Upasana: మెగా కోడలు ఉపాసన కొణిదెల తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్‌ను రాజ్ భవన్‌లో కలిశారు. గురువారం ఉపాసన రాజ్ భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు ప్రత్యేక జ్ఞాపికను బహుకరించారు. గిరిజనుల కోసం గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ఉపాసన అన్నారు.


గిరిపుత్రుల సంక్షేమం, అభివృద్ధి కోసం గవర్నర్‌ తమిళి సై చేస్తున్న పనులు తన మనసును కదిలించాయని ఉపాసన కొణిదెల పేర్నొన్నారు. ఆవిడ చేస్తున్న పనులకు మనస్ఫూర్తిగా అభినందనలు అంటూ గవర్నర్‌ను కలిసిన ఫొటోలను తన ఎక్స్ / ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు మెగా కోడలు ఉపాసన. ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉన్న గిరిజన గ్రామాలను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ దత్తత తీసుకున్నారు. తెలంగాణ రాజ్ భవన్ తరుపున నాగర్ కర్నూలు జిల్లాలో ఆరు చెంచు గిరిజన గ్రామాలను దత్తత తీసుకున్న తమిళిసై అక్కడ తరచూ పర్యటిస్తూనే ఉన్నారు. నిధులు కేటాయిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. విద్య, వైద్యం వంటి మౌలిక వసతులు కల్పిస్తూ గిరిపుత్రుల జీవన ప్రమాణాలను పెంచుతున్నారు. ఈ విషయంలపై ఉపాసన గవర్నర్‌ను కలిసి ప్రశంసలు తెలిపారు.


మెగా స్టార్‌ చిరంజీవికి కూడా ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలను గుర్తించి ఈ అవార్డుకు మెగా స్టార్ చిరంజీవిని ఎంపిక చేశారు. ఉపాసన తాతగారు, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ వ్యవస్థాపక ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి 2010లోనే పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు తన మామయ్య చిరంజీవి పద్మ విభూషణ్ అందుకోవడంతో ఉపాసన ఆనందంలో మునిగిపోయారు.