సినిమా రివ్యూ: '83'
రేటింగ్: 2.75/5
నటీనటులు: ర‌ణ్‌వీర్ సింగ్‌, దీపికా పదుకోన్, పంకజ్ త్రిపాఠీ, జీవా, సాకీబ్ సలీమ్, తాహిర్ రాజ్ భాసిన్ తదితరులు
ఎడిటర్: నితిన్ 
సినిమాటోగ్రఫీ: అసీమ్ మిశ్రా
నేపథ్య సంగీతం: జూలియస్ పేకియం
స్వరాలు: ప్రీతమ్
నిర్మాతలు: దీపికా పదుకోన్, కబీర్ ఖాన్, విష్ణువర్ధన్ ఇందూరి, నిఖిల్ ద్వివేది, సాజిద్ న‌డియాడ్‌వాలా, రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఫాంట‌మ్ ఫిల్మ్స్‌
దర్శకత్వం: కబీర్ ఖాన్
విడుదల తేదీ: 24-12-2021


క్రికెట్... ఓ ఆట!
ఇతర దేశాల్లో అంతే!
మరి, భార‌త్‌లో?
మతం! అవును... మన దేశంలో క్రికెట్ ఓ మతం!
కులమతాలకు అతీతంగా ప్రజలను ఏకం చేసిన మతం!
బహుశా... ఈ మతం 1983 భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ విజయంతో బలంగా పునాది వేసుకుందని చెప్పవచ్చు.
హర్యానా హరికేన్ కపిల్ దేవ్ (Kapil Dev) నేతృత్వంలోని టీమిండియా విజయాన్ని అప్పటి ప్రజలు చాలామంది టీవీల్లో వీక్షించారు. కొంతమంది రేడియోల్లో విన్నారు. టీమిండియా విజయాన్ని తమ విజయంగా భావించి సంబరాలు చేసుకున్నారు. ఆ తర్వాత తరం ప్రజలు విజయగాథను కథలు కథలుగా విన్నారు. '83' (83 Movie)తో దర్శకుడు కబీర్ ఖాన్ (Kabir Khan) దానిని వెండితెరపై ఆవిష్కరించారు. ఈ సినిమాలో క‌పిల్ దేవ్ పాత్ర‌లో ర‌ణ్‌వీర్ సింగ్‌ (Ranvir Singh), కపిల్ భార్య రోమి పాత్రలో నిజజీవితంలో ర‌ణ్‌వీర్ భార్య దీపికా పదుకోన్ (Deepika Padukone) నటించారు. అన్న‌పూర్ణ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో తెలుగు డబ్బింగ్ విడుదల అయ్యింది. సినిమా ఎలా ఉంది? రివ్యూ (83 Movie Review) చూడండి.
 
కథ: కథ గురించి కొత్తగా చెప్పేది ఏముంది? 1983లో ఇండియన్ క్రికెట్ టీమ్ వరల్డ్ కప్ నెగ్గింది. ఎటువంటి అంచనాలు లేని భారత జట్టు... ఆ కప్ నెగ్గడానికి ముందు ఎటువంటి అవమానాలు ఎదుర్కొంది? జట్టులోని సభ్యులు ఏమని అనుకున్నారు? కుటుంబ సభ్యులతో వాళ్లకు ఉన్న రిలేషన్ ఏమిటి? తదితర అంశాల సమాహారమే '83' సినిమా.
విశ్లేషణ: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ముందు... ఆ రోజు ఉదయం కపిల్ దేవ్, అతడి భార్య మధ్య జరిగిన సంభాషణను సినిమాలో చూపించారు. 'భయంగా ఉందా?' అని క‌పిల్‌ను అత‌డి భార్య ప్ర‌శ్నిస్తే... 'చాలా' అనే సమాధానం వినిపిస్తుంది. అప్పుడు భార్య 'ఇప్పుడు కపిల్ పెద్దోడు అయిపోయాడు... కానీ, అతడిలో చిన్న పిల్లాడు కూడా ఉన్నాడు. ఆ పిల్లాడి కోసం క్రికెట్ ఆడేవాడు. ఇప్పుడు కూడా ఆ పిల్లాడి కోసం క్రికెట్ ఆడు' అంటుంది. ఈ సినిమాను కూడా ప్రేక్షకుడిలా కాకుండా, ప్రేక్షకుడిలో పిల్లాడి కోసం చూడాలి. ఎందుకంటే... దీన్ని సినిమాగా చెప్పలేం. ర‌ణ్‌వీర్ సింగ్ వంటి స్టార్ హీరో, భారీ తారాగ‌ణంతో అప్పటి విజయాన్ని వెండితెరపై ఆవిష్కరించాలని చేసిన ప్రయత్నమిది. ఓ ప్రేక్షకుడిలా '83' సినిమాను చూస్తే... ఇందులో లోపాలు కనిపిస్తాయి. పిల్లాడిలా చూస్తే... అప్పటి మ్యాచ్ ఇప్పుడు ఇంకోసారి చూసినట్టు ఉంటుంది.
క‌పిల్ దేవ్‌గా ర‌ణ్‌వీర్ సింగ్‌ ఒదిగిపోయాడు. గెటప్ దగ్గరనుంచి క్రికెట్ ఆడే తీరు వరకూ క‌పిల్‌ను దింపేశాడు. నటనలోనూ కొత్త ర‌ణ్‌వీర్‌ను చూపించాడు. కపిల్ క్యారెక్ట‌ర్‌కు ఏం కావాలో, అది చేశాడు. దీపికా పదుకోన్- కనిపించింది కాసేపే కావచ్చు. కానీ, సినిమాలో ప్రభావం చూపించారు. మాన్ సింగ్‌గా పంకజ్ త్రిపాఠీకి పెద్ద పాత్ర లభించింది. నటీనటులు అందరూ బాగా చేశారు. క్యాస్టింగ్ పరంగా ఎంతో వర్క్ చేసినట్టు కనిపిస్తుంది. మరి, సినిమా పరంగా? మరింత వర్క్ చేసి ఉంటే బావుంటుందని అనిపిస్తుంది. ఫస్టాఫ్ ఏదో అలా వెళుతుంది. ఇంటర్వెల్ తర్వాత కొంత బావుంటుంది. భావోద్వేగాల కంటే సాంకేతిక అంశాల (టెక్నికల్ థింగ్స్) మీద దర్శకుడు ఎక్కువ దృష్టి పెట్టారు. అందులో విజయవంతం అయ్యారు. తెరపై ఆ కాలాన్ని చక్కగా ఆవిష్కరించారు. ఆర్ట్, కెమెరా... టోట‌ల్‌గా ఓ టీమ్‌ వర్క్ తెరపై కనిపించింది.
Also Read: మనీ హెయిస్ట్ రివ్యూ: ఎండింగ్ ఇరగదీశారు.. మొదలెడితే ఆపడం కష్టమే!
టీమిండియా 1983 క్రికెట్ వరల్డ్ కప్ నెగ్గిందనే విషయం తెలిసిందే. తెలిసిన కథను ప్రేక్షకుడు తెరపై చూడాలంటే? కథతో ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ కావాలి. ఆల్రెడీ వరల్డ్ కప్ విన్ అనేది ఓ ఎమోషనల్ మూమెంట్. దానితో మరింత కనెక్ట్ అవ్వాలంటే? సినిమా, అందులో స‌న్నివేశాలు హార్ట్‌ను ట‌చ్ అవ్వాలి. సినిమాలో అది మిస్ అయ్యింది. అప్పట్లో కపిల్ భార్య రోమి, మదన్ లాల్ భార్య అను ఫైన‌ల్ మ్యాచ్‌లో ఇండియా ఓడిపోతుంద‌ని స్టేడియం నుంచి హోట‌ల్‌కు వెళతారు. రోమిగా దీపికా పదుకోన్, అనూగా వామికా గబ్బి నటన బావుంటుంది. అయితే... దర్శకుడు కబీర్ ఖాన్ ఆ దృశ్యాలను ప్రేక్షకుల హృదయాలను తాకేలా తీయడంలో పూర్తిగా విజయవంతం కాలేదు. మత ఘర్షణలకు 1983లో టీమిండియా జైత్రయాత్ర ఎలా ముగింపు పలికింది? ఇందిరా గాంధీ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. ఫైనల్ మ్యాచ్ రోజున ఇండో-పాక్ సరిహద్దుల్లో భారత సైన్యానికి పాక్ సైన్యం ఒక్క రోజు కాల్పుల విరమణ ఇవ్వడం, ఇంగ్లాండ్‌లో పనిచేస్తున్న భారతీయులు... సినిమాలో చాలా అంశాలను దర్శకుడు టచ్ చేశారు. కానీ, అవేవీ హార్ట్‌ను టచ్ చేయలేదు. నిడివి కూడా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే... అప్పటి మ్యాచ్‌ను లైవ్‌లో చూసిన‌ అనుభూతిని మాత్రం '83' అందిస్తుంది.
Also Read: నో వే హోం రివ్యూ: పాత విలన్ల రచ్చ.. మరి పాత స్పైడర్ మ్యాన్స్ వచ్చారా? ‘నో వే హోమ్’ ఎలా ఉంది?
మొహిందర్ అమ‌ర్‌నాథ్‌ పాత్రలో సాకీబ్ సలీమ్ నటించారు. అయితే... అతడి తండ్రి పాత్రలో లాలా అమ‌ర్‌నాథ్‌గా మొహిందర్ అమ‌ర్‌నాథ్‌ నటించడం విశేషం. సందీప్ పాటిల్ పాత్రలో ఆయన తనయుడు చిరాగ్ పాటిల్ నటించడం మరో విశేషం. కపిల్ దేవ్ అతిథి పాత్రలో తళుక్కున మెరిశారు. తెలుగులో ర‌ణ్‌వీర్ సింగ్‌కు హీరో సుమంత్ డ‌బ్బింగ్ చెప్పారు. జీవాకు నటుడు రాహుల్ రవీంద్రన్ చెప్పిన డబ్బింగ్ బాగా సూట్ అయ్యింది. సరదాగా థియేటర్‌లో అప్పటి క్రికెట్ మ్యాచ్‌ల‌లో హైలైట్స్‌, బ్యాక్ ఎండ్ స్టోరీస్ చూడటం కోసం '83' బెటర్ ఆప్షన్.


Also Read: 'పుష్ప' రివ్యూ: సినిమా ఎలా ఉందంటే...?
Also Read: 'లక్ష్య' రివ్యూ: లక్ష్యం నెరవేరిందా? గురి తప్పిందా?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి