Prime Video Originals Ae Watan Mere Watan review in Telugu: సారా అలీ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన దేశభక్తి సినిమా 'ఏ వతన్ మేరే వతన్'. స్వాతంత్ర్య పోరాటంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా అండర్ గౌండ్ రేడియో నిర్వహణ ద్వారా ఉద్యమకారుల్లో ఉత్సాహం నింపిన ఉషా మెహతా జీవితం స్ఫూర్తితో రూపొందింది. ఉషా పాత్రలో సారా అలీ ఖాన్ నటించగా... రామ్ మనోహర్ లోహియా పాత్రలో ఇమ్రాన్ హష్మీ నటించారు. ఈ దేశభక్తి సినిమా ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.


కథ (Ae Watan Mere Watan Story): 1942లో... అవి క్విట్ ఇండియా ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజులు. మహాత్మా గాంధీ ఇచ్చిన 'డూ ఆర్ డై' (కరో యా మరో) పిలుపుతో  22 ఏళ్ల ఉషా మెహతా (సారా అలీ ఖాన్) సైతం ఉద్యమంలో భాగం అవుతుంది. ఆమె తండ్రి (సచిన్ ఖేడేకర్) బ్రిటిష్ ప్రభుత్వంలో జడ్జ్. ఆయన్ను ఎదిరించి మరీ దేశం తరఫున పోరాటానికి వెళుతుంది. కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా రేడియో స్టేషన్ నిర్వహిస్తుంది. ఆమెకు రామ్ మనోహర్ లోహియా (ఇమ్రాన్ హష్మీ) నుంచి ఎటువంటి మద్దతు లభించింది? రేడియో నిర్వాహకులను పట్టుకోవడం కోసం ముంబై ఇన్‌స్పెక్టర్ (అలెక్స్ ఓ నీల్) ఏం చేశారు? ఈ ప్రయాణంలో ఉషాను ప్రేమించిన కౌశిక్ (అభయ్ వర్మ), ఫహాద్ (స్పార్ష్ శ్రీవాత్సవ్) పాత్రలు ఏమిటి? చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 


విశ్లేషణ (Ae Watan Mere Watan Telugu Review): 'కొంత మందికి విప్లవం అంటే ప్రేమ. ఇంకొంత మందికి ప్రేమే విప్లవం' - పతాక సన్నివేశాలకు ముందు కౌశిక్ చెప్పే మాట. ఉషా మీద ప్రేమతో ప్రాణ త్యాగానికి అతడు సిద్ధపడితే... దేశం మీద ప్రేమతో ప్రాణాలకు తెగించి ఉషా మెహతా ఏం చేశారు? అనేది సినిమా. భారత స్వాతంత్ర్య పోరాటంలో ఎందరో పాల్గొన్నారు. అయితే... కొందరి కథలే ప్రజలకు తెలుసు. చరిత్రపుటల్లో ప్రజలకు తెలియని గొప్ప పోరాట యోధుల కథలను ఈ మధ్య వెండితెరకు తీసుకొస్తున్నారు. అటువంటి కథే 'ఏ వతన్ మేరే వతన్'.


'ఏ వతన్ మేరే వతన్' దర్శకుడు కణ్ణన్‌ అయ్యర్‌, రచయిత ఫరూఖ్‌ ఆలోచన, ఉద్దేశం చాలా గొప్పవి. ఉషా మెహతాతో పాటు రామ్ మనోహర్ లోహియా పోరాటాన్ని తెరపైకి తీసుకొచ్చి, ఈ తరం ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే... ఆచరణలో విజయానికి సుదూరంలో నిలిచారు. సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్‌లో దేశభక్తి కలిగించడంలో సినిమా విఫలమైంది. ప్రొడక్షన్ డిజైన్, మ్యూజిక్, నిర్మాణ విలువలు బావున్నాయి. కానీ, కోర్ పాయింట్ మిస్ అయ్యింది. ప్రేక్షకులకు దగ్గర కాలేదు.


ఉషా మెహతా పాత్రకు సారా అలీ ఖాన్ పూర్తి స్థాయిలో న్యాయం చేయలేదు. ఆమె రూపం బావుంది. కానీ, నటనలో దేశభక్తి కనిపించలేదు. పోరాటంలో తెగువ చూపే సన్నివేశాల్లో వీరత్వానికి బదులు అమాయకత్వం కనిపించింది. అందువల్ల, తెరపై జరిగే పోరాటంలో, స్వాతంత్ర్య సమరంలో ప్రేక్షకుడు ప్రయాణించడం కష్టంగా మారింది. రామ్ మనోహర్ లోహియాగా ఇమ్రాన్ హష్మీ నటన బావుంది. అయితే, ఆయన స్క్రీన్ ప్రజెన్స్ తక్కువే. మిగతా నటీనటులు సైతం తమ పాత్రల పరిధి మేరకు నటించారు. కానీ, కథతో ట్రావెల్ అయ్యేలా కథనం, సన్నివేశాలు లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్.


Also Read: మమ్ముట్టిని అరెస్ట్ చేసిన జయరామ్ - మలయాళంలో 40 కోట్లు వసూలు చేసిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?


'ఏ వతన్ మేరే వతన్' మెయిన్ ప్రాబ్లమ్.... ఉషా పోరాటాన్ని దర్శకుడు సరైన రీతిలో ఆవిష్కరించలేకపోవడం. తండ్రిని ఎదిరించిన తరుణంలో దేశంపై ఆమెకున్న ప్రేమను, ఆమె వ్యక్తిత్వాన్నిబలంగా ఆవిష్కరించే వీలు దొరికింది. దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. సంభాషణలు సినిమాకు బలాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత రేడియో స్టేషన్ నిర్వాహకులను పోలీసులు పట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు క్యాట్ అండ్ మౌస్ గేమ్ తరహాలో ఉంది కానీ ఉత్కంఠ కలిగించలేదు. పతాక సన్నివేశాలు సైతం ప్రభావంతంగా లేవు.


ఉషా మెహతా ఎవరో తెలియని ప్రజలు ఆమె చరిత్ర తెలుసుకోవడానికి 'ఏ వతన్ మేరే వతన్' చూడవచ్చు. చరిత్రతో పాటు సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే ప్రేక్షకులు అయితే డిజప్పాయింట్ అవుతారు. రెండుంపావు గంటల సినిమా చూసినా నిడివి ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది.పేరున్న నటీనటులు, నిర్మాతలు కలిసి చేసిన డాక్యుమెంటురీ తరహాలో ఉందీ సినిమా.


Also Readతంత్ర రివ్యూ: ప్రతి పౌర్ణమికి రక్తం తాగే పిశాచి వస్తే - అనన్య సినిమా హిట్టా? ఫట్టా?