సినిమా రివ్యూ : 7:11 పీఎం 
రేటింగ్ : 1/5
నటీనటులు : సాహస్ పగడాల, దీపికా రెడ్డి, డాక్టర్ భరత్ రెడ్డి, టెస్ వాల్ష్, రఘు కారుమంచి, చరణ్ కురుగొండ, 'రైజింగ్' రాజు తదితరులు
కథ : చైతూ మాదాల, హేమంత్ కె భట్నాగర్!
ఛాయాగ్రహణం : శివ శంకర్, ఫాబియో కాపోడివెంటో
సంగీతం : గ్యాని  
నిర్మాతలు : నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి
కథనం, మాటలు, దర్శకత్వం : చైతూ మాదాల 
విడుదల తేదీ: జూలై 7, 2023


తెలుగులో సైన్స్ ఫిక్షన్ జానర్ సినిమాలు (Sci Fi Movies In Telugu) చాలా తక్కువ. అందులోనూ టైమ్ ట్రావెల్ ఫిల్మ్స్ మరీ అరుదు. బాలకృష్ణ 'ఆదిత్య 369', సూర్య '24', శర్వానంద్ 'ఒకే ఒక జీవితం', కళ్యాణ్ రామ్ 'బింబిసార' వంటివి విజయాలు సాధించాయి. అందుకని, కొత్త కంటెంట్ కోసం ఎదురు చూసే ప్రేక్షకులకు '7:11 PM' ప్రచార చిత్రాలు కొంచెం ఆశలు కల్పించాయి. దానికి తోడు మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ కావడంతో ప్రేక్షకుల చూపు పడింది. మరి, సినిమా ఎలా ఉంది?


కథ (7:11 PM movie Story) : రవిప్రసాద్ (సాహస్ పగడాల)ది హంసలదీవి. ఊహ తెలియని వయసులో తల్లిదండ్రులను కోల్పోయిన తనను పెంచి పెద్ద చేసిన ఆ ఊరు అంటే రవికి ఎంతో ప్రేమ! అపరిమితం చిట్ ఫండ్ కంపెనీ ప్రారంభించిన రాజేష్, ఎక్కువ వడ్డీ ఆశ చూపించడంతో... ఊరి ప్రజలు అందరూ తమ డబ్బును అందులో డిపాజిట్ చేస్తారు. మినిస్టర్ అండతో రాజేష్ ఏదో మోసం చేస్తున్నాడని, ఊరిలో ప్రజలందర్నీ ఖాళీ చేయించడానికి మినిస్టర్ డ్యామ్ ప్రపోజల్ తెరపైకి తెస్తున్నాడని రవితో పాటు అతడిని పెంచిన బాబాయ్ అనుమానం. 


ఊరిలో జరుగుతున్న మిస్టరీ చేధించే పనిలో ఉన్న రవి... ఓ రోజు అనుకుండా ఊరిలో బస్ ఎక్కుతాడు. అతడు 1999లో బస్ ఎక్కితే... తెల్లారి సరికి  2024లో, ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ సముద్ర తీరంలో ఉంటాడు. ఒక్క రాత్రిలో 25 ఏళ్ళు ముందుకు ఎలా వెళ్ళాడు? 25 ఏళ్ళల్లో హంసలదీవికి ఏర్పడిన ప్రమాదం ఏమిటి? టైమ్ ట్రావెల్ చేసి వెనక్కి వెళ్లిన రవి, ఊరిని ఎలా కాపాడాడు? రవికి ప్రాక్సిమా గ్రహం నుంచి మనుషులకు సంబంధం ఏమిటి? భూమి మీదకు ప్రాక్సిమా గ్రహం స్పేస్ మిషన్ ఎందుకు పంపింది? హంసల దీవిలో డీఎన్ఏ లాక్ ఉన్న పుస్తకం కథ ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ (7:11 PM Movie Review) : '7:11 పీఎం' ప్రచార చిత్రాలు చూస్తే 'మంచి కంటెంట్ ఏదో చెప్పబోతున్నారు?' అని కాస్త నమ్మకం కలుగుతుంది. తక్కువ బడ్జెట్‌లో సినిమా ఎలా తీశారంటారు? అని ఆసక్తి మొదలవుతుంది. ఆ నమ్మకం, ఆసక్తి పోయేలా చేయడానికి దర్శక, రచయితలు ఎక్కువ సమయం తీసుకోలేదు. రెగ్యులర్ రొటీన్ కథకు టైమ్ ట్రావెల్ పూత పూసి ప్రేక్షకుల ముందుకు తెచ్చిన చిత్రమిది.


సినిమా ప్రారంభ సన్నివేశాలు బావున్నాయి. కానీ, తీసిన విధానం అసలు బాలేదు. ఆ టైమ్ ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ పక్కకి వెళ్లి... హంసల దీవిలోకి కథ ఎంటరయ్యాక మరీ రొటీన్ అయ్యింది. చిట్ ఫండ్ కంపెనీ గురించి చెప్పినప్పుడు బిచాణా ఎత్తేసే బాపతి అని అర్థం అవుతుంది. హీరోయిన్ అన్నయ్యకు ఇచ్చిన బిల్డప్ చూస్తే... అంతా చేసేది అతడేనని అనుమానం కలుగుతుంది. స్కూల్ పిల్లాడు కూడా ఊహించేలా దర్శక, రచయితలు క్లూస్ ఇస్తూ వెళ్ళారు. ఇంటర్వెల్ వచ్చే వరకు ఇదొక సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ బేస్డ్ సినిమా అనే సంగతి మర్చిపోతాం.


కొత్త పాయింట్ చెప్పాలని అనుకున్నప్పుడు... కథనం, సన్నివేశాలు సైతం అంతే కొత్తగా ఉండాలి. అసలు పాయింట్ గాలికి వదిలేసి కొసరు అంశాలపై ఎక్కువ దృష్టి పెడితే మొదటికి మోసం వస్తుంది. '7:11 పీఎం' సినిమాలో టైమ్ ట్రావెల్ ఒక్కటే కాదు... ఆస్తి కోసం సవతి సోదర సోదరీమణులు చంపిన అన్నయ్య, న్యూక్లియర్ డంప్, హ్యూమన్ బ్రెయిన్ ఫంక్షన్ వంటి అంశాలు ఎన్నో చెప్పారు. విచిత్రం ఏమిటంటే? ఒక్కటి కూడా బుర్రకు ఎక్కదు. క్లైమాక్స్ సీన్ చూసిన తర్వాత వేరే గ్రహం నుంచి వచ్చిన మనుషుల బుర్రకు జుట్టులో డీఎన్ఏ ఉంటుందనే విషయం తెలియదా? అని జాలి వేస్తుంది. స్టార్టింగులో 'ఊరంతా మనుషులను వెతకడం ఎందుకు? ఆ గదిలో జుట్టు ఉందో? లేదో? చూస్తే చాలు కదా!' అని స్క్రీన్ ముందున్న ప్రేక్షకుడికి అనిపిస్తుంది.  


కెమెరా వర్క్ బాలేదు. సోసోగా ఉంది. లో బడ్జెట్ సినిమా అనే సంగతి స్క్రీన్ మీద కనబడుతుంది. ప్రతి సన్నివేశంలోనూ నిర్మాణపరమైన పరిమితులు తెలుస్తూ ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైన్ ఎంత వీక్ అంటే... 1999లో గూగుల్ పే, పీటీఎం స్కానింగ్ కోడ్స్ కిరాణా షాప్స్ దగ్గర కనిపించాయి. ప్రేక్షకులకు గుర్తుండే పాటలు లేవు. నేపథ్య సంగీతం బాలేదు. ఈ తరహా నేపథ్యంలో ఇటువంటి కథను చెప్పాలని ట్రై చేసిన దర్శక, రచయితల ప్రయత్నాన్ని అభినందించాలి. 


నటీనటులు ఎలా చేశారు? : డాక్టర్ భరత్ రెడ్డి, రఘు కారుమంచి మినహా మిగతా నటీనటుల్లో కొత్త ముఖాలు ఎక్కువ. కృష్ణ పాత్రకు తగ్గట్లు భరత్ రెడ్డి నటించారు. ఆయన వరకు న్యాయం చేశారు. రఘు కారుమంచి రెండు మూడు సన్నివేశాల్లో కనిపించారు. 'రైజింగ్' రాజు కూడా! వాళ్ళిద్దరూ నవ్వించింది తక్కువ. పలు భావోద్వేగాలు పలికించే క్యారెక్టర్ హీరో సాహస్ పగడాలకు లభించింది. ఆ అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకోలేదు. నటనలో సాహస్ ఇంకా చాలా పరిణితి సాధించాలి. హీరోయిన్లు దీపికా రెడ్డి, టెస్ నటన సైతం సోసోగా ఉంది. మిగతా ఆర్టిస్టుల్లో గుర్తుంచుకోదగ్గ నటన ఎవరూ కనబరచలేదు. 


Also Read : నాగశౌర్య 'రంగబలి' రివ్యూ : ఫస్టాఫ్‌లో సత్య కామెడీ హిట్, మరి సెకండాఫ్?


చివరగా చెప్పేది ఏంటంటే? : థియేటర్లకు వెళ్లి మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఐడియాగా వింటే '7:11 పీఎం' కథ నచ్చుతుంది ఏమో!? సినిమాగా చూస్తే బాలేదు. ట్రైలర్ కట్ చేసిన వ్యక్తిని మెచ్చుకోవాలి. సినిమాలో ఉన్న మూడు నాలుగు సైన్స్ ఫిక్షన్ / టైమ్ ట్రావెల్ సన్నివేశాలు, యాక్షన్‌ షాట్స్‌తో ఆ మాత్రం ఎఫెక్ట్ తీసుకొచ్చారంటే మాటలు కాదు.   


Also Read 'లస్ట్ స్టోరీస్ 2' రివ్యూ : తమన్నా బోల్డ్‌గా చేశారు సరే సిరీస్‌ ఎలా ఉంది? శృంగారం గురించి కొత్తగా ఏం చెప్పారు?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial