Tips to Avoid Muscle Cramps : ఇంట్లో ఏదైనా పని చేస్తున్నప్పుడు.. లేదా జిమ్​లో చెమటలు చిందించినప్పుడు కండరాలు పట్టేయడమో.. లేదా విపరీతమైన నొప్పి రావడమో జరుగుతుంది. ఆకస్మికంగా వచ్చే ఈ నొప్పి బాధను కలిగిస్తుంది కానీ.. కొన్ని టిప్స్ ఫాలో అయితే ఆ నొప్పిని ఇట్టే నివారించేయవచ్చు అంటున్నారు నిపుణులు. ఎక్కువ పని చేస్తున్నప్పుడు, కండరాల వ్యాయామం చేస్తున్నప్పుడు శరీరానికి శీఘ్ర శక్తి సరఫరా అవసరం. ఆ సమయంలో కండరాలు ఆక్సిజన్ కోసం చూస్తాయి. దానివల్ల కండరాల తిమ్మిరి, పట్టేయడం జరగవచ్చు. 


డీహైడ్రేషన్, రక్తప్రసరణ సరిగ్గా లేకపోవడం వంటివి ఈ సమస్యను ప్రేరేపిస్తాయి. అందుకే వ్యాయామం చేసే సమయంలో తగినంత నీటిని తీసుకోవాలి అంటారు. వ్యాయామానికి ముందు శరీరాన్ని స్ట్రెచ్ చేయకపోవడం వల్ల కూడా ఈ నొప్పి కలుగుతుంది అంటున్నారు. దీనివల్ల శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరగక.. నరాలు కుదించుకుపోయి.. కండరాల నొప్పికి దారితీస్తాయి. అయితే ఈ తిమ్మిరిని ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం. 


స్ట్రెచ్ చేయడం..


వ్యాయామం చేసే ముందు, తర్వాత కూడా స్ట్రెచ్ చేస్తే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. పైగా నొప్పిని నివారించడానికి స్ట్రెచింగ్​ అనేది ఉత్తమమైన మార్గం. స్ట్రెచ్స్ చేసేందుకు తేలికగా, సింపుల్​గా ఉన్నా.. శరీరాన్ని వార్మ్​అప్ చేస్తాయి. దీనివల్ల మెరుగైన రక్తప్రసరణ అందుతుంది. అంతేకాకుండా కండరాలను మరింత ఫ్లెక్సిబుల్​గా చేస్తాయి. మీరు ఎక్కువగా ఏ శరీరభాగంపై ప్రెజర్ చూపిస్తున్నారో.. వాటికి సంబంధించిన స్ట్రెచ్స్ చేయండి. ఇది మీకు మంచి ఉపశమనం ఇవ్వడమే కాకుండా.. శరీరానికి మెరుగైన రక్తప్రసరణను అందిస్తుంది. 


హైడ్రేటెడ్​గా ఉండండి..


కండరాలు పట్టేయడానికి, హైడ్రేటెడ్​గా ఉండడానికి లింక్ ఏముంది అనుకుంటున్నారా? తగినంత నీరు తాగకపోవడం వల్ల మీ కండరాలు నొప్పికి గురయ్యే అవకాశముందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. అందుకే వ్యాయామం చేసే సమయంలో నీరు తాగడం చాలా ముఖ్యం. ఏ సమయంలోనైనా మీ శరీరంలో తగినంత నీరు ఉండేలా చూసుకోండి. ఇది కేవలం కండరాలకే కాదు.. మొత్తం ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయం చేస్తుంది. కండరాల తిమ్మిరి నుంచి ఉపశమనం ఇస్తుంది.


మసాజ్..


కండరాల నొప్పి నుంచి ఉపశమనం కోసం మీరు మసాజ్ చేసుకోవచ్చు. లేదా చేయించుకోవచ్చు. లేదంటే మీకు ఫోమ్​ రోలర్లు మంచి ఆప్షన్. వీటిని నొప్పి, తిమ్మిరి తగ్గించేలా రూపొందించారు. కాబట్టి ఫోమ్​ రోలర్స్​తో మీ శరీరాన్ని సున్నితంగా మసాజ్ చేయండి. ఇది కండరాల నొప్పుల నుంచి ఉపశమనం అందిస్తుంది. అంతేకాకుండా రక్తప్రవాహాన్ని ప్రోత్సాహిస్తుంది. కండరాలను సడలించి.. నొప్పి ప్రభావాన్ని తగ్గిస్తుంది. 


హెల్తీ ఫుడ్


వ్యాయామం చేసిన తర్వాత హెల్తీ ఫుడ్ తీసుకోండి. కండరాల నొప్పిని తగ్గించడానికి.. మీరు మంచి ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్​ తీసుకోవడం చాలా ముఖ్యం. సమతుల్యమైన ఆహారం వ్యాయామం తర్వాత కండరాల నొప్పిని తగ్గించడంలో సహాయం చేస్తుంది. కండరాల నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. 


ఈ హోమ్ రెమిడీలు అన్ని.. మీకు చాలా వరకు ఎఫెక్టివ్​గా పనిచేస్తాయి. అయితే ఇవి చేసినా ఫలితం లేదు అనుకున్నప్పుడు వెంటనే ఫిజియో చేయించుకుంటే మంచిది. రోజులు దాటేకొద్ది సమస్య మరింత పెద్దదయ్యే అవకాశముంది. 


Also Read : పిల్లల్లో స్పైనల్ స్ట్రోక్ వస్తుందా? ఇది కూడా బ్రెయిన్ స్ట్రోక్​లాంటిదేనా?








గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.