AP CEO Mukesh Kumar Meena Reacts on Ustad Bhagat Sing : పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ నటించిన ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ సినిమా టీజర్‌ రెండు రోజుల క్రితం రిలీజ్ అయి వండర్స్ క్రియేట్ చేస్తోంది. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. అందులో చెప్పిన డైలాగ్స్‌, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలపై ప్రభావం చూపుతుందని అందుకే దానిపై ఏం చర్యలు తీసుకున్నారని ఎన్నికల అధికారిని ప్రశ్నిస్తే తాము పరిశీలిస్తామన్నారు.  


ఊపేసిన గాజు గ్లాసు, సైన్యం డైలాగ్స్


జనసేన అధినేతగా ఉన్న పవన్ కల్యాణ్, ఓవైపు రాజకీయాలను చేస్తూనే సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చి ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. అయితే ఆయన ఫ్యాన్స్‌ కోసం రెండు రోజుల క్రితం ఉస్తాద్‌ భగత్‌సింగ్ టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. గాజు గ్లాస్‌పై చెప్పిన డైలాగ్స్‌ ఫ్యాన్స్‌ను ఎంతలా ఆకట్టుకున్నాయో... ప్రత్యర్థులను అంతే స్థాయిలో గుచ్చుకుంటున్నాయి.


ఆరా తీస్తామన్న మీనా 



ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత తొలిసారిగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్ర ఎన్నికల అధికారి ముకేష్‌కుమార్ మీనాను ఉస్తాద్ భగత్‌సింగ్‌పై ప్రశ్నలు సంధించింది మీడియా. జనసేన గుర్తు అయిన గాజు గ్లాస్‌పై ఉస్తాద్‌ భగత్‌ సింగ్ సినిమాలో డైలాగ్స్ చెప్పించారని ఇది ఎన్నికల ప్రచారం కిందికి రాదా అని ప్రశ్నించారు. దీన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు మీనా.  


ముకేష్ కుమార్ మీనా ఏమన్నరంటే..." నేను ఆ వీడియోను చూడలేదు కాబట్టి దీనిపై కామెంట్ చేయలేను. కానీ గ్లాస్‌ చూపించి దీని ద్వారా పబ్లిసిటీ చేస్తే పొలిటికల్ అడ్వర్టైజింగ్‌ కిందకు వస్తుంది. పొలిటికల్‌ అడ్వర్టైజింగ్‌లపై బ్యాన్ ఏమీ లేదు. కానీ ఇలా చేయాలంటే ముందు పర్మిషన్ తీసుకోవాలి. దాని(ఉస్తాద్‌ వీడియో)పై నాకు అవగాహన లేదు. చూసిన తర్వాత ఒకవేళ అది పొలిటికల్ అడ్వర్టైజ్‌మెంట్‌ కిందకు వస్తే కచ్చితంగా నోటీసు ఇస్తాం. ప్రీ సర్టిఫికేషన్ కోసం అప్లై చేసుకోవాలని చెబుతాం. వాళ్లు ఏ ఉద్దేశంతో దీన్ని క్రియేట్ చేశారో అనేది తెలియదు. ఎవరైన ఫిర్యాదు చేస్తే చూసేవాళ్లం. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మేం చూస్తాం. చూసిన తర్వాత అది ఎలా ఉంది. అందులో ఏం చెప్పారో పరిశీలిస్తాం.  మే కూర్చున్న టేబుల్, మాట్లాడుతున్న మైక్ ఫ్యాన్, సైకిల్ ఇలా రోజు వారీగా వాడే వస్తువులన్నీ ఎన్నికల గుర్తులే. అలాగని అన్నింటికీ ప్రచారం చేస్తున్నారని పరిగణించలేం. కేస్‌ టు కేస్‌ చూడాల్సి ఉంటుంది. " అని అన్నారు.