సినిమా రివ్యూ: శ్యామ్ సింగ రాయ్
రేటింగ్: 3/5
నటీనటులు: నాని, సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ. జిష్షు సేన్ గుప్తా తదితరులు 
ఎడిటర్: నవీన్ నూలి
కథ: సత్యదేవ్ జంగా
సినిమాటోగ్రఫీ: సాను జాన్ వర్గీస్
సంగీతం: మిక్కీ జె మేయర్ 
నిర్మాత: వెంకట్ బోయినపల్లి 
దర్శకత్వం: రాహుల్ సంకృత్యాన్
విడుదల తేదీ: 24-12-2021


కరోనా, పరిస్థితుల కారణంగా నాని (nani) హీరోగా నటించిన 'వి', 'టక్ జగదీష్' ఓటీటీలో విడుదలయ్యాయి. బ్యాక్ టు బ్యాక్ రెండు ఓటీటీ రిలీజుల తర్వాత 'శ్యామ్ సింగ రాయ్'తో నాని థియేటర్లలోకి వచ్చారు. బెంగాల్ నేపథ్యం, నాని డ్యూయల్ రోల్, దేవదాసిగా సాయి పల్లవి, ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తి కలిగించాయి. మరి, సినిమా ఎలా ఉంది? రివ్యూ (Shyam Singha Roy Review) చూడండి.


కథ: వాసుదేవ్ గంటా (నాని) ఓ అప్ కమింగ్ డైరెక్టర్. షార్ట్ ఫిల్మ్ తీయాలని హీరోయిన్ రోల్ కోసం 200 మంది అమ్మాయిలను ఆడిషన్ చేస్తాడు. అనుకోకుండా కాఫీ షాపులో కీర్తీ (కృతీ శెట్టి)ని చూస్తాడు. ఆమె వెంట పడి మరీ తన షార్ట్ ఫిల్మ్ లో నటించేలా ఒప్పిస్తాడు. ఆ షార్ట్ ఫిల్మ్ చూసి ఓ నిర్మాత అతడికి దర్శకుడిగా అవకాశం ఇస్తాడు. ఉనికి అని వాసుదేవ్ ఓ సినిమా తీస్తాడు. అది పెద్ద హిట్ అవుతుంది. హిందీలో రీమేక్ చేయడానికి బాలీవుడ్ బడా నిర్మాత ఒకరు ముందుకు వస్తారు. విలేకరుల సమావేశంలో సినిమాను ప్రకటించే ముందు... పోలీసులు వచ్చి వాసుదేవ్ ను అరెస్ట్ చేస్తారు. అతడి సినిమా కథ 1970లలో శ్యామ్ సింగ రాయ్ రాసిన కథకు కాపీ అని సింగ రాయ్ వారసులకు చెందిన ఎస్ఆర్ పబ్లికేషన్స్ కేసు వేస్తుంది. శ్యామ్ సింగ రాయ్ (నాని) ఎవరు? అదే పోలికలతో ఉన్న వాసుదేవ్ ఎవరు? ఇద్దరి మధ్య సంబంధం ఏమిటి? శ్యామ్ సింగ రాయ్ రాసిన పుస్తకాలు చదవకుండా అతడి రాసిన కథలనే వాసుదేవ్ ఎలా రాశాడు? శ్యామ్ జీవితంలో రోజీ అలియాస్ మైత్రేయి (సాయి పల్లవి) ఎవరు? అనేది మిగతా సినిమా.


విశ్లేషణ: తెలుగులో, ఆ మాటకొస్తే భారతీయ భాషల్లో పునర్జన్మల నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. విజయాలు సాధించాయి. 'శ్యామ్ సింగ రాయ్' కూడా పునర్జన్మ నేపథ్యంలో వచ్చిన చిత్రమే. అయితే... గతంలో వచ్చిన సినిమాలకు, ఈ సినిమా తేడా ఏంటి? ఇందులో కొత్తదనం ఏముంది? అంటే... కథ. సాధారణంగా పునర్జన్మల నేపథ్యంలో మెజార్టీ శాతం రివేంజ్ డ్రామా ఉంటుంది. 'శ్యామ్ సింగ రాయ్'లో అది లేదు. కథా రచయిత సత్యదేవ్ జాంగా ఇందులో రివేంజ్ చూపించలేదు. పునర్జన్మ కాన్సెప్ట్‌కు దేవదాసి వ్యవస్థ నేపథ్యంలో ఓ ప్రేమకథను, సాహిత్యాన్నిజ్, బెంగాల్ నేపథ్యాన్ని జోడించారు. అదే సినిమాకు కొత్త కళ తీసుకొచ్చింది. అయితే... సినిమా ఫస్టాఫ్ అంతా సాధారణంగా సాగుతుంది. రొటీన్ లవ్ స్టోరీ తరహాలో ఉంటుంది. సెకండాఫ్‌లో అసలు కథ, 'శ్యామ్ సింగ రాయ్' జీవితం ఉంటుంది. అదే సినిమాకు ఆయువుపట్టు. అయితే... శ్యామ్ సింగ్ రాయ్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌కు ఇచ్చిన ముగింపు అంత క‌న్వీన్సింగ్‌గా అనిపించలేదు. సింపుల్‌గా తేల్చేసిన‌ట్టు ఉంటుంది. మంచి కథకు చక్కటి నటీనటులు తోడు కావడంతో సినిమా కనులకు విందుగా ఉంది.
Also Read: '83' మూవీ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే...?
నాని, సాయి పల్లవి (Sai Pallavi) నటన... వాళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ వల్ల 'శ్యామ్ సింగ రాయ్' ప్రేమ కథ మొదలైనప్పుడు చూడముచ్చటగా ఉంటుంది. కొంత సమయం గడిచిన తర్వాత చూసిన సన్నివేశాలు మళ్లీ మళ్లీ చూసినట్టు అనిపించినా... హీరో హీరోయిన్లు తమ నటనతో చూసేలా చేశారు. శ్యామ్ సింగ రాయ్ పాత్రలో నాని చక్కగా నటించారు. రెండు పాత్రల మధ్య బాడీ లాంగ్వేజ్, యాక్టింగ్ పరంగా డిఫరెన్స్ చూపించారు. నటుడిగా ఈ కథకు న్యాయం చేశారు. సాయి పల్లవి మరోసారి పాత్రలో ఒదిగిపోయారు. ముఖ్యంగా 'ప్రణవాల్య...' పాటలో ఆమె అభినయం గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. అభినయం పరంగానూ ప్రేక్షకుల మనసు దోచుకుంటారు. కృతీ శెట్టిది అతిథి పాత్ర కంటే ఎక్కువ... కథానాయిక పాత్ర కంటే తక్కువ అన్నట్టు ఉంది. ఉన్నంతలో అందంగా కనిపించారు. నానితో లిప్ లాక్, రొమాంటిక్ సీన్స్ చేశారు. మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్ కాదు... సినిమాలో ఆమెది కీలక పాత్ర అంతే! రాహుల్ రవీంద్రన్, అభినవ్ గోమఠం, మురళీ శర్మ తదితరులు పాత్రల పరిధి మేరకు చేశారు.
Also Read: 'లక్ష్య' రివ్యూ: లక్ష్యం నెరవేరిందా? గురి తప్పిందా?
దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ డిఫరెంట్ పాయింట్‌ను నీట్‌గా ప్ర‌జెంట్ చేశారు. రిపీటెడ్ సీన్స్ లేకుండా చూసుకుంటే బావుండేది. స్క్రీన్ ప్లే కూడా పర్వాలేదు. అయితే... సినిమాను నిదానంగా ముందుకు తీసుకువెళ్లాడు. అతడికి ఆర్ట్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ నుంచి ఫుల్ సపోర్ట్ లభించింది. కోల్‌క‌తా, బెంగాల్ ప్రాంతాలను తెరపై చూపించిన విధానం బావుంది. మిక్కీ జె మేయర్ అందించిన స్వరాల్లో... దివంగత లిరిసిస్ట్ 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి రాసిన 'ప్రణవాల్య...', 'సిరివెన్నెల...' పాటలను అందంగా చిత్రీకరించారు. గతంలో ఆయన ఎన్నో గొప్ప పాటలు రాశారు. అయితే... ఆయన చివరి రోజుల్లో రాసిన పాటలు కావడంతో శ్రద్ధగా వింటాం. చక్కటి అనుభూతి ఇస్తాయి. ఆల్రెడీ చెప్పుకొన్నట్టు... ఆ పాటల్లో సాయి పల్లవి అద్భుతంగా చేశారు. పాటలను పక్కన పెడితే... తన నుంచి ఎవరూ ఊహించని విధంగా మిక్కీ జె మేయర్ నేపథ్య సంగీతం అందించారు. ముఖ్యంగా శ్యామ్ సింగ రాయ్ ఎపిసోడ్ నేపథ్య సంగీతం బావుంది. సినిమా నిడివి కొంచెం తగ్గించి... వేగంగా కథను నడిపితే బావుండేది.
Also Read: 'పుష్ప' రివ్యూ: సినిమా ఎలా ఉందంటే...?
'శ్యామ్ సింగ రాయ్' టైటిల్ సాంగ్‌లో 'ఎగసి ఎగసి పడు అలజడి వీడు... తిరగబడిన సంగ్రామం వీడు' వంటి సాహిత్యం విని ఇది యాక్షన్ సినిమా అనుకోవద్దు. ఇదొక స్వచ్ఛమైన, అందమైన ప్రేమకథ. నాని, సాయి పల్లవి లాంటి చక్కటి జంట తోడు కావడంతో సెకండాఫ్ బావుంటుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మంచి ఫీల్ ఉంటుంది. క్లైమాక్స్ కాస్త డిఫ‌రెంట్‌గా ఉంటుంది.
Also Read: 'డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు' రివ్యూ: సినిమా ఎలా ఉంది?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి