సినిమా రివ్యూ : భాగ్ సాలే 
రేటింగ్ : 2.5/5
నటీనటులు : శ్రీ సింహ కోడూరి, నేహా సొలంకి, రాజీవ్ కనకాల, జాన్ విజయ్, వర్షిణి సౌందర్ రాజన్, నందిని రాయ్, వైవా హర్ష, సత్య, సుదర్శన్, పృథ్వీ రాజ్, ఆర్ జె హేమంత్, బిందు చంద్రమౌళి తదితరులు
ఛాయాగ్రహణం : రమేష్ కుషేందర్
సంగీతం : కాల భైరవ
నిర్మాతలు : అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల
కథ, కథనం, దర్శకత్వం : ప్రణీత్ బ్రహ్మాండపల్లి
విడుదల తేదీ : జూలై 7, 2023


'మత్తు వదలరా'తో ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి రెండో కుమారుడు శ్రీ సింహ కోడూరి కథానాయకుడిగా పరిచయమయ్యారు. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. అయితే, ఆ తర్వాత సినిమాలు ఆశించిన రీతిలో ఆడలేదు. 'భాగ్ సాలే' ప్రచార చిత్రాలు చూస్తే... శ్రీ సింహ (Sri Simha Koduri)కు మళ్ళీ విజయం అందించేలా కనిపించాయి. మరి, సినిమా ఎలా ఉంది? ప్రణీత్ బ్రహ్మాండపల్లి ఎలా తీశారు?       


కథ (Bhaag Saale Movie Story) : అర్జున్ (శ్రీ సింహ కోడూరి) షెఫ్. అయితే, తాను రిచ్ పర్సన్ అని అబద్ధం చెప్పి మాయ (నేహా సోలంకి)ని ప్రేమలో పడేస్తాడు. ఆ అమ్మాయి తండ్రిని శామ్యూల్ (జాన్ విజయ్) కిడ్నాప్ చేస్తాడు. ఓ డైమండ్ రింగ్ (షాలి సుకా గజా - ఆ ఉంగరం పేరు) ఎక్కడని అడుగుతాడు. ఆ రింగ్ తీసుకొచ్చి ప్రపోజ్ చేస్తే పెళ్ళికి ఓకే చెబుతానని నళిని (నందిని రాయ్) కండిషన్ పెడుతుంది. అసలు, పాతిక కోట్ల విలువ చేసే ఆ ఉంగరం కథ ఏమిటి? మాయ ప్రేమ కోసం అర్జున్ ఏం చేశాడు? అర్జున్ చెప్పిన అబద్ధాలు తెలిసిన తర్వాత మాయ ఏం చేసింది? మధ్యలో రమ్య (వర్షిణి సౌందర్ రాజన్), పోలీస్ ప్రామిస్ రెడ్డి (స్వామి రారా సత్య) దంపతుల కథ ఏమిటి? చివరకి, రింగ్ ఎవరి చేతికి చేరింది? అనేది మిగతా సినిమా. 


విశ్లేషణ (Bhaag Saale Movie Review) : ఒక్కోసారి క్రైమ్ కామెడీ చిత్రాలకు బలం, బలహీనత అందులోని క్రైమ్ అవుతుంది. క్రైమ్ లేకపోతే కథ ముందుకు కదలదు. ఆ క్రైమ్ బలమైనది అయితే ఆసక్తి ఉంటుంది. క్రైమ్ బలహీనత అయితే ఆసక్తి సన్నగిల్లుతుంది. 'భాగ్ సాలే' విషయంలో కూడా అదే జరిగింది.


'భాగ్ సాలే'లో క్రైమ్ కంటే మధ్యలో వచ్చే కామెడీ సన్నివేశాలు బావున్నాయి. ఆ సీన్లను దర్శకుడు ప్రణీత్ డీల్ చేసిన విధానం కూడా బావుంది. కామెడీ చూపిన గ్రిప్ అతడు థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే మీద చూపించడంలో ఫెయిల్ అయ్యాడు. 'భాగ్ సాలే' స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రోలర్ కోస్టర్ రైడ్‌గా అనిపిస్తుంది. కథలో ఎక్కువ ట్రాక్స్ ఉండటంతో చివరకు వచ్చేసరికి కాస్త కంగాళీ అయ్యింది. వర్షిణి, సత్య సన్నివేశాలు నిడివి పెంచడానికి తప్ప కథకు అవసరం లేదనిపిస్తుంది. అయితే... సత్య డైలాగులు నవ్విస్తాయి. 


'భాగ్ సాలే'లో మెయిన్ హైలెట్ అంటే కాల భైరవ సంగీతం! పాటలు బావున్నాయి. ట్రెండీగా, పెప్పీగా ఉండేలా చూసుకున్నారు. బ్రేకప్ తరహా సాంగ్ ఆకట్టుకుంది. కెమెరా వర్క్ బావుంది. ఎడిటింగ్ ఇంకా షార్ప్ & గ్రిప్పింగ్ గా ఉంటే బావుండేది. నిర్మాణ విలువలు బావున్నాయి. ఖర్చు విషయంలో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల రాజీ పడలేదు. సినిమాలో లొకేషన్స్ ఎక్కువ, ఆర్టిస్టులు ఎక్కువ మంది! కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా కోసం అంత మందిని సెటప్ చేయడం అంటే మామూలు విషయం లేదు. నిర్మాతలు కథను బలంగా నమ్మడంతో ఖర్చు చేసినట్టు అనిపిస్తుంది. 


నటీనటులు ఎలా చేశారు? : శ్రీ సింహ కోడూరి మరోసారి పక్కింటి అబ్బాయిగా సహజ నటన కనబరిచారు. ఎమోషన్స్ చక్కగా పలికించారు. ఇటువంటి క్యారెక్టర్లకు పర్ఫెక్ట్ యాప్ట్ అనిపించారు. రెగ్యులర్ హీరోయిన్ పాత్రలో నేహా సోలంకి రొటీన్ యాక్టింగ్ చేశారు.


తమిళ నటుడు జాన్ విజయ్, 'వైవా' హర్ష కాంబినేషన్... వాళ్ళిద్దరి డైలాగులు ఫన్ క్రియేట్ చేశాయి. శామ్యూల్ పాత్రలో జాన్ విజయ్ వేరియేషన్స్ చూపించారు. లుక్స్ & యాక్టింగ్ బావున్నాయి. సుదర్శన్ టైమింగ్ కూడా కొన్ని సీన్లలో నవ్విస్తుంది. ఈ సినిమాలో మరో ఇద్దరు అమ్మాయిలు వర్షిణి సౌందర్ రాజన్, నందిని రాయ్ పాత్రల నిడివి తక్కువ. ఉన్నంతలో ఓకే. చివర్లో కమెడియన్ సత్య రెండు మూడు సీన్లు నవ్వించారు. రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, ఆర్జే హేమంత్ తదితరులు ఓకే.  


Also Read : '7:11 పీఎం' సినిమా రివ్యూ : టైమ్ ట్రావెల్ చేసి మరీ ఓ ఊరిని హీరో కాపాడితే?


చివరగా చెప్పేది ఏంటంటే? : హీరోతో పాటు నటీనటులు అందరూ మంచి నటన కనబరిచారు. కామెడీ, పాటలు బావున్నాయి. అసలు ఎటువంటి అంచనాలు లేకుండా లేకుండా వెళితే నవ్వుకోవచ్చు. కామెడీ కోసం అయితే 'భాగ్ సాలే' ఓకే.


Also Read నాగశౌర్య 'రంగబలి' రివ్యూ : ఫస్టాఫ్‌లో సత్య కామెడీ హిట్, మరి సెకండాఫ్?