Suhas and Saranya Pradeep starrer Ambajipeta Marriage Band Review: సుహాస్ కెరీర్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి మొదలైంది. తర్వాత సినిమాల్లోకి వచ్చారు. తొలుత హీరో స్నేహితుడిగా కొన్ని సినిమాలు చేశారు. 'కలర్ ఫోటో', 'రైటర్ పద్మభూషణ్'తో హీరోగా విజయాలు అందుకున్నారు. మధ్యలో 'హిట్: ది సెకండ్ కేస్'లో విలన్ రోల్ చేశారు. సుహాస్ హీరోగా నటించిన తాజా సినిమా 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'. శివాని నాగరం హీరోయిన్. శరణ్య ప్రదీప్, నితిన్ ప్రసన్న, 'పుష్ప' ఫేమ్ జగదీశ్ ప్రతాప్ బండారి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఎలా ఉంది?


కథ: మల్లిగాడు (సుహాస్), పద్మ (శరణ్య ప్రదీప్) కవలలు. తండ్రికి సెలూన్ షాప్ ఉంది. పద్మ స్కూల్ టీచర్ అయితే... అంబాజీపేట మ్యారేజీ బ్యాండు ట్రూప్ మెంబర్ మల్లి. కొబ్బరికాయ, సిమెంట్ వ్యాపారాలతో పాటు ఎక్కువ వడ్డీకి అప్పులు ఇస్తుంటాడు వెంకట బాబు (నితిన్ ప్రసన్న). ఆయన చెప్పడంతో పద్మ ఉద్యోగం పర్మినెంట్ అయ్యిందని, ప్రతి ఆదివారం ఆయన దగ్గరకు వెళ్లి వ్యాపారాలకు సంబంధించిన లెక్కలు రాస్తుండటంతో వాళ్లిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని ఊరిలో పుకారు పుడుతుంది. ఇదిలా ఉండగా... తరగతి గదుల్లో సిమెంట్ బస్తాలు వేయవద్దని చెప్పడంతో పద్మ, వెంకట బాబు తమ్ముడు శ్రీను బాబు (వినయ్ మహాదేవ్) మధ్య గొడవ అవుతుంది. ఆ గొడవకు తోడు చెల్లెలు లక్ష్మి (శివాని నాగరం), మల్లి ప్రేమలో ఉన్న సంగతి వెంకట బాబుకు తెలుస్తుంది.


మల్లి, పద్మ తమకంటే తక్కువ మనుషులని వాళ్లను ముట్టుకోవడానికి ఆలోచించే వెంకట బాబు... పద్మను ఒంటరిగా తరగతి గదికి పిలిచి అవమానిస్తాడు. అక్కకు జరిగిన అవమానం తెలిసిన సుహాస్ ఏం చేశాడు? అసలు పద్మను వెంకట బాబు ఏం చేశాడు? మల్లికి ఎందుకు గుండు కొట్టాడు? ఈ గొడవలో ఊరి జనాలు ఎవరి వైపు నిలబడ్డారు? చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 


విశ్లేషణ: మనుషుల మధ్య అంతరాలు, కులాల గొడవలు, అణచివేత నేపథ్యంలో తమిళంలో రా & రస్టిక్ సినిమాలు వస్తున్నాయి. పా రంజిత్, వెట్రిమారన్, మారి సెల్వరాజ్ వంటి దర్శకులు తీసే సినిమాలకు మన తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. టాలీవుడ్‌లో అటువంటి సినిమాలు రావా? అంటే... 'రంగస్థలం', 'పలాస' వంటివి కనిపిస్తాయి. ఆ కోవలో వచ్చిన మరో సినిమా 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'.


సినిమా ప్రారంభం సాదాసీదాగా ఉంటుంది. విశ్రాంతి ముందు వరకు ప్రేమకథే. కాసేపటిలో ఇంటర్వెల్ కార్డు పడుతుందనగా... ఒక్కసారిగా టర్న్ తీసుకుంది. ఆ తర్వాత ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ అందిస్తుంది. తెలుగుకు 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' కొత్త. తమిళ సినిమా తరహా కథను కమర్షియల్ అంశాలతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు దుష్యంత్ కటికినేని. ఫస్టాఫ్ ప్రేమ కథ కొత్తగా కనిపించదు. కానీ, కామెడీ వర్కవుట్ అయ్యింది. ప్రీ ఇంటర్వెల్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు ఆసక్తిగా చూసేలా తీశారు. రైటింగ్‌ బావుంది. సంభాషణల్లో కొన్ని ఆలోచింపజేసేలా ఉన్నాయి. శరణ్య, గాయత్రి భార్గవి మధ్య సన్నివేశం అందుకు ఉదాహరణ. కులం తక్కువ అని కొందర్ని ఎలా చూస్తారనేది క్లుప్తంగా చెప్పారు.


కులాల పేర్లు అసలు ప్రస్తావించలేదు. కానీ, కులాల మధ్య అంతరాన్ని తెరపై స్పష్టంగా చూపించారు. అయితే... అక్కా తమ్ముళ్ల మధ్య అనుబంధాన్ని మరింత ఆవిష్కరిస్తే బావుండేది. తమిళ దర్శకుల తరహాలో పూర్తిగా సహజంగా తీయలేదు. కొన్ని సన్నివేశాల్లో కమర్షియాలిటీ కాస్త ఇబ్బంది పెట్టింది. ముఖ్యంగా క్లైమాక్స్. అది వాస్తవానికి కాస్త దూరంగా అనిపిస్తుంది. కథ నుంచి పక్కకు వెళ్లలేదు. దాంతో కొన్ని సీన్లు, స్క్రీన్ ప్లే ఊహించడం కష్టం ఏమీ కాదు. అయితే, నటీనటులతో పాటు సాంకేతిక నిపుణుల ప్రతిభను పూర్తిస్థాయిలో రాబట్టుకున్నారు దుష్యంత్. 


శేఖర్ చంద్ర సంగీతం సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. పాటలతో పాటు నేపథ్య సంగీతం బావుంది. అలాగే, సినిమాటోగ్రఫీ & ఎడిటింగ్ కూడా! నిర్మాతలు ఖర్చు బాగా చేశారు. అది స్క్రీన్ మీద కనిపిస్తుంది. 


మల్లిగాడు పాత్రకు సుహాస్ పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. గుండు కొట్టించుకుని ఆ పాత్రను ఎంతగా ప్రేమించినదీ చెప్పారు. నటనలోనూ ఆ ప్రేమ చూపించారు. తొలుత సాదాసీదా యువకుడిగా, ప్రేమికుడిగా సహజంగా నటించారు. తర్వాత అక్క కోసం ఎంత దూరమైనా వెళ్లే తమ్ముడిగా ఇంటెన్స్ యాక్టింగ్ చేశారు. 


శరణ్య ప్రదీప్ నటనకు విజిల్స్, క్లాప్స్ గ్యారెంటీ. ముఖ్యంగా సెకండాఫ్‌లో పోలీస్ స్టేషన్ సీన్ గూస్ బంప్స్ ఇస్తుంది. శరణ్య పవర్ హౌస్ లాంటి పెర్ఫార్మర్. ఆమె పొటెన్షియల్ ఈ స్థాయిలో ఆవిష్కరించే రోల్ ఇప్పటి వరకు రాలేదు. ఒక దశలో సినిమాకు అసలైన హీరో శరణ్య అనిపిస్తుంది. 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'లో మరో పవర్ హౌస్, టాలెంటెడ్ ఆర్టిస్ట్ నితిన్ ప్రసన్న. వెంకట బాబు పాత్రకు ప్రాణం పోశారు. ఆయన బదులు మరొకర్ని ఆ పాత్రలో ఊహించుకోలేం.


Also Readఇండియన్ పోలీస్ ఫోర్స్ రివ్యూ: సింగమ్ ఫ్రాంఛైజీతో హిట్స్ అందుకున్న రోహిత్ శెట్టి మరీ ఇంత సిల్లీ సిరీస్ తీశాడా?


శివాని నాగరం క్యూట్ లుక్స్, ఇంప్రెసివ్ నటనతో ఆకట్టుకున్నారు. ప్రామిసింగ్ హీరోయిన్స్ లిస్టులో ఆమె పేరు యాడ్ చేయవచ్చు. బ్రేకప్ సీన్ బాగా చేశారు. దాంతో ఎమోషనల్ సీన్స్ బాగా చేయగలనని ప్రూవ్ చేశారు. 'పుష్ప' ఫేమ్ జగదీశ్ మరోసారి మంచి నటనతో ఆకట్టుకున్నారు. గోపరాజు రమణ, సురభి ప్రభావతి, కిట్టయ్య తదితరులు తమ తమ పాత్రల పరిధి మేరకు చేశారు.


సాధారణ ప్రేమ కథగా మొదలైన 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'... ఎమోషనల్ హై ఇచ్చి థియేటర్ల నుంచి ఇంటికి పంపిస్తుంది. మనిషిని మనిషిగా చూడాలని, గౌరవం ఇవ్వాలని సందేశం ఇస్తుంది. కథ, సందేశం పక్కన పెడితే...  శేఖర్ చంద్ర సాంగ్స్ & ఆర్ఆర్ సూపర్బ్. సుహాస్, శరణ్య ప్రదీప్, నితిన్ ప్రసన్న అద్భుతంగా నటించారు.


Also Readకాదల్ ది కోర్ రివ్యూ: అమెజాన్ ఓటీటీలో మమ్ముట్టి గే రోల్ చేసిన సినిమా