ప్రపంచంలో ఎక్కువ మంది మరణాలకు కారణమవుతున్న డీసీజ్ కార్డియో వాస్కులర్. వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ప్రకారం గుండె పోటు, స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్ వంటి పరిస్థితుల వల్ల ఏటా 20.5 మిలియన్ల కంటే ఎక్కువ మంది చనిపోతున్నారు. మన గుండెని పదిలంగా చూసుకోవాల్సిన బాధ్యత మనమీదే ఉంది. గుండెని ఆరోగ్యంగా చూసుకోవాలని హెచ్చరిస్తూ ఏటా సెప్టెంబర్ 29వ తేదీన ప్రపంచ హృదయ దినోత్సవం జరుపుతున్నారు. హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పిస్తారు. ఈ ఏడాది థీమ్ యూజ్ హార్ట్.. నో హార్ట్.


'యూజ్ హార్ట్' అంటే గుండె ఏమోజీని ఉపయోగించడం. ప్రస్తుత రోజుల్లో తమ భావాన్ని వంద మాటల్లో చెప్పడానికి బదులగా ఒక్క ఏమోజీతో వ్యక్తపరుస్తున్నారు. ఇవి అత్యంత ప్రజాదరణ పొందాయని వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ పేర్కొంది. అందుకే హార్ట్ ఏమోజీని పంపించి గుండె ప్రాముఖ్యత గురించి అందరికీ తెలియజేస్తున్నారు.


'నో హార్ట్' (హృదయాన్ని తెలుసుకో) అంటే గుండె ఆరోగ్యం గురించి పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూస్తున్నారు. ఎటువంటి ఆహారం గుండెని పరిరక్షిస్తుంది, ఏవి తింటే ప్రమాదంలో పడుతుందనేది తెలుసుకోవాలి. మనం దాన్ని జాగ్రత్తగా చూసుకున్నప్పుడే అది మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ ఏడాది వరల్డ్ హార్ట్ డే థీమ్ ప్రకారం మీ గుండె ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవడానికి సహాయపడే కొన్ని విషయాలు ఇవి. వీటిని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే మీ గుండె పదిలంగా ఉన్నట్టే లెక్క.


ఆరోగ్యకరమైన రక్తపోటు


అధిక రక్తపోటు అనేది గుండె ఆగిపోయే ప్రమాదాన్ని పెంచే ఒక సాధారణ సమస్య. అందుకే ఎప్పటికప్పుడు రక్తపోటు ఎంత ఉందనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. అధిక రక్తపోటు మాత్రమే కాదు తక్కువ రక్తపోటు కూడా గుండెకి మంచిది కాదు.


హార్ట్ బీట్


పల్స్ శరీరంలోని వివిధ భాగాలలో రక్తప్రవాహం, రక్తపోటుని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. నెమ్మది లేదా వేగవంతమైన హృదయ స్పందన రేటు గుండె ఆరోగ్యాన్ని చూపిస్తుంది. గుండె కొట్టుకునే వేగాన్ని బట్టి దాని ఆరోగ్యం తెలిసిపోతుంది.


రక్తపరీక్ష


ఒక చిన్న రక్తపరీక్షతో గుండె ఆరోగ్యాన్ని తెలుసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. బ్లడ్ లో సోడియం, పొటాషియం, క్రియేటినిన్ ఎంత వరకు ఉన్నాయనే తెలుసుకోవడానికి రక్తపరీక్ష సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యంతో ముడి పడి ఉంటుంది.


ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్


కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే ధమనుల్లో పేరుకుపోయి ఫలకాలు ఏర్పడతాయి. ఈ పరిస్థితి గుండె పోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలు ఉంచుకోవడం చాలా ముఖ్యం. రక్తపరీక్ష ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలని తెలుసుకోవచ్చు.


గుండెకి మేలు చేసే సమతుల్య ఆహారం తీసుకుంటూ క్రమం తప్పని వ్యాయామం చేస్తూ ఉండాలి. శరీరానికి శ్రమ ఉండే విధంగా చూసుకోవాలి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించుకుని మంచి కొలెస్ట్రాల్ పెంచుకోవాలి. గుండెని కాపాడుకునేందుకు ఆయిల్ తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు ఎంచుకోవాలి.


 గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: హైపర్ అసిడిటీని తగ్గించే ఆయుర్వేద ఆహార పదార్థాలు ఇవే