ మందు పోస్తాడు. భీమ్లా నాయక్ మందు పోస్తుండగా డానీ ఫోనులో షూట్ చేసి మీడియాకు విడుదల చేస్తాడు. ఓ సబ్ ఇన్‌స్పెక్ట‌ర్‌ అలా చేయడం చట్ట వ్యతిరేకం కనుక... రాష్ట్రపతి పురస్కారానికి ఎంపికైన భీమ్లా నాయక్ సస్పెండ్ అవుతాడు. అసలు, భీమ్లా నాయక్ - డానీ మధ్య గొడవ ఎలా మొదలైంది? ఎలా ముగిసింది? భీమ్లా భార్య సుగుణ (నిత్యా మీనన్), డానీ భార్య (సంయుక్తా మీనన్) పాత్రలు ఏమిటి? వాళ్ళిద్దరూ భర్తల జీవితాల్లో ఎటువంటి మార్పులకు కారణం అయ్యారు? అనేది మిగతా సినిమా.


విశ్లేషణ: 'హిస్టరీ ఎప్పుడూ గెలిచినోడు రాస్తాడు. మనం గెలిచిన తర్వాత మన తప్పుల్ని తుడిపేసుకోవచ్చు' - 'భీమ్లా నాయక్'లో ఓ సన్నివేశంలో సముద్రఖని చెబుతారు. సినిమా జయాపజయాలకు ఈ సంభాషణను అన్వయిస్తే... సినిమా విజయం సాధిస్తే అందులో తప్పుల్ని సులభం చెరుగుతాయి. మరి, 'భీమ్లా నాయక్'(Bheemla Nayak)లో తప్పులు ఉన్నాయా? ఒప్పులు ఉన్నాయా? 'అయ్యప్పనుమ్ కోశియుమ్'లో ఉన్నది ఉన్నట్టు తీశారా? లేదంటే తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టు మార్పులు చేశారా? ఒకవేళ మార్పులు చేస్తే, అవి ఎలా ఉన్నాయి? బావున్నాయా? లేదా? అనేది చెప్పాలంటే... సినిమా ఎలా ఉందనే విషయంలోకి వెళ్ళాలి.


'అహంకారానికి - ఆత్మగౌరవానికి మధ్య మడమ తిప్పని యుద్ధం' అని 'భీమ్లా నాయక్' ట్రైల‌ర్‌లో చెప్పారు. ఒక్క ముక్కలో సినిమా కథాంశం చెప్పాలంటే... అంతే! ఆత్మగౌరవంతో కూడిన పోలీస్ అధికారిగా పవన్ కల్యాణ్, అహంకారంతో రగిలిపోయే రానా కనిపించారు. ఇద్దరూ అద్భుతంగా నటించారు. అటు పవన్... ఇటు రానా... ఇద్దరి బదులు మరొకర్ని ఆయా పాత్రల్లో ఊహించడం కష్టమే.


పవన్ కల్యాణ్(Pawan Kalyan) హుషారుగా కనిపించారు. హ్యాండ్స‌మ్‌గా ఉన్నారు. ఇష్టమైన పోలీస్ పాత్ర వల్ల కావచ్చు... కథలో క్యారెక్టర్ వల్ల కావచ్చు... నటనలో ఎనర్జీ కనిపించింది. డానీగా రానా కొత్తగా కనిపించారు. పంచెకట్టులో బావున్నారు. నటుడిగానూ తన మార్క్ చూపించారు. పవన్ జోడీగా నిత్యా మీనన్ చక్కటి పాత్రలో కనిపించారు. పవన్ - నిత్య మధ్య సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. సంయుక్తా మీనన్ ఎమోషనల్ పాత్రలో కనిపించారు. పతాక సన్నివేశాల్లో ఆమె పాత్రకు ప్రాముఖ్యం ఉంది. రావు రమేష్, మురళీ శర్మ, సముద్రఖని, తనికెళ్ళ భరణి, సంజయ్ స్వరూప్, మోనికా తదితరులు తమకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. పతాక సన్నివేశాల్లో బ్రహ్మానందం తళుక్కున మెరిశారు.


సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకూ... సాంకేతిక పరంగా ఉన్నత స్థాయిలో ఉంది.  దర్శకుడు సాగర్ కె. చంద్ర అందరి నుంచి మంచి అవుట్‌పుట్‌ తీసుకున్నారు. ఆయన టేకింగ్ బావుంది. సంగీతం, సినిమాటోగ్రఫీ, సంభాషణలు, నిర్మాణ విలువలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. తమన్ పాటలు ఆల్రెడీ హిట్టయ్యాయి. కథతో పాటు పాటలు రావడంతో తెరపై మరింత ప్రభావం చూపించాయి. 'లా లా భీమ్లా' సాంగ్ వచ్చిన సందర్భం, ఆ పాటను తీసిన విధానం బావుంది. తమన్ నేపథ్య సంగీతం కూడా బావుంది. సన్నివేశానికి అవసరమైన మాస్ ఫీల్‌ను తీసుకు రావడంతో పాటు క్లాసీ సినిమాటోగ్రఫీతో రవి కె. చంద్రన్ 'భీమ్లా నాయక్'ను అందంగా చూపించారు. డ్రోన్  షాట్స్ బావున్నాయి. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, సంభాషణలు సినిమాకు బలంగా నిలిచాయి. అయితే... 'భీమ్లా నాయక్' ఫస్టాఫ్ నిదానంగా సాగినట్టు, కథ ముందుకు కదలనట్టు అనిపిస్తుంది. కొంత మంది ప్రేక్షకులకు మాస్ డోస్ ఎక్కువైనట్టు కూడా అనిపించవచ్చు.


Also Read: దీపికా పదుకోన్ 'గెహ‌రాయియా' రివ్యూ: ఆ ఒక్క రొమాంటిక్ మిస్టేక్ కంటే జీవితం పెద్దది!


'అయ్యప్పనుమ్ కోశియుమ్'తో కంపేర్ చేస్తే... 'భీమ్లా నాయక్' భిన్నంగా ఉంటుంది. పవన్ కల్యాణ్ ఇమేజ్‌కు తగినట్టు క్యారెక్ట‌రైజేష‌న్‌లో మార్పులు చేశారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ యాడ్ చేశారు. క్లైమాక్స్ చేంజ్ చేశారు. ఒరిజినల్ సినిమా చూసినవాళ్ళకు 'భీమ్లా నాయక్' లౌడ్‌గా, మాసీగా ఉన్న‌ట్టు అనిపించవచ్చు. అయినా సరే... 'భీమ్లా నాయక్' ఆకట్టుకుంటాడు. కానీ, కొంత మంది దాన్ని మైనస్ అనుకోవచ్చు. మాస్, లౌడ్ మేకింగ్ వల్ల ఎమోషన్ డైల్యూట్ అయినట్టు అనిపిస్తుంది. అయితే... పవన్ ఇమేజ్, త్రివిక్రమ్ సంభాషణలు సినిమాలో ఆ తప్పుల్ని చెరిపేస్తాయి. ఇక, మలయాళ సినిమా చూడనివాళ్ళకు చాలా బాగుంటాడు. మాంచి కమర్షియల్ సినిమా చూసిన ఫీలింగ్ కలిగిస్తాడు. అభిమానులకు అయితే 'భీమ్లా నాయక్'గా పవన్ విశ్వరూపం, తాండవం ఆనందం కలిగిస్తుంది. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్‌ పెడుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు బ‌స్‌లో రానాతో పవన్ చెప్పే డైలాగులు కథలో భాగంగా ఉన్నప్పటికీ... ఆయన రాజకీయ కెరీర్‌కు కనెక్ట్ అయ్యేవిధంగా ఉన్నాయి. పక్కా కమర్షియల్ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ఇది. డోంట్ మిస్!


Also Read: 'వలిమై' రివ్యూ: తమిళ్ హీరో అజిత్ తెలుగులో హిట్ అందుకున్నాడా? విలన్‌గా కార్తికేయ ఎలా చేశాడు?