సినిమా రివ్యూ: సేనాపతి
రేటింగ్: 3/5
నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, నరేష్ అగస్త్య, జ్ఞానేశ్వరి కండ్రేగుల‌, హర్షవర్ధన్, రాకేందు మౌళి, 'జోష్' రవి, సత్యప్రకాష్, పావని రెడ్డి, జీవన్ కుమార్ తదితరులు 
ఎడిటర్: గౌతమ్ నెరుసు
ఒరిజినల్ స్టోరి: శ్రీ గణేష్ 
మాటలు: రాకేందు మౌళి
సినిమాటోగ్రఫీ: వివేక్ కాలెపు 
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్ 
నిర్మాతలు: విష్ణుప్రసాద్, సుష్మితా కొణిదెల
దర్శకత్వం: పవన్ సాధినేని
విడుదల తేదీ: 31-12-2021 (ఆహా ఓటీటీలో)


తమిళ సినిమా '8 తొట్టక్కల్' (8 తూటాలు)కు 'సేనాపతి' రీమేక్. తమిళ సినిమాలో కీలక అంశాలు అలాగే ఉంచి... ఒరిజినల్ మూవీ రైటర్ & డైరెక్టర్ శ్రీ గణేష్, మరో ముగ్గురు రచయితలు రాకేందు మౌళి, హుస్సేన్ షా కిరణ్, వసంత్ జుర్రుతో కలిసి కథలో మార్పులు చేశానని,కొత్త పాత్రలు పరిచయం చేశానని 'సేనాపతి' దర్శకుడు పవన్ సాధినేని తెలిపారు. రీమేక్ అనేది పక్కన పెడితే... 'సేనాపతి' ఎలా ఉంది?

కథ: తాను చేయని నేరానికి బాల్యంలో ఎనిమిదేళ్లు జువైనల్ హోమ్‌లో ఉన్న కృష్ణ (నరేష్ అగస్త్య), కష్టపడి చదివి ఎస్ఐ అవుతాడు. ఎవరికీ అన్యాయం జరగకూడనేది అతడి ఆశయం. ఐపీఎస్ కావాలనేది అతడి లక్ష్యం. అయితే... ఓ క్రిమిన‌ల్‌ను ప‌ట్ట‌కునే స‌మ‌యంలో అతడి స‌ర్వీస్ రివాల్వ‌ర్‌ పడిపోతుంది. కాన్సంట్రేషన్ అంతా క్రిమినల్ మీద పెట్టడంతో కృష్ణ రివాల్వర్ పడిన విషయం గమనించడు. అది ఎవరికి దొరికింది? అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లింది? హైదరాబాద్ సిటీలో ఓ బ్యాంకు దోపిడీకి, వరుస హత్యలకు ఆ గన్ ఎలా సాక్ష్యంగా నిలిచింది? గన్ మళ్లీ తన చేతికి రావడం కోసం కృష్ణ ఎటువంటి ప్రయత్నాలు చేశాడు? బ్యాంకు దోపిడీ చేసిన మూర్తి అలియాస్ కృష్ణమూర్తి (రాజేంద్ర ప్రసాద్) కథ ఏమిటి? కృష్ణ, మూర్తి ఎలా కలుసుకున్నారు? చివరకు, ఏమైంది? అనేది సినిమా.


విశ్లేషణ: 'సేనాపతి' గురించి క్లుప్తంగా చెప్పాలంటే... దొంగలు బ్యాంకులో డబ్బును దోచుకువెళ్లే సమయంలో అనుకోకుండా జరిగిన ఘటన వల్ల ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోతుంది. చిన్నారికి ప్రజలు నివాళి అర్పిస్తారు. వారిలో హత్యకు కారణమైన వ్యక్తి, గన్ పోగొట్టుకున్న ఎస్ఐ కూడా ఉంటారు. తన వల్ల ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిందనే పశ్చాత్తాపం మొదటి వ్యక్తిలో... పాప ప్రాణాలు తీసిన బుల్లెట్ తన గ‌న్‌లోనేదే అనే బాధ రెండో వ్యక్తిలో కనపడతాయి. ఇద్దరిలోనూ నిజాయతీ కనపడుతుంది. నటీనటుల నటనలోనూ అదే నిజాయతీ కనిపిస్తుంది. సినిమాకు పని చేసిన సాంకేతిక నిపుణుల పనితీరులోనూ, దర్శక - నిర్మాతల్లోనూ అదే నిజాయతీ ఉందని తెలుస్తుంది.
Also Read: 'శ్యామ్ సింగ రాయ్' రివ్యూ: తిరగబడిన సంగ్రామమా? ఎగసిపడిన అలజడా?
'సేనాపతి' సినిమా బ్యాంక్ దోపిడీలో మరణించిన చిన్నారిదో, ఆమె ప్రాణాలు తీసిన బుల్లెట్ వచ్చిన గన్‌దో కాదు. గ‌న్‌తో ముడిప‌డిన‌ ఇద్దరు మనుషుల జీవితాల గురించి! క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో మానవత్వంతో ముడిపడిన కథను దర్శకుడు పవన్ సాధినేని చెప్పారు. ఇద్దరి జీవితాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ఆ గ‌న్‌ను ఓ క‌నెక్టింగ్ పాయింట్‌గా తీసుకున్నారు. సినిమాలో నేరమూ ఉంది. అలాగే, మానవత్వమూ ఉంది. అయితే... తొలి గంటలో గన్ అన్వేషణలో - స్క్రీన్ ప్లేతో కథను పరుగులు పెట్టిన దర్శకుడు, ఆ తర్వాత హార్ట్ టచింగ్ సీన్స్ తెర మీదకు తీసుకొచ్చారు. గన్ కోసం ఎస్ఐ వెతికే క్రమం, ఆ సన్నివేశాలు చూసి ప్రేక్షకుడు ఓ మూడ్‌లోకి వస్తాడు. చక్కటి యాక్షన్ థ్రిల్లర్ చూస్తున్నామనే ఫీలింగ్‌లో ఉంటాడు. పైగా, స్క్రీన్ ప్లే కూడా రేసీగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చే హార్ట్ టచింగ్ సీన్స్ కథలో వేగాన్ని తగ్గించాయి. పిల్లల నిరాదరణకు గురైన తల్లిదండ్రుల కథలు గతంలో చూడటంతో సాగదీసినట్టు ఉంటుంది. ఆ సన్నివేశాల నిడివి కొంచెం తగ్గించి ఉంటే బావుండేది. ఎస్ఐ, జర్నలిస్ట్ మధ్య లవ్ ట్రాక్ కూడా సినిమాలో సెట్ కాలేదు. దర్శకుడు పవన్ సాధినేనికి సినిమాటోగ్రాఫర్ వివేక్, మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ భరద్వాజ్ నుంచి ఫుల్ సపోర్ట్ లభించింది. సీన్‌కు అవ‌స‌ర‌మైన మూడ్‌ను వివేక్ లైటింగ్‌, ఫ్రేమింగ్‌తో తీసుకొస్తే... తన రీ రికార్డింగ్‌తో శ్రవణ్ భరద్వాజ్ సీన్‌ను ఎలివేట్ చేశారు. ప్రొడక్షన్ డిజైన‌ర్స్‌ను కూడా మెచ్చుకోవాలి. హైద‌రాబాద్‌ రియ‌ల్ లొకేష‌న్స్‌లో సినిమా తీశారు. ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి.
Also Read: 'లక్ష్య' రివ్యూ: లక్ష్యం నెరవేరిందా? గురి తప్పిందా?
టాలెంటెడ్ ఆర్టిస్టు ఎటువంటి పాత్రలోనైనా నటించి మెప్పించగలడని చెప్పడానికి 'సేనాపతి' ఓ ఉదాహరణ. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రేక్షకుల్ని నవ్వించారు. 'ఆ నలుగురు' వంటి సినిమాల్లో గుండెల్ని పిండేశారు. అయితే... ఈ సినిమాలో ఆయన సీరియస్ రోల్ చేశారు. విల‌న్‌గా తనలో కొత్త షేడ్‌ చూపించారు. ఆయన గెటప్ కొత్తగా ఉంది. నటన సహజంగా ఉంది. మూర్తి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ జీవించారు. ఎస్ఐ పాత్రలో నరేష్ అగస్త్య చక్కగా నటించారు. 'జోష్' రవి, రాకేందు మౌళి, సత్యప్రకాష్ పాత్రలకు సెట్ అయ్యారు. హర్షవర్ధన్ పాత్ర చూస్తే... ఆయన మాత్రమే చేయగలరు అనేలా ఉంటుంది. జ్ఞానేశ్వరి కండ్రేగుల‌ది చిన్న పాత్రే. కానీ, కథలో కాస్త ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర. పావని రెడ్డిది సైతం చిన్న పాత్రే అయినా... అది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పావని రెడ్డి అభినయం బావుంది.
Also Read: 'పుష్ప' రివ్యూ: సినిమా ఎలా ఉందంటే...?
జీవితంలో మంచి, చెడు ప్రతి మనిషికి ఎదురు అవుతాయి. పరిస్థితుల ప్రభావం వల్ల ప్రయాణించే దారులు మారతాయి. అయితే... పరిస్థితుల ప్రభావంతో తప్పు చేసిన విలన్ మీద జాలి చూపించే సినిమా కాదిది. మంచి, చెడు వైపు నిలబడిన మనుషుల మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తుంది. ఓ విల‌న్‌కు అంద‌రూ రెస్పెక్ట్ ఇస్తున్నార‌ని అత‌డి గ్యాంగ్‌లో చేరిన ఓ బుడ్డోడు ఇచ్చే ఎక్స్‌ప్రెష‌న్ అందుకు ఉదాహ‌ర‌ణ‌. త‌ప్పు చేసిన రాజేంద్ర‌ప్ర‌సాద్‌, త‌న పిల్ల‌లు-మ‌న‌వ‌డి ముందు త‌ల ఎత్తుకోలేన‌ని ఎస్ఐ ముందు చెప్పే స‌న్నివేశం అందుకు ఉదాహ‌ర‌ణ‌. వయసు మీద పడిన తల్లిదండుల ఆరోగ్యం గురించి ఆరా తీయాలనే చిన్న సందేశం కూడా ఈ సినిమా ఇస్తుంది. రాజేంద్ర ప్రసాద్, నరేష్ అగస్త్యతో పాటు మిగతా నటీనటుల అద్భుత అభినయం, చక్కటి రచనకు తోడు మంచి దర్శకత్వం తోడు కావడంతో 'సేనాపతి' సినిమాను చూడొచ్చు. 'ప్రేమ ఇష్క్ కాదల్' వంటి అర్బన్ రొమాంటిక్ మూవీ తీసిన పవన్ సాధినేని, 'సేనాపతి'తో దర్శకుడిగా స‌ర్‌ప్రైజ్ చేస్తారు. రాజేంద్ర ప్రసాద్ కోసమైనా 'సేనాపతి' చూడాలి. 
Also Read: '83' మూవీ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే...?
Also Read: 'డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు' రివ్యూ: సినిమా ఎలా ఉంది?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి