సినిమా రివ్యూ: డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు
రేటింగ్: 1.5/5
నటీనటులు: ఆదిత్ అరుణ్, శివానీ రాజశేఖర్, సందీప్ భరద్వాజ్, దివ్య శ్రీపాద, 'సత్యం' రాజేష్, ప్రియదర్శి, 'వైవా' హర్ష, రియాజ్ ఖాన్, 'వెన్నెల' రామారావు తదితరులు 
ఎడిటర్: తమ్మిరాజు
మాటలు: 'మిర్చి' కిరణ్ 
సంగీతం: సైమన్ కె కింగ్ 
కో-ప్రొడ్యూసర్: విజయ్ ధరణ్ దాట్ల
నిర్మాత: డా. రవిప్రసాద్ రాజు దాట్ల
కథ, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం: కె.వి. గుహన్
విడుదల తేదీ: 24-12-2021 (సోనీ లివ్ ఓటీటీలో)


'అతడు', 'జల్సా', 'దూకుడు', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'బాద్ షా' తదితర సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేసిన కె.వి. గుహన్... '118'తో దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. ఆయన దర్శకత్వం వహించిన రెండో సినిమా 'డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు' (WWW Movie). ఇందులో ఆదిత్ అరుణ్ (Adith Arun), శివానీ రాజశేఖర్ (Shivani Rajashekar) జంటగా నటించారు. సైబ‌ర్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌ చిత్రమిది. సోనీ లివ్ ఓటీటీలో విడుదల అయ్యింది. సినిమా ఎలా ఉంది? రివ్యూ (WWW Movie Review) చూడండి.


కథ: విశ్వ (ఆదిత్ అరుణ్), క్రిస్టీ (దివ్య శ్రీపాద), సదా ('సత్యం' రాజేష్), అష్రఫ్ (ప్రియదర్శి) స్నేహితులు. నలుగురూ నాలుగు వేర్వేరు నగరాల్లో ఉంటారు. క్రిస్టీ ఫ్లాట్‌లోకి కొత్తగా వచ్చిన అమ్మాయి మిత్ర (శివానీ రాజశేఖర్)తో విశ్వ ప్రేమలో పడతాడు. ఆమెను క‌ల‌వ‌డానికి బెంగళూరు వెళ్లాలని అనుకుంటాడు. అయితే... లాక్‌డౌన్‌ రావడంతో కుదరదు. రోజంతా వీడియో కాల్‌లో కనెక్ట్ అయ్యి ఉంటారు. ఓ రోజు మిత్ర ఫ్లాట్‌కు ఒకడొస్తాడు. క్రిస్టీని కత్తితో పొడుస్తాడు. మిత్రాను కుర్చీకి కట్టేస్తాడు. చంపేస్తానని బెదిరిస్తాడు. వీడియో కాల్‌లో ఉన్న విశ్వ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటాడు. మిత్ర ఫ్లాట్‌కు వ‌చ్చింది ఎవ‌రు? విశ్వ మీద పగతో అతడి ప్రేయసి దగ్గరకు ఎందుకు వెళ్లాడు? అసలు, విశ్వ ఏం చేస్తాడు? విశ్వాను ఆ ఆగంతకుడు ఏం చేయమని ఆర్డర్ వేశాడు? చివరకు, ఏమైంది? అనేది మిగతా సినిమా!


విశ్లేషణ: తెలుగులో థ్రిల్లర్ సినిమాలు చాలా వచ్చాయి. అలాగే, ఎక్కువ లొకేషన్స్ లేకుండా తక్కువ లొకేష‌న్స్‌లో తీసిన థ్రిల్ల‌ర్స్ వ‌చ్చాయి. అయితే... కంప్యూటర్ స్క్రీన్ థ్రిల్లర్స్ తక్కువ. ఇండియాలో ఈ జానర్ థ్రిల్లర్స్ ఎక్కువ రాలేదు. ఫహాద్ ఫాజిల్ 'సి యు సూన్' వంటివి ఎక్కడో కనిపిస్తాయి. థ్రిల్లర్ సినిమా '118'తో తెలుగులో దర్శకుడిగా పరిచయమైన కె.వి. గుహన్... మరోసారి థ్రిల్లర్ సబ్జెక్ట్ ఎంపిక చేసుకున్నారు. రెగ్యుల‌ర్‌గా కాకుండా కంప్యూటర్ స్క్రీన్ థ్రిల్లర్‌లా తీశారు. ఆయన ఆలోచన బావుంది. ఆ ఆలోచనకు రెగ్యులర్ కథ కాకుండా కొత్త కథను ఎంపిక చేసుకుంటే బావుండేది. కథలో పెద్ద విషయం లేదు... కంగాళీ తప్ప.
Also Read: '83' మూవీ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే...?
అనగనగా ఓ అబ్బాయి... అమ్మాయిని చూడకముందే వాయిస్ విని ఆమె పరిచయం కోసం పరితపిస్తాడు. చూసిన క్షణమే ప్రేమలో పడతాడు. ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉంటే రక్షించాలని ఆరాటపడతాడు. కథలో కొత్తదనం లేదు. టేకింగ్‌లో కూడా! మేకింగ్ పరంగా స్క్రీన్ ముందు ఆర్టిస్టులు ఉండటంతో ఆ కొంచెం కొత్తదనం వచ్చింది. థియేట‌ర్‌కు వెళ్ల‌కుండా కంప్యూట‌ర్ స్క్రీన్‌(ఓటీటీ)లోనే  చూసే సినిమా కాబ‌ట్టి ఆడియన్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్ పట్టుకుని కూర్చోవచ్చు. లేదంటే పరిస్థితి ఇంకా ఇబ్బందిగా ఉండేది. కథ ఎంత సేపటికీ ముందుకు కదలదు. పోనీ, ఆ సన్నివేశాలు ఏమైనా ఆసక్తిగా ఉన్నాయంటే అదీ లేవు. అమ్మాయి  దగ్గర మార్కులు కొట్టేయడానికి ఆమె అన్నయ్యకు హీరో జాబ్ వేయిస్తాడు. హీరోయిన్‌ను పరిచయం చేయడానికి హీరోని మేకప్ కిట్ కొని ఇవ్వమని అతడి ఫ్రెండ్ అడుగుతుంది. ఈ టైప్ రొటీన్ సీన్స్ చాలా ఉన్నాయి. సైబర్ క్రైమ్స్, హ్యాకింగ్ కాన్సెప్ట్స్ పేర్లు చెప్పడం తప్ప క‌థ‌లో ఆ యాంగిల్‌ను అసలు ఫోకస్ చేయలేదు. ఆ యాంగిల్‌లో ఏదైనా ముగింపు ఇస్తార‌నుకుంటే రొటీన్‌గా క్లైమాక్స్‌లో పోలీసులు రావ‌డంతో ఎండ్ కార్డ్ వేశారు. అంతా సినిమాటిక్‌గా జ‌రుగుతుంది. అయితే... హీరోయిన్ దగ్గరకు విలన్ ఎందుకు వెళ్లాడనే విషయం రివీల్ చేయడం ఒక్కటీ రిలీఫ్ ఇస్తుంది.
Also Read: 'పుష్ప' రివ్యూ: సినిమా ఎలా ఉందంటే...?
ఆదిత్ అరుణ్ యాక్టింగ్‌లో డిఫ‌రెన్స్ చూపించాల‌ని ప్రయత్నించారు. సినిమా స్టార్టింగ్‌లో మామూలుగా ఉన్నప్పటికీ... గంట గ‌డిచిన త‌ర్వాత‌ అతడి యాక్టింగ్ లౌడ్ అనిపిస్తుంది. శివానీ రాజశేఖర్ పర్వాలేదు. చీర‌లు, చుడీదార్స్‌తో పాటు ఓ పాట‌లో మోడ్ర‌న్ డ్ర‌స్‌లో కనిపించారు. 'కిల్లింగ్ వీరప్పన్'లో వీరప్పన్ పాత్రలో నటించిన సందీప్ భరద్వాజ్ విలన్ రోల్ చేశారు. దివ్య శ్రీపాద, 'సత్యం' రాజేష్, ప్రియదర్శి, 'వైవా' హర్ష పెద్దగా చేయడానికి ఏమీ లేదు. వాళ్లవి రొటీన్ పాత్రలే. పాటల్లో సిద్ శ్రీరామ్ పాడిన 'నైలు నది...' బావుంది. ఫస్ట్ సాంగ్ 'కన్నులు చెదిరే...' వినసొంపుగా ఉంది. సినిమాటోగ్రఫీ కూడా బావుంది. అయితే... రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే ప్రేక్షకుడికి విసుగు తెప్పిస్తాయి. ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకపోతే సినిమా భారంగా ముందుకు కదులుతుంది.
Also Read: నో వే హోం రివ్యూ: పాత విలన్ల రచ్చ.. మరి పాత స్పైడర్ మ్యాన్స్ వచ్చారా? ‘నో వే హోమ్’ ఎలా ఉంది?
Also Read: 'లక్ష్య' రివ్యూ: లక్ష్యం నెరవేరిందా? గురి తప్పిందా?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి