సినిమా రివ్యూ: 'సూపర్ మచ్చి'
రేటింగ్: 2.5/5
నటీనటులు: కళ్యాణ్ దేవ్, రచితా రామ్, నరేష్ వీకే, రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణమురళి, ప్రగతి, అజయ్, రంగస్థలం మహేష్, భద్రం తదితరులు
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు
సంగీతం: ఎస్. తమన్
సహ నిర్మాత: ఖుషి
నిర్మాత: రిజ్వాన్
రచన, దర్శకత్వం: పులి వాసు
విడుదల తేదీ: 14-11-2022
'విజేత'తో కథానాయకుడిగా పరిచయమైన కళ్యాణ్ దేవ్... ఆ సినిమా తర్వాత నటించిన సినిమా 'సూపర్ మచ్చి'. కన్నడలో క్రేజీ కథానాయికలలో ఒకరైన రచితా రామ్‌కు తొలి తెలుగు చిత్రమిది. తొలుత ఈ సినిమాలో కథానాయికగా రియా చక్రవర్తిని తీసుకున్నారు. కొన్ని రోజులు షూటింగ్ కూడా చేశారు. హీరో హీరోయిన్లతో ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు. అనివార్య కారణాలతో ఆమె స్థానంలో రచితా రామ్‌ను తీసుకున్నారు. సంక్రాంతి సందర్భంగా భోగి రోజున సూపర్ మచ్చిని విడుదల చేశారు. ఈ సినిమా ఎలా ఉంది?
కథ: మీనాక్షి (రచితా రామ్) ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. నెలకు లక్షకు పైగా జీతం! అటువంటి అమ్మాయి విశాఖ బీచ్‌లోని ఓ బార్‌లో నెలకు 15వేల జీతానికి పాటలు పాడే అబ్బాయి రాజు (కళ్యాణ్ దేవ్)ను ప్రేమిస్తుంది. అతడు వద్దన్నా... వెంట పడుతుంది. `నాతో ఓ రాత్రి గడుపుతావా?` అంటే... `సరే` అంటుంది. రాజును మీనాక్షి అంతలా ప్రేమించడానికి కారణం ఏంటి? తన స్థాయికి మించిన అమ్మాయి వచ్చి వెంటపడితే రాజు ఎందుకు వద్దంటున్నాడు? ఈ ప్రేమకథలో మీనాక్షి తండ్రి (రాజేంద్ర ప్రసాద్), మావయ్య (పోసాని కృష్ణ మురళి) పాత్ర ఏమిటి? రాజు తల్లిదండ్రలు (నరేష్, ప్రగతి) ఏమన్నారు? చివరకు ఏమైంది? అనేది సినిమా.
విశ్లేషణ: ఇదొక లవ్ ఎంటర్‌టైనర్. తెలుగులో ప్రేమకథా చిత్రాలు చాలా వచ్చాయి. హీరో వద్దంటున్నా... నువ్వంటే ఇష్టం లేదని ముఖం మీద ఛీ కొట్టినా... హీరోయిన్ అతడి వెంటపడే సన్నివేశాలు వాటిలో ఉన్నాయి. మరి, ఆ చిత్రాలకు... సూపర్ మచ్చికి డిఫరెన్స్ ఏంటి? ఇందులో కొత్తదనం ఏముంది? అని చూస్తే... ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్, సెంటిమెంట్. నాన్న చెప్పారని ఇష్టం లేని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడే అమ్మాయిలను చూసి ఉంటారు. అయితే, ఇందులో పాయింట్ కొంచెం డిఫరెంట్. దర్శకుడిగా తొలి చిత్రానికి పులి వాసు కమర్షియల్ ఫార్మాట్‌లో కాస్త డిఫరెంట్ పాయింట్ తీసుకుని స్టొరి అయితే రాసుకున్నారు. దానిని వినోదాత్మకంగా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా చెప్పడంలో కొంచెం తడబడ్డారు. తొలి సినిమా కావడంతో అతని దర్శకత్వంలో అనుభవలేమి కనిపించింది. అయితే... ఫైట్స్, కొన్ని సీన్స్ బాగా తీశారు. ఇంటర్వెల్ ముందు హీరో హీరోయిన్స్ మధ్య రిసార్ట్‌లో సీన్ కథలో టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. అది ఆడియన్స్ ఊహించినట్టు కాకుండా మరోలా ఉంటుంది.
Also Read: 'సేనాపతి' రివ్యూ: రాజేంద్ర ప్రసాద్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా?
'చాలా లవ్ స్టోరీలు చూశా. కానీ వీడి లవ్ స్టోరి అర్థం కాలేదు' - ప్రీ క్లైమాక్స్‌లో అజయ్ చెప్పే డైలాగ్. సేమ్ డౌట్ ఆడియన్స్‌కూ వస్తుంది. అయితే... ప్రీ క్లైమాక్స్‌లో కాదు, ఫస్టాఫ్‌లో! హీరో వెంట హీరోయిన్ ఎందుకు పడుతుందో తెలియక! ఆ డౌట్‌కు ఆన్సర్ సెకండాఫ్‌లో, క్లైమాక్స్‌కు ముందు దొరుకుతుంది. అందువల్ల, సింపుల్ పాయింట్ పట్టుకుని ఇంటర్వెల్ ముందు వరకూ సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్‌లో కూడా సాగదీత అనేది ఉంది. స్క్రీన్ ప్లే, కామెడీ సీన్స్ విషయంలో కేర్ తీసుకుని ఉంటే బావుండేది.
Also Read: '83' మూవీ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే...?
చిరంజీవి 'అమ్మడూ... లెట్స్ డూ కుమ్ముడు', పవన్ కల్యాణ్ 'పిల్లా నువ్వులేని జీవితం...' సాంగ్స్ పాడుతూ... ఆ సాంగ్స్‌లోని స్టెప్స్ వేయడం మెగా ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తాయి. కథకు తగ్గట్టు తమన్ కమర్షియల్ సాంగ్స్, రీ-రికార్డింగ్ అందించారు. పబ్‌లో పిక్చరైజ్ చేసిన 'డించకు డించకు...', 'చూసానే చూసానే...' సాంగ్స్ బావున్నాయి. తొలుత ఓ హీరోయిన్‌తో కొంత షూటింగ్ చేసిన తర్వాత... ఆమె స్థానంలో మరొకరిని తీసుకుని షూటింగ్ చేయడం అనేది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. నిర్మాతలు ఆ ఖర్చును భరించారు. మళ్లీ కొత్త హీరోయిన్‌తో, సీనియర్ ఆర్టిస్టులతో మళ్లీ షూట్ చేశారు. బాగానే ఖర్చు చేశారు. రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ వేల్యూస్ తెరపై కనిపిస్తాయి. ఆ విషయంలో నిర్మాతలను అభినందించాలి.
Also Read: 'అర్జున ఫల్గుణ' రివ్యూ: అర్జునుడు బలయ్యాడా? బతికాడా?
తెలుగులో రచితా రామ్‌కు తొలి సినిమా అయినా... కన్నడలో పదిహేనుకు పైగా సినిమాలు చేశారు. నటిగా ఆ అనుభవం తెరపై కనిపించింది. బ్యాటిఫుల్‌గా కనిపించారు. చక్కగా నటించారు. లుక్స్ పరంగా కళ్యాణ్ దేవ్ మంచి కేర్ తీసుకున్నారు. నటన పరంగా తొలి సినిమాతో పోలిస్తే మెరుగయ్యారు. రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణమురళి, నరేష్, ప్రగతి తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. సినిమా ప్రారంభంలో నరేష్, రచితా రామ్, ప్రగతి మధ్య సన్నివేశం నవ్విస్తుంది.
Also Read: మిన్నల్ మురళి రివ్యూ: దేశంలో బెస్ట్ సూపర్ హీరో సినిమా ఇదే..
సినిమాలో ఎమోషన్ ఉంది. సింపుల్ అండ్ సెంటిమెంట్ పాయింట్ ఉంది. కథను ఎంటర్‌టైనింగ్‌గా చెప్పడంలో దర్శకుడు తడబడటం, కథనం నిదానంగా సాగడం వల్ల సినిమాలో బోరింగ్ మూమెంట్స్ ఉన్నాయి. ప్రేమ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు, ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్, నటీనటుల పనితీరు ఆకట్టుకుంటాయి. సినిమా చూసి అందరూ సూపర్ అనలేరు. అయితే... ఎలాంటి అసభ్యకరమైన సన్నివేశాలు లేవు కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ చిత్రమిది.
Also Read: 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' రివ్యూ: పప్పుచారు అంత టేస్టీగా... నవ్విస్తుంది!
Also Read:'డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు' రివ్యూ: సినిమా ఎలా ఉంది?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి