Heart Attack Causes: కోవిడ్-19తో ప్రపంచం ఎంతగా అల్లాడిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాని ప్రభావం తగ్గిన తర్వాత ధైర్యంగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు. అయితే, ఈ మహమ్మారి ఉనికి మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. కరోనాకు గురై.. చికిత్సతో బయటపడిన చాలామంది ఇంకా ప్రమాదపు అంచుల్లోనే ఉన్నారు. వైరస్ వల్ల పాడైన అవయవాలు.. ఎప్పుడు ఏ క్షణంలో మొరాయిస్తాయో చెప్పలేని పరిస్థితి. అలాగే, వైరస్‌ను కంట్రోల్ చేయడానికి తీసుకున్న వ్యాక్సిన్స్ వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత అనేది కచ్చితంగా తెలియకపోయినా.. ఇటీవల పెరుగుతోన్న గుండె సమస్యల సంఖ్యను పరిశీలిస్తే ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదని అర్థమవుతుంది. చాలామంది చిన్న వయస్సులోనే హార్ట్ ఎటాక్‌కు గురవ్వుతున్నారు. కాబట్టి, మనం మన గుండెను కాపాడుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి, వ్యసనాలకు దూరంగా ఉండటమే కాకుండా.. సమయానికి భోజనం చేయడం, నిద్రపోవడం చేయాలి. శరీరానికి అవసరమైన పోషకాలు అందించే ఆహారాన్ని తినాలి.
టైమ్‌కు భోజనం చేస్తే చాలు
బిజీ లైఫ్‌లో చాలామంది సమయానికి భోజనం చేయడం లేదు. అది కూడా గుండెపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్.. వంటి సమస్యలకు గురికాకూడదంటే.. మీరు తప్పకుండా మీ భోజన సమయాలను మార్చుకోవాలి. రోజూ వీలైనంత త్వరగానే భోజనం ముగించాలి. అలాగే అల్పాహారం విషయంలో కూడా ఆలస్యం వద్దు. నిద్ర లేచిన గంటలోనే అల్పాహారాన్ని తినేయాలి. అలాగే మధ్యాహ్నాలు మరీ ఆలస్యం చేయకుండా త్వరగా తినేయాలి. రాత్రి నిద్ర పోవడానికి రెండు గంటల ముందే మీరు డిన్నర్ తినేయాలి.
సమయానికి తినకపోతే.. ఆ వ్యాధుల ముప్పు తప్పదు
సమయానికి మనం భోజనం చేయకపోతే డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధులకు గురికావల్సి వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గుండె ప్రమాదంలో పడుతుంది. మన భోజనం చేసే వేళల్లో తేడా వస్తే.. సిర్కాడియన్ రిథమ్‌లు గాడి తప్పుతుంది. ఫలితంగా ఆరోగ్యం చెడిపోతుంది. ఇటీవల నిర్వహించిన న్యూట్రీనెట్-శాంటీ స్టడీలో సుమారు 1.03 లక్షల మంది హెల్త్ డేటాను పరిశీలించగా కీలక విషయాలు బయటపడ్డాయి.
వాయిదా వేస్తే అంత సంగతులు
చాలామంది పనిలో పడి భోజనం వేళలను వెనక్కి నేట్టేస్తారు. ఒంటి గంటకు చేయాల్సిన భోజనాన్ని 2 గంటలకో 3 గంటలకో తింటారు. దాని వల్ల ప్రతి గంటకు హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఆరు శాతం ఉన్నట్లు ఐరోపా శాస్త్రవేత్తలు వెల్లడిచారు. అంటే ఒకరు ఉదయం 7 గంటలకు టిఫిన్, మరొకరు 9 గంటలకు తిన్నట్లయితే.. రెండో వ్యక్తికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు 12 శాతం ఉంటుందట. ఒక వేళ మూడు గంటలు వాయిదా వేసి తింటే ఆ ముప్పు 18 శాతానికి పెరుగుతుందట.
భోజనం వేళలు మారితే మరింత ప్రమాదకరం
అల్పాహారమే కాదు.. రాత్రి భోజన వేళలు మారినా సరే ప్రమాదమే. రాత్రి ఆలస్యంగా తినేవారిలో స్ట్రోక్, బ్రెయిన్ అనూరిజం వంటి సెరెబ్రోవాస్కులర్ వ్యాధుల ప్రమాదం 28 శాతం పెరిగినట్లు అధ్యయనంలో తేలింది. భోజనానికి గ్యాప్ ఇవ్వడం వల్ల అనవసరమైన చిల్లర తిళ్లు తినే అలవాటు పెరుగుతుందని, అది మరింత ప్రమాదకరమని నిపుణులు వెల్లడించారు. భోజన వేళలు మారడం వల్ల గుండె, రక్త ప్రసరణ సంబంధిత వ్యాధుల తీవ్రత పెరుగుతుందని హెచ్చరించారు.
ఈ వేళల్లో తింటే బెటర్
మన శరీరంలో జీర్ణక్రియ, పోషకాల శోషణలకు నిర్దిష్ట సమయం ఉంటుందని.. అది తప్పినట్లయితే శరీరంలో సమయానికి జరగాల్సిన ప్రక్రియలన్నీ గందరగోళానికి గురవ్వుతాయని నిపుణులు పేర్కొన్నారు. మన శరీర సిర్కాడియన్ రిథమ్‌లు మనం తీసుకొనే ఆహార వేళలు, రాత్రి నిద్రించే సమయంపై ఆధారపడి ఉంటాయి. వాటికి ఎలాంటి అంతరాయం ఏర్పడినా గుండె జబ్బులు వస్తాయి. కాబట్టి, నిత్యం అల్పాహారం 7 గంటలకు.. మధ్యాహ్నం 1 గంటకు.. రాత్రి 8 లోపు భోజనం చేయాలి. డిన్నర్ చేసిన 2 గంటల తర్వాత నిద్రపోవాలి.
Also Read: ఉదయం నిద్రలేస్తున్నప్పుడు ఇలా అనిపిస్తోందా? మీకు ఈ వ్యాధి ఉన్నట్లే, డాక్టర్‌ను కలవండి