ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేందుకు ఎంత టైమ్ పడుతుంది? వాతావరణం బాగుంటే రెండు గంటల్లోనే గమ్యానికి చేరుకోవచ్చు కదా. ఈ రెండు నగరాలకు మధ్య దూరం (ఏరియల్ డిస్టెన్స్) 1,253 కిలోమీటర్లు కాబట్టి అంత టైమ్ పడుతుంది.
అయితే, స్కాట్లాండ్‌లోని ఈ విమానం రెప్పపాటులో గమ్యానికి చేర్చేస్తుందంటే.. వెంటనే మీరు షాకవుతారు. ఆ తర్వాత అదెలా సాధ్యం అని ఆశ్చర్యపోతారు. కనీసం రాకెట్‌లో వెళ్లినా అది అసాధ్యం కదా అని అనుకుంటారు. కానీ మీరు అక్కడే పప్పులో కాలేశారు. గమ్యం అంటే మీరు ఇంకా ఢిల్లీ టు హైదరాబాద్ గురించే ఆలోచిస్తున్నారు. రెప్పపాటులో 1,253 కిలోమీటర్ల దూరంలోని గమ్యానికి చేరడం అసాధ్యం. కాబట్టి, మీరు ఆ విమానం బయల్దేరే ప్రాంతానికి, గమ్యస్థానానికి మధ్య దూరమెంతా? అని ఆలోచించాలి. ఎందుకంటే, ఆ విమానం ప్రపంచంలోనే అతి తక్కువ దూరం ప్రయాణిస్తుంది. మీరు గాలి పీల్చి వదిలేలోపు అది గమ్యస్థానానికి చేర్చేస్తుంది.
సాధారణంగా విమాన ప్రయాణం అంటే వంద కిలో మీటర్ల దూరం కంటే ఎక్కువే ఉంటుంది. కానీ, నోయెల్ ఫిలిప్స్ అనే ట్రావెల్ బ్లాగర్ అత్యంత తక్కువ దూరం కలిగిన విమాన ప్రయాణం గురించి ప్రపంచానికి వెల్లడించాడు. ఈ ప్రయాణానికి సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియా నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది. ఈ విమాన ప్రయాణం కేవలం ఒక నిమిషం 14 సెకన్లు. తన జీవితంలోనే అత్యంత తక్కువ దూరం విమాన ప్రయాణం ఇదే అని ఆయన వెల్లడించాడు. స్కాట్లాండ్ లోని పపా వెస్ట్రే, వెస్టే ఐలాండ్స్ మధ్య ఈ ప్రయాణం కొనసాగినట్లు నోయెల్ ఈ వీడియోలో తెలిపాడు.
ఈ విమాన ప్రయాణానికి సంబంధించిన నోయెల్ పలు ఆసక్తికర విషయాలను సైతం వెల్లడించాడు. ప్రపంచంలోనే తక్కువ దూరం కలిగిన విమాన ప్రయాణం చేయడమే కాదు.. ఓ స్కాట్లాండ్ ద్వీపంలో ఓ నైటంతా తాను బస చేసినట్లు తెలిపాడు. తాను ప్రయాణించిన పపా వెస్ట్రే, వెస్టే ఐలాండ్స్ మధ్య దూరం కేవలం 2.7 కిలో మీటర్లని వెల్లడించాడు. చాలా తక్కువ దూరం అయినా.. ఈ ప్రయాణానికి సదరు విమాన సంస్థ 17 పౌండ్లు అంటే.. భారత కరెన్సీలో రూ. 1,645 తీసుకున్నట్లు చెప్పాడు. ప్రపంచంలోనే అత్యంత దూరానికి అత్యంత ఎక్కువ చార్జీ తీసుకునే విమాన ప్రయాణం ఇదే అని నోయెల్ తెలిపాడు. ఈ విమానం రోజుకు రెండు ట్రిప్పులు వేస్తున్నట్లు పేర్కొన్నాడు. ప్రధానంగా పర్యాటకులను పపా వెస్ట్రే, వెస్టే ఐలాండ్స్ కు తీసుకువెళ్లి తీసుకువస్తున్నట్లు వెల్లడించాడు. ఈ విమానాన్ని లోగానెయిర్ అనే సంస్థ నిర్వహిస్తోందని నోయెల్ తన వీడియోలో వివరించాడు.
వాస్తవానికి తాను విమానంలో వెస్టే ఐలాండ్స్ కు చేరే జర్నీకి నిమిషం 14 సెకన్ల సమయం పట్టిందని నోయెల్ తెలిపాడు. విమానంలో కాకుండా ఒకవేళ బోట్ లో వెళితే సుమారు 20 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉందని ఆయన వెల్లడించాడు. అయితే, పడవ ప్రయాణంతో పోల్చితే విమాన ప్రయాణం చాలా తేలికగా, సౌకర్యవంతంగా ఉన్నట్లు వెల్లడించాడు. ప్రస్తుతం ఈయన పోస్టు చేసిన వీడియోకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. అంతేకాకుండా.. నెటిజన్ల నుంచి ఆసక్తికర కామెంట్లు వస్తున్నాయి. నోయెల్ వీడియో పుణ్యమా అని ఈ ఫ్లైట్ జర్నీ చేసేందుకు పర్యాటకులు మరింత ఆసక్తి చూపిస్తున్నట్లు ఆ విమాన సంస్థ వెల్లడించింది. అంతకు ముందు పర్యాటకులు పెద్దగా వచ్చేవారు కాదని.. నోయెల్ వీడియో తర్వాత వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తెలిపింది. నోయెల్ కు సదరు సంస్థ కృతజ్ఞతలు కూడా చెప్పింది.
Also Read : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ
Also Read : హాలీవుడ్ హీరోలతో పోటీ - ఎన్టీఆర్‌కు ఆస్కార్?