రాత్రిపూట ఎంత నిద్రపోయినా ఉదయం బద్దకంగా నిద్రలేస్తున్నారా? వేకువజామున త్వరగా మేల్కొవడం మీ వల్ల కాలేకపోతుందా? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్లే. ఈ సమస్యలుంటే తప్పకుండా మీరు డాక్టర్‌ను సంప్రదించాలి. లేదంటే మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


ముందు రోజు రాత్రి మీరు ఎంత ఎక్కువసేపు నిద్రపోయినప్పటికీ.. మరుసటి రోజు ఉదయం పూట బద్దకంగా నిద్రలేవడం లేదా బాగా అలసిపోయినట్లు ఉండటం లాంటి లక్షణాలు మీకు ఉన్నాయంటే ఖచ్చితంగా మీకు ఇడియోపతిక్ హైపర్సోమ్నియా అనే వ్యాధి ఉన్నట్లేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది గతంలో చాలా అరుదుగా వచ్చే నాడీకి సంబంధిత డిజార్డర్‌గా పరిగణించేవారు. కానీ తాజా పరిశోధనల ప్రకారం ఇది మూర్ఛ లేదా బైపోలార్ వంటిదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.


ఈ వ్యాధి ఉన్నవారిలో కనిపించే లక్షణాలివే


ఈ వ్యాధి ఉన్న వ్యక్తులలో ఎక్కువగా పగటిపూట నిద్రపోవడం. నిద్రపోయిన తర్వాత మేల్కొనడానికి చాలా ఇబ్బంది పడటం. లేదంటే నిద్ర లేచిన వెంటనే గందరగోళంగా, దిక్కుతోచని విధంగా అనిపించడం వంటివి ఈ వ్యాధి లక్షణాలు అని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ లక్షణాలను కలిగి ఉండటం వలన వ్యక్తులు తమ రోజువారీ కార్యకలాపాలను పూర్తి చేయడం అసాధ్యం. అయితే ఈ వ్యాధికి లోనైన  బాధితుల జీవన విధానంలో కూడా విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయంటున్నారు నిపుణులు.


అధ్యయనంలో ఏం తేలింది?


ఇడియోపతిక్ హైపర్సోమ్నియా అనే ఈ వ్యాధి ఎంత ప్రబలంగా ఉందో అంచనా వేయడానికి 792 మంది వ్యక్తుల మీద నిపుణులు పరిశోధనలు చేశారు. ముఖ్యంగా  విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యయన రచయిత డేవిడ్ T. ప్లాంటే దీనిపై స్పందిస్తూ.. రోగ నిర్ధారణ చేయడమంటే ఖర్చుతో కూడుకున్నదని, అలాగే చాలా సమయం పడుతుందని తెలిపారు. దానివల్ల వ్యాధి తీవ్రతను గుర్తించడం కష్టమన్నారు.


అధ్యయనంలో భాగంగా పగటిపూట నిద్ర లేదా అలసటతో బాధపడుతున్న వ్యక్తులు ఎలా ఉంటారు? ఎంత సమయం నిద్రపోతున్నారనేది పరిశీలించినట్లు తెలిపారు. అలాగే వర్కింగ్‌ డేస్‌లోని రాత్రిళ్లు, వారాంతాల్లో ఎన్ని గంటలు నిద్రపోయారో కూడా పరిశీలించనట్లు పేర్కొన్నారు. ఈ వ్యాధి ఉన్నవారు రాత్రిపూట నిద్రపోవడానికి సగటున నాలుగు నిమిషాలు, న్యాప్స్ సమయంలో ఆరు నిమిషాలు తీసుకున్నారని.. ఈ డిజార్డర్‌ లేని వ్యక్తులు రాత్రిపూట నిద్రపోయేందుకు సగటున 13 నిమిషాలు సమయం తీసుకుంటున్నట్లు పరిశోధకులు తెలిపారు. తాము అధ్యయనం చేసిన 10 మంది వ్యక్తులలో 6 మంది వ్యక్తులు తరచుగా దీర్ఘకాలికంగా పగటిపూట నిద్ర పోయేవారని మిగతా నలుగురిలో ఈ లక్షణాలేవీ కనిపించలేదన్నారు పరిశోధకులు.


మరిన్ని పరిశోధనలు అవసరం


ఇడియోపతిక్ హైపర్సోమ్నియా ద్వారా బలహీనమైన వారిని గుర్తించడానికి, నిర్ధారించడానికి, చికిత్స చేయడానికి మరిన్ని పరిశోధనలు అవసరమంటున్నారు శాస్త్రవేత్తలు ఈ అదనపు పరిశోధనల వల్ల ఈ డిజార్డర్‌ రావడానికి గల కారణాలు కూడా స్పష్టంగా తెలుస్తాయంటున్నారు. అలాగే ఈ వ్యాధికు చేయాల్సిన కొత్త చికిత్సలను కూడా ఈ అదనపు పరిశోధనల ద్వారా తెలుసుకోవచ్చంటున్నారు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also read : పనిచేస్తుంటే కండరాలు పట్టేశాయా? అయితే ఈ రిలీఫ్ టెక్నిక్స్ మీకోసమే..