Telangana CM Revanth Reddy Speech on Drugs: హైదరాబాద్: ఉమ్మడి ఏపీలో గంజాయి, డ్రగ్స్ మాఫియా లేకుండే.. ఏదో చోట లిక్కర్ సమస్య ఉండేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) వ్యాఖ్యానించారు. కానీ టీఆర్ఎస్ పాలనతో రాష్ట్రంలో ఎటు చూసినా గంజాయి దాడులేనని, సింగరేణి కాలనీలో పసిపాపపై గంజాయి మత్తులో లైంగిక దాడి జరగడం దురదృష్టకరం అన్నారు. తెలంగాణలో దొరుకుగుతున్న డ్రగ్స్ కు బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ వైఫల్యమే కారణమని విమర్శించారు. డ్రగ్స్ కు సంబంధించి సిట్ ఏర్పాటు చేసి, ఆ అధికారిని అర్ధాంతరంగా ఎక్కడికి పంపించారని ప్రశ్నించారు. విచారణలో లోపాలను బయటపెట్టడానికి గతంలో హైకోర్టును ఆశ్రయించామన్నారు. 


హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా గత ప్రభుత్వం డ్రగ్స్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు, హార్డ్ డిస్కులను ఈడీకి ఇవ్వలేదని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించిన మాట నిజం కాదా అని రేవంత్ రెడ్డి నిలదీశారు. పంజాబ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ నాశనం చేసిందని, పేద మహిళలు సైతం కుటుంబంలో మగవారికి డ్రగ్స్ కోసం డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. కనుక రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి లాంటివి లేకుండా చూడాలని, వారి వెనుక ఎంత పెద్దవారున్నా బయటకు లాగి చర్యలు తీసుకుందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కానీ ఇలాంటి చర్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతుండగా, ప్రతిపక్షాలు దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారని రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. 


సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ కౌంటర్..
డ్రగ్స్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేసిందన్నట్లు మాట్లాడుతున్నారు, కానీ సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడే టీఎస్ న్యాబ్ ను అడిషనల్ డీజీపీ స్థాయి వ్యక్తి సీవీ ఆనంద్ ను అపాయింట్ మెంటె చేశామన్నారు. పంజాబ్ లో నిన్న మొన్నటివరకు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని రేవంత్ కు తెలియదన్నారు. ఉడ్తా పంజాబ్ అనే సినిమా కూడా పంజాబ్ లో డ్రగ్స్ సమస్యపై వచ్చిందని కేటీఆర్ గుర్తుచేశారు. డ్రగ్స్ పై చర్యలు, ఉక్కుపాదం మోపాలని బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేకుండా యాంటో నార్కోటిక్ బ్యూరో లాంటివి ఎందుకు ఏర్పాటు చేస్తాం, సీవీ ఆనంద్ లాంటి అధికారికి బాధ్యతలు ఎందుకు అప్పగిస్తామన్నారు కేటీఆర్. 


షీ టీమ్స్, డ్రగ్స్ కు సంబంధించిన అంశంపై సైతం కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భిన్నాభిప్రాయాలు అని ప్రస్తావించారు. మేం మా అభిప్రాయాలు చెప్పనిదే భిన్నాభిప్రాయాలు ఎలా వచ్చాయో తనకు తెలియడం లేదన్నారు. తాము ఏర్పాటు చేసిన సంస్థపై కాంగ్రెస్ క్రెడిట్ కోసం ప్రయత్నిస్తుందన్నారు. మేం ఏం మాట్లాడినా మేనేజ్ మెంట్ కోటా అని అంటున్నారు. అయితే ఢిల్లీకి వెళ్లి టీపీసీసీ చీఫ్ పదవి తెచ్చుకున్నది ఎవరు, పేమెంట్ కోటాలో రేవంత్ రెడ్డి ఆ పదవి తెచ్చుకున్నారని ఆ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. 


 డ్రగ్స్ విషయంపై సహకరించాలని కోరితే పరివర్తనలో మార్పు వస్తుందని భావించానని, కానీ కేటీఆర్ తనను నిరాశ పరిచారని రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఎస్ న్యాబ్ అని పేపర్ పై  వివరాలు పొందుపర్చి, సీవీ ఆనంద్ కు అడిషనల్ ఛార్జ్ ఇచ్చారని రేవంత్ చెప్పారు. 300 మంది సిబ్బందిని ఇస్తే డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని సంబంధిత అధికారి ప్రభుత్వానికి చెబితే.. ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని రేవంత్ రెడ్డి అసలు విషయాన్ని వెల్లడించారు. సిబ్బంది, వాహనాలకు ఎంత ఖర్చయినా వెచ్చించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. డ్రగ్స్ లాంటి విషయాల్లోనూ రాజకీయాలు చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు.