సినిమా రివ్యూ: బంగార్రాజు
రేటింగ్: 3/5
నటీనటులు: నాగార్జున‌, నాగ‌చైత‌న్య‌, ర‌మ్య‌కృష్ణ‌, కృతీ శెట్టి, చ‌ల‌ప‌తిరావు, రావు ర‌మేష్‌, బ్ర‌హ్మాజీ, వెన్నెల కిషోర్‌ తదితరులు
ఆర్ట్ డైరెక్ట‌ర్‌: బ్ర‌హ్మ క‌డ‌లి
ఎడిట‌ర్‌: విజ‌య్ వ‌ర్ధ‌న్ కె
స్క్రీన్ ప్లే: స‌త్యానంద్
సినిమాటోగ్రఫీ: యువ‌రాజ్‌
సంగీతం: అనూప్ రూబెన్స్  
నిర్మాణ సంస్థ‌లు: జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్
నిర్మాత: అక్కినేని నాగార్జున‌
క‌థ‌, దర్శకత్వం: క‌ల్యాణ్ కృష్ణ
విడుదల తేదీ: 14-01-2022

నాగార్జున కెరీర్‌లో సోగ్గాడే చిన్ని నాయ‌నాది స్పెష‌ల్ ప్లేస్‌. బంగార్రాజుగా ఆడియ‌న్స్‌ను ఆక‌ట్టుకున్నారు. వాసివాడి త‌స్సాదియ్యా అంటూ ఆయ‌న చేసిన హంగామా అంద‌రికీ న‌చ్చింది. ఆ సినిమాకు సీక్వెల్ బంగార్రాజు. ఇందులో నాగార్జున‌తో పాటు ఆయ‌న త‌న‌యుడు నాగ‌చైత‌న్య కూడా న‌టించారు. 'మనం' తర్వాత తండ్రీ తనయులు నటించిన చిత్రమిదే. క‌ల్యాణ్‌ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ఎలా ఉంది? బంగార్రాజుగా నాగార్జున‌... లేదంటే బంగార్రాజు మ‌న‌వ‌డిగా జూనియ‌ర్ సోగ్గాడి పాత్ర‌లో నాగ‌చైత‌న్య‌... ఇద్ద‌రిలో ఎవ‌రు అద‌ర‌గొట్టారు? సినిమా ఎలా ఉంది?


కథ: 'సోగ్గాడే చిన్ని నాయనా' కథ గుర్తుందా? ఎక్కడ ముగిసిందో అక్కడ ఈ సినిమా మొదలు అవుతుంది. ఒకవేళ ఆ కథ గుర్తు లేకున్నా... భూలోకంలో సమస్య పరిష్కారం అయిన తర్వాత బంగార్రాజు (నాగార్జున)ను పైలోకానికి రమ్మని యమ ధర్మరాజు ఆదేశిస్తాడు. అయితే... పైకొచ్చిన తర్వాత నరకానికి కాకుండా స్వర్గానికి పంపిస్తాడు. రంభ, ఊర్వశి, మేనక (వేదిక, మీనాక్షి దీక్షిత్, దర్శనా బానిక్)తో బంగార్రాజు హ్యాపీగా ఉంటున్న సమయంలో అతడి సత్యభామ (రమ్యకృష్ణ) కూడా స్వర్గానికి వస్తుంది. అక్కడ బంగార్రాజు మనవడు చిన్న బంగార్రాజు (నాగచైతన్య) గురించి చెబుతుంది.


చిన్న బంగార్రాజుకు అన్నీ తాతయ్య పోలికలే. చిన్నప్పుడే అతడికి వరసకు మరదలు అయ్యే నాగలక్ష్మి (కృతి శెట్టి)తో పెళ్లి చేయాలని సత్యభామ అనుకుంటుంది. నాగలక్ష్మి తండ్రి రమేష్ (రావు రమేష్)తో కూడా మాట్లాడుతుంది. అతడూ సరే అంటాడు. అయితే... చిన్నప్పటి నుంచి చిన్న బంగార్రాజు, నాగలక్ష్మి ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారు. స్వర్గ లోకానికి వెళ్లిన సత్యభామ... 'ఎలాగైనా మనవడిని, నాగలక్ష్మిని ఒక్కటి చేయ్' అని భర్తను కోరుకుంటుంది. ఇంద్రుడు, యమ ధర్మరాజు దగ్గరకు వెళ్లి తన భర్తను భూలోకానికి పంపమని కోరుతుంది. వాళ్లిద్దరూ సరే అంటారు. సత్యభామ తలచింది ఒకటి... భూలోకం వచ్చిన తర్వాత జరిగింది మరొకటి...  చిన్న బంగార్రాజు, నాగలక్ష్మిని కలపడం కోసం పెద్ద బంగార్రాజు ఏం చేశాడు? భూలోకం వచ్చిన తర్వాత మనవడికి ఎదురైన ఆపదను ఎలా తప్పించాడు? అనేది మిగతా సినిమా.


విశ్లేషణ: 'సోగ్గాడే చిన్ని నాయనా'కు బంగార్రాజు క్యారెక్టరైజేషన్ ప్లస్ అయ్యింది.  పల్లెటూరి నేపథ్యం కూడా! సినిమాలో నాగార్జున నటన అందరికీ నచ్చింది. మంచి విజయం సాధించింది. ఇప్పుడీ సీక్వెల్‌కు వ‌స్తే... ఈ సినిమాకూ బంగార్రాజు క్యారెక్టరైజేషన్, ఆ పల్లెటూరి నేపథ్యం ప్లస్ పాయింట్స్. అలాగే... అక్కినేని తండ్రీ కొడుకులు నాగార్జున, నాగచైతన్య నటన.


బంగార్రాజుగా నాగార్జున ఎలా చేస్తారన్నది 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాలో ప్రేక్షకులు చూశారు. అందువల్ల, పెద్దగా స‌ర్‌ప్రైజ్‌ అయ్యేది ఉండదు. ఈజీగా చేశారని అనిపిస్తుంది. అయితే... బంగార్రాజుగా నాగచైతన్య నటన స‌ర్‌ప్రైజ్‌ చేస్తుంది. పక్కా పల్లెటూరి యువకుడిగా ఆయన మెప్పిస్తారు. మేన‌రిజ‌మ్స్‌ను బాగా ప‌ట్టుకున్నారు. దీనికి తోడు ఇద్దరు బంగార్రాజులను ఓకే ఫ్రేమ్‌లో చూడ‌టం అక్కినేని అభిమానులకు ఆనందాన్ని ఇస్తుంది. ప్రేక్షకులకు కూడా కనువిందుగా ఉంటుంది. నాగార్జున, నాగచైతన్య ఇద్దరూ కనిపించే సన్నివేశాలు సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఫైట్, క్లైమాక్స్ ఫైట్ చూసేటప్పుడు ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ. క్లైమాక్స్‌లో నాగార్జున డ్యూయ‌ల్ రోల్ ఓ కిక్ ఇస్తుంది. నాగ‌చైత‌న్య ఫ‌స్ట్ ఫైట్‌ను స్ట‌యిలిష్‌గా తీశారు. అలాగే... ఎమోషనల్ సీన్స్ కూడా బావున్నాయి. రమ్యకృష్ణ మరోసారి పాత్రలో ఒదిగిపోయారు. కృతి శెట్టి చక్కగా నటించింది. మిగతా నటీనటులు పాత్రల పరిధి మేరకు చేశారు. ఓ పాటలో దక్షా నగార్కర్, మరో పాటలో ఫరియా అబ్దుల్లా సందడి చేశారు. ఓ చిన్న పాత్రలో ఎంఎస్ రాజు 'డర్టీ హరి' ఫేమ్ సిమ్రత్ కౌర్ కనిపించారు.


Also Read: రౌడీ బాయ్స్ రివ్యూ: యూత్‌ని మెప్పించే రౌడీ బాయ్స్..


నాగార్జున, నాగచైతన్య బాగా చేశారు. వాళ్లిద్దరూ వచ్చే సన్నివేశాలు బావున్నాయి. ఫైట్స్ కూడా ఓకే. అయినా... సినిమాలో ఏదో తెలియని వెలితి. క్యారెక్ట‌రైజేష‌న్స్, సీన్స్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేసిన ద‌ర్శ‌కుడు... స్క్రిప్ట్‌, స్క్రీన్ ప్లే మీద చేయ‌లేద‌ని అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో సాంగ్స్ క‌ల‌ర్‌ఫుల్‌గా తీశారు. సినిమాటోగ్రఫీ బావుంది. బ్యాక్‌గ్యౌండ్ మ్యాజిక్ విష‌యంలో అనూప్ రూబెన్స్ స‌ర్‌ప్రైజ్ చేశాడు. పల్లెటూరి సినిమాకు కావలసినట్టు నేపథ్య సంగీతం ఇచ్చారు. అయితే... ఫ‌స్టాఫ్‌లో కథ ముందుకు కదల్లేదు. కామెడీ కొంత వరకూ వర్కవుట్ అయ్యింది. ఆ తర్వాత బోర్ కొట్టించింది. ఫ‌స్టాఫ్‌తో పోలిస్తే... సెకండాఫ్ కొంత రేసీగా సాగింది. అయితే... కథలో కొత్తదనం లేదని అనిపిస్తుంది. రొటీన్ స్క్రిప్ట్, రొటీన్ స్క్రీన్ ప్లే, రొటీన్ కామెడీ. 'వెన్నెల' కిషోర్, ప్రవీణ్, బ్రహ్మాజీ తదితరులు తెరపై ఉన్నప్పుడు ప్రేక్షకులు మరింత కామెడీ ఆశిస్తారు. సినిమా ఆ వినోదం అందించలేదు. రొమాంటిక్ సీన్స్ విషయంలో మరింత కేర్ తీసుకోవాల్సింది. ఓ ఇరవై నిమిషాలు నిడివి తగ్గించి సినిమాను రేసీగా నడిపించి ఉంటే బావుండేది. 'సోగ్గాడే చిన్ని నాయనా' మేజిక్ ఈ సినిమాలో రిపీట్ కాలేదు.


Also Read: 'సూప‌ర్ మ‌చ్చి' రివ్యూ: సూప‌ర్ అనేలా ఉందా? లేదా?


కంప్లీట్‌గా క్యారెక్ట‌రైజేష‌న్స్ మీద డిపెండ్ అయిన ఈ సినిమాను నాగార్జున, ఆయన  నాగచైతన్య తమ భుజాల మీద మోశారు. క‌ల‌ర్‌ఫుల్ విజువ‌ల్స్‌, పల్లెటూరి నేపథ్యం ఆకట్టుకుంటాయి. 'వాసివాడి తస్సాదియ్యా' పాట చివరిలో 'నువ్వు పెళ్లి చేసుకుని వెళ్లిపోయినా బంగార్రాజు... మా గుండెల్లో ఉండిపోతావ్ బంగార్రాజు' అని ఓ లైన్ ఉంటుంది. అది నిజమే... సినిమా ఎలా ఉన్నా, బంగార్రాజు ప్రేక్షకుల గుండెల్లో ఉండిపోతాడు. అక్కినేని అభిమానుల గుండెల్లో ఉండిపోతాడు. తెర మీద పండగ వాతావరణం తీసుకొచ్చే సినిమా. పండక్కి ప్రేక్షకులు హ్యాపీగా లుక్ వేయవచ్చు.
బంగార్రాజు ప్రేక్షకుల గుండెల్లో ఉంటాడు!


Also Read: 'సేనాపతి' రివ్యూ: రాజేంద్ర ప్రసాద్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా?
Also Read: 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' రివ్యూ: పప్పుచారు అంత టేస్టీగా... నవ్విస్తుంది!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి