మనీ హెయిస్ట్.. గత కొన్ని సంవత్సరాల్లో డార్క్, మనీ హెయిస్ట్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్‌లో మనదేశంలో బాగా ఫేమస్ అయ్యాయి. ఈ నాలుగిట్లో డార్క్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ముగిసిపోగా.. స్క్విడ్ గేమ్ రెండో సీజన్ సిద్ధం అవుతోంది. మనీ హెయిస్ట్ ఆఖరి సీజన్ ఈ శుక్రవారం(డిసెంబర్ 3వ తేదీ) నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అయింది. సూపర్ హిట్ అయిన చాలా వెబ్ సిరీస్‌ల్లో కూడా ముగింపు ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీయడం కష్టం. మరి ఈ సిరీస్ ముగింపు అయినా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుందా?


ఈ సీజన్‌కు ముందు ఏం జరిగింది: రాయల్ మింట్ ఆఫ్ స్పెయిన్‌ను విజయవంతంగా దోచుకున్న అనంతరం టీం సభ్యులందరూ ప్రపంచానికి దూరంగా బతుకుతూ ఉంటారు. అయితే రియో పోలీసులకు దొరికిపోవడంతో తనని విడిపించడం కోసం వీరు బ్యాంక్ ఆఫ్ స్పెయిన్ దోచుకోవడానికి సిద్ధం అవుతారు. అయితే ఈ క్రమంలో నైరోబి చనిపోతుంది. తర్వాత లోపలికి వచ్చిన సైనికులను ఆపబోయి టోక్యో కూడా మరణించడంతో మనీహెయిస్ట్ ఐదో సీజన్ మొదటి భాగం ముగుస్తుంది.


ఈ భాగంలో ఏం జరిగింది: సరిగ్గా టోక్యో మరణం నుంచే ఈ భాగం అవుతుంది. బంగారాన్ని బ్యాంకు నుంచి బయటకు ఎలా తీసుకెళ్లారు? వీరు ఎలా బయటపడ్డారు? ప్రొఫెసర్‌కు బ్యాంకులోకి వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ భాగంలో ఎవరైనా మరణించారా? అసలు రాబరీ చేయడానికి ఈ బ్యాంక్‌నే ప్రొఫెసర్ ఎందుకు ఎంచుకున్నాడు? వంటి విషయాలు తెలియాలంటే మనీ హెయిస్ట్ ఐదో సీజన్ రెండో భాగాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో చూడాల్సిందే..


విశ్లేషణ: మనీ హెయిస్ట్ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణ ప్రొఫెసరే. బ్యాంకులో ఎటువంటి కష్టం వచ్చినా.. తన మాస్టర్ మైండ్‌తో ఆ కష్టం నుంచి బయటపడేయడం తన స్పెషాలిటీ. సాధారణంగా ఇలా దొంగతనం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సినిమాల్లో బ్యాంకు రాబరీకి ఒకే ప్లాన్ వేస్తారు. ఒకవేళ అది ఫెయిల్ అయితే ప్లాన్-బి మాత్రమే వారి దగ్గర ఉంటుంది. కానీ మనీ హెయిస్ట్ అలా కాదు. ఒక ప్లాన్‌లో ఎన్నో సబ్ ప్లాన్‌లు, ప్రతి ప్లాన్‌కు బ్యాకప్ ప్లాన్.. ఇలా చాలా డెప్త్‌తో, ఇంటెలిజెన్స్‌తో ఈ సిరీస్ సాగుతుంది. అందుకే ఈ సిరీస్‌కు అంత కల్ట్ ఫాలోయింగ్ వచ్చింది.


ఈ సిరీస్ కూడా దానికి తక్కువేం కాదు. వేసిన అన్ని ప్లాన్లూ ఫెయిల్ అయి.. గెలవడానికి ఒక్క శాతం కూడా చాన్స్ లేదనుకున్న దశలో ప్రొఫెసర్ చివరి ప్లాన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అయితే మనీ హెయిస్ట్ అంటే కేవలం థ్రిల్స్ మాత్రమే కాదు. ఆ గ్యాంగ్ సభ్యుల మధ్య ఉండే ఎమోషన్స్ కూడా.


ఫ్లాష్‌బ్యాక్‌లో బెర్లిన్, తన కొడుకుల ట్రాక్ కూడా ఈ కథకు సమాంతరంగా నడుస్తుంది. అయితే ఈ ట్రాక్‌ను ప్రస్తుత కథకు ఎలా లింక్ చేశాడనే విషయం మాత్రం మైండ్ బ్లోయింగ్. టోక్యో చనిపోయినా కూడా తన వాయిస్ కొంతమంది గ్యాంగ్ సభ్యులకు వినిపిస్తూ ఉంటుంది. అసలు బ్యాంక్ ఆఫ్ స్పెయిన్ దొంగతనం చేయాలనే ఆలోచన ఎవరిది అని రివీల్ చేసే ఎపిసోడ్ కూడా బాగా పండింది.


ఇక ముగింపు విషయానికి వస్తే.. థ్రిల్లింగ్ ఉంటూనే కన్విన్సింగ్‌గా, అభిమానులను సంతృప్తి పరిచేలా ముగింపుని ఇచ్చారు. అయితే అన్ని ముడులూ విప్పినా ఒక్క ముడిని మాత్రం అలాగే వదిలేశారు. 2023లో రానున్న బెర్లిన్ క్యారెక్టర్ ప్రత్యేక స్పిన్-ఆఫ్ సిరీస్‌లో ఈ ముడిని విప్పే అవకాశం ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ సిరీస్‌ను చూడటం మొదలుపెడితే అయిపోయే దాకా అస్సలు ఆపలేరు.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి