Medicos Protest in Adilabad RIMS: ఆదిలాబాద్ (Adilabad) రిమ్స్ (Rims) లో వైద్య విద్యార్థులపై దాడి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. రెండో రోజు కూడా జూనియర్ డాక్టర్లు (Junior Doctors) విధులకు దూరంగా ఉంటూ ఆందోళన కొనసాగించారు. అత్యవసర సేవలకు తప్ప మిగిలిన సేవలకు హాజరు కాబోమని స్పష్టం చేశారు. కాగా, ఇప్పటికే వైద్య విద్యార్థులపై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. డైరెక్టర్ పైనా కేసు నమోదైంది. రిమ్స్ హాస్టల్ ఆవరణలోకి బయటి వ్యక్తులను తీసుకొచ్చి దాడి చేయించిన ప్రొఫెసర్ డాక్టర్ క్రాంతి కుమార్ ను టర్మినేట్ చేశారు. అయితే, డైరెక్టర్ రాథోడ్ జైసింగ్ ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతవరకూ ఆందోళన ఆపేది లేదని స్పష్టం చేశారు. 


రంగంలోకి విచారణ కమిటీ


మరోవైపు, రిమ్స్ మెడికోలపై దాడికి సంబంధించి విచారణ కమిటీ రంగంలోకి దిగింది. డీఎంఈ ఆదేశాలతో నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రొఫెసర్లు శివప్రసాద్, వీవీ రావ్ బృందం రిమ్స్ కు చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తామని స్పష్టం చేశారు. అసలు బయటి వ్యక్తులు హాస్టల్ లోకి ఎందుకు వచ్చారు.? వైద్య విద్యార్థులపై దాడి ఎందుకు చేశారు.? దాన్ని ప్రోత్సహించింది ఎవరు.? ఎవరి ప్రమేయం ఎంత ఉంది.? అనే అంశాలపై పూర్తి విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి నివేదికను ఒకటి, రెండు రోజుల్లో ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు.


ఇదీ జరిగింది


ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో బుధవారం అర్ధరాత్రి వైద్య విద్యార్థులపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. రిమ్స్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న క్రాంతి కుమార్ కొందరి బయటి వ్యక్తులను తీసుకొచ్చి మెడికోలపై దాడికి పాల్పడగా పలువురికి గాయాలయ్యాయి. దీంతో వైద్య విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తరగతులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని, డైరెక్టర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని జూనియర్ డాక్టర్లకు నచ్చచెప్పిన వినలేదు. ఈ క్రమంలో రిమ్స్ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. గాయపడిన మెడికో కవిరాజ్ ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతి కుమార్, వసీం ఇతరులపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో వైద్య విద్యార్థులపై దాడి ఘటనకు సంబంధించి కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు కలెక్టర్ శ్యామలాదేవి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. గురువారం రిమ్స్ కళాశాలను సందర్శించిన కమిటీ ఘటనకు సంబంధించి ఆరా తీశారు. బయటి వ్యక్తులు లోపలికి రాకుండా రిమ్స్ లో భద్రత పెంచుతామని డైరెక్టర్ తెలిపినా వైద్య విద్యార్థులు శాంతించడం లేదు. డైరెక్టర్ ను మారిస్తేనే అందరికీ సరైన న్యాయం జరుగుతుందని పట్టుబడుతున్నారు. 


Also Read: Collector Security Suicide: భార్య, ఇద్దరు పిల్లలను చంపి కలెక్టర్ గన్ మెన్ ఆత్మహత్య - సిద్ధిపేట జిల్లాలో దారుణం